అమరావతి
ఆస్తుల క్రయ విక్రయాల ద్వారా వచ్చే స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం గతం కంటే ఈ ఏడాది 30శాతం పెరిగింది. గతేడాది ఇదే సమయానికి రూ.4,210 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకు రూ.5,495 కోట్ల ఆదాయం సమకూరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగిలిన రెండు నెలల ఆదాయం ఇంకా పెరిగే అవకాశముంది. డిసెంబర్‌లో అత్యధికంగా రూ.685 కోట్ల ఆదాయం వచ్చింది. జూలై, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్‌లలో రూ.600 కోట్లు కంటే ఎక్కువ ఆదాయం లభించింది. కరోనా కారణంగా మేలో రూ.211 కోట్ల ఆదాయం వచ్చింది.
విశాఖలో అత్యధికం.. శ్రీకాకుళంలో అత్యల్పం
► విశాఖ జిల్లా నుంచి అత్యధికంగా రూ.825 కోట్ల ఆదాయం వచ్చింది.
► ఆ తర్వాత కృష్ణా జిల్లాలో రూ.687.66 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.687.65 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.602 కోట్ల మేరకు ఆదాయం వచ్చింది.
► అతి తక్కువగా శ్రీకాకుళం జిల్లాలో రూ.139 కోట్ల ఆదాయం వచ్చింది.
► విజయనగరం, పశ్చిమ గోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రూ.227 కోట్లు, రూ.480 కోట్లు, రూ.289 కోట్లు, రూ.314 కోట్ల ఆదాయం లభించింది.
► రాయలసీమలో అత్యధికంగా కర్నూలు జిల్లాలో రూ.367.56 కోట్ల ఆదాయం రాగా, చిత్తూరులో రూ.333 కోట్లు, వైఎస్సార్ కడపలో రూ.236 కోట్లు, అనంతపురం జిల్లాలో రూ.296.99 కోట్ల ఆదాయం వచ్చింది.
డాక్యుమెంట్ల సంఖ్యలో గుంటూరు టాప్
ఇక గతేడాది 17,20,402 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. ఈ ఏడాది ఇప్పటివరకు 17,46,682 డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. రాబోయే రెండు నెలల్లో ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 1.95 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. కృష్ణాలో 1.71 లక్షలు, తూర్పు గోదావరిలో 1.80 లక్షలు, కర్నూలులో 1.59 లక్షలు, పశ్చిమ గోదావరిలో 1.51 లక్షల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి.
అతి తక్కువగా విజయనగరంలో 64 వేలు, శ్రీకాకుళం జిల్లాలో 67 వేల డాక్యుమెంట్లు రిజిస్టర్ అయ్యాయి. గతం కంటే మెరుగైన ఆదాయం లభించింది. ఆదాయానికి గండిపడుతున్న కొన్ని అంశాల్లో కొద్దిపాటి మార్పులు చేయడంద్వారా ఫలితాలు సాధించామని.. వినియోగదారులకు నాణ్యమైన సేవలు సత్వరం అందించేలా కూడా చర్యలు తీసుకుంటున్నట్లు స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ కమిషనర్ అండ్ ఐజీ వి.రామకృష్ణ తెలిపారు.