YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

బంగినపల్లి... భలే గిరాకీ

బంగినపల్లి... భలే గిరాకీ

కర్నూలు, మార్చి 21,
మామిడి కాయలు తిన్నా.. తినకపోయినా.. బంగినపల్లి మామిడి పండు పేరు తెలియని వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. బంగినపల్లి పేరు చెప్పగానే మామిడి ప్రియులకు నోరూరి పోవాల్సిందే.. అది అంత ఫేమస్ అనమాట. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ ఈ పండుకు భలే గిరాకీ ఉంది. జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ (జీఐ ట్యాగ్) అంటే భౌగోళిక గుర్తింపు పొందిన ఆంధ్రప్రదేశ్ బంగినపల్లి మామిడి కాయలు దక్షిణ కొరియాకు భారీగా ఎగుమతి అవుతున్నట్లు కేంద్రం పేర్కొంది.దేశీయంగా జీఐ ట్యాగ్ పొందిన వ్యవసాయ ఉత్పత్తులు ఏఏ దేశాలకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నాయనే విషయాలను గుర్తిస్తున్నట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ క్రమంలోనే మన బంగినపల్లి మామిడి దక్షిణ కొరియాకు ఎక్కువగా ఎగుమతి అవుతున్నట్లు అధికారులు గుర్తించారు. అదేవిధంగా భౌగోళిక గుర్తింపు పొందిన డార్జిలింగ్ టీ, బాస్మతి బియ్యం, నాగా మిర్చి, అసోం నిమ్మకాయలు, మణిపూర్ కచాయ్ లెమన్, మిజో చిల్లి, అరుణాచల్ ఆరెంజ్, మేఘాలయ ఖాసి, త్రిపుర క్వీన్ పైనాపిల్ ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.తెలుగు రాష్ట్రాల్లో బాగా పండే బంగినపల్లి మామిడి పండుకు 2017లో భౌగోళిక గుర్తింపు లభించింది. బంగినపల్లి మామిడికి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ ట్యాగ్ ఇవ్వాలని 2011లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దరఖాస్తు చేసుకోగా.. చెన్నైలోని జీఐ రిజస్ట్రీ 2017లో జియో ట్యాగ్ మంజూరు చేసింది.వందల ఏళ్ల నుంచి సాగులో ఉన్న బంగినపల్లి మామిడి పండును కర్నూలు జిల్లాలోని బనగానపల్లె, పాణ్యం, నంద్యాల ప్రాంతాల్లో పండిస్తారు. తెలంగాణలోని ఖమ్మం, మెదక్, రంగారెడ్డి ప్రాంతాల్లోనూ బంగినపల్లిని విరివిగా సాగు చేస్తారు. విదేశాల్లో ఉండే తెలుగు వాళ్లు వేసవిలో బంగినపల్లి మామిడి పండును ప్రత్యేకంగా తెప్పించుకునే తింటుంటారు. అందుకే అమెరికా, బ్రిటన్ తదితర ప్రాంతాలకు ఈ పండు ఎక్కువగా ఎగుమతి అవుతుండేది.. ఇప్పుడు ఆ జాబితాలో దక్షిణ కొరియా ప్రథమ స్థానంలో నిలిచింది.కర్నూలు జిల్లా బనగానపల్లె ప్రాంత నవాబులు తొలిసారిగా ఈ రకం మామిడిని సాగులోకి తీసుకొచ్చారు. 2017వ సంవత్సరంలో జీఐ ట్యాగ్ ఇచ్చిన తర్వాత మన బంగినపల్లి మామిడి పండుకు ప్రత్యేక గుర్తింపుతో పాటు విదేశాల్లోనూ మాంచి గిరాకీ లభించింది. విదేశాలకు ఎక్కువగా ఎగుమతి లభించడంతో రైతుకు మంచి ధరలు వస్తున్నాయి.

Related Posts