మాస్కో మార్చి 21,
భారత్ కు ఆయుధాల సరఫరా వివరాలను 1962 నుంచి పరిశీలిస్తే రష్యా ఒక నమ్మదగిన మిత్రుడిగా ఎప్పుడూ నిలిచింది. గడచిన ఐదు సంవత్సరాలుగా రష్యా నుంచి ఆయుధాల కొనుగోలు క్రమంగా తగ్గుతూ వచ్చినట్లు రక్షణశాఖ గణాంకాల ప్రకారం తెలుస్తోంది. అయితే.. ఇప్పటికీ రష్యా అగ్ర స్థానంలోనే ఉందని చెప్పాలి. దీని తరువాతి స్థానంలో అమెరికా నిలిచింది. 2021 వివరాల ప్రకారం భారత రక్షణ దిగుమతుల్లో 21.4 శాతం అమెరికా నుంచి వచ్చాయి. 2012-17లో 69 శాతం ఉన్న రష్యా రక్షణ దిగుమతులు క్రమంగా తగ్గుతూ 2017-21 నాటికి 46 శాతానికి తగ్గాయి. భారత్ కు రక్షణ అవసరాలను తీర్చటంలో ఇజ్రాయెల్ కూడా కీలక పాత్ర పోషిస్తోంది. 2021-22 గణాంకాల ప్రకారం ఆ తరువాతి స్థానాల్లో ఫ్రాన్స్, ఇటలీతో పాటు తదితర దేశాలు నిలుస్తున్నాయి. 1991-95 మధ్య కాలంలో అత్యధికంగా రష్యా నుంచి 62.5 శాతం రక్షణ ఉత్పత్తుల దిగుమతులు ఉన్నాయంటే ఇరు దేశాల మధ్య బంధాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.గడచిన 20 ఏళ్ల కాలంలో రక్షణ దిగుమతుల వివరాలు చూస్తే రష్యా నుంచి దిగుమతులు క్రమేణా తగ్గుతున్నాయి. ఆ స్థానాన్ని అగ్రరాజ్యం అమెరికా భర్తీ చేస్తోంది. దిగుమతుల్లో ఎక్కువగా డీజిల్ ఇంజిన్లు, నావెల్ గన్స్, టార్పెడోస్ తో పాటు యాంటీ షిప్ మిసైళ్లను ఇజ్రాయిల్ నుంచి వస్తున్నాయి. రష్యా దిగుమతులలో సగాన్ని అమెరికా, ఇజ్రాయిల్ ఆక్రమించాయి.1962 నుంచి గమనిస్తే రష్యా మూడోవంతు రక్షణ ఆయుధాలను భారత్ కు అందిస్తోంది. ప్రతి 936 రక్షణ ఉత్పత్తుల్లో 398 రష్యా నుంచే వస్తున్నాయి. దీని తరువాత ఫ్రాన్స్ నుంచి రాఫెల్ జెట్స్.. ఇజ్రాయిల్, ఫ్రాన్స్ నుంచి వందల సంఖ్యలో ఎయిర్ క్రాఫ్ట్స్ భారత్ కు దిగుమతి అవుతున్నాయి. 2020 గణాంకాల ప్రకారం హెలికాప్టర్లు ఎక్కువగా రష్యా నుంచి వస్తున్నాయి. ఇజ్రాయిల్ నుంచి రాడార్ వ్యవస్థలు.. జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్ నుంచి సోనార్ రక్షణ వ్యవస్థలు భారత్ కొనుగోలు చేస్తోంది.