వరంగల్, మార్చి 21,
సర్వేలలో కొందరు ఎమ్మెల్యేలు వెనకపడ్డారనే ప్రచారం ఉమ్మడి వరంగల్ జిల్లా టీఆర్ఎస్‌లో కాక రేపుతోంది. ఆయా నియోజకవర్గాల్లో సిట్టింగ్‌లను మార్చేస్తారనే ఆలోచనలతో.. కొందరు పార్టీ నేతలు కర్చీఫ్‌లు వేసుకునే పనిలో పడ్డారు. కార్యక్రమాల స్పీడ్ పెంచి.. అధిష్ఠానం దృష్టిలో పడేందుకు నానాపాట్లూ పడతున్నారట. పోటీకి సిద్ధమని సంకేతాలు పంపుతున్నారట. వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం అధికార టీఆర్‌ఎస్ క్రమంగా స్పీడ్ పెంచుతోంది. ఆశావహుల జాబితా కూడా ఎక్కువగానే ఉంది. ఇంతలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై నిర్వహించిన సర్వే పార్టీ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో అధికారపార్టీ శిబిరాన్ని వేడెక్కిస్తోంది సర్వేపై జరుగుతున్న ప్రచారం. ఉమ్మడి జిల్లాలో 12 నియోజకవర్గాలుంటే.. వాటిల్లో 11 చోట్ల టీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఈ పదకొండులో ఐదు చోట్ల ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉందని సర్వేలో గుర్తించారట. ఆ ఐదు నియోజకవర్గాలు ఏంటనేది తెలియకపోయినా.. ఎవరికి వారు ఒక అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. సీఎం కేసీఆర్ వ్యక్తిగతంగా చేయించిన సర్వేలలోనూ ఆ ఎమ్మెల్యేల గ్రాఫ్ తగ్గినట్టుగా చెవులు కొరుక్కుంటున్నారు. దాంతో అక్కడ సిట్టింగ్‌లను మార్చి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారనే ప్రచారం ఊపందుకుంది. ఆ ప్రచారాన్ని విశ్వసిస్తూ టికెట్ కోసం ఆశావహులు ప్రయత్నాలు ప్రారంభించేశారు.ఒకప్పుడు నియోజకవర్గాలకు దూరంగా ఉన్నవాళ్లంతా చిన్న ఆహ్వానం వస్తే చాలు.. మందీ మార్బలాన్ని వెంటపెట్టుకుని గ్రామాల్లో వాలిపోతున్నారు. మీకోసం మేము ఉన్నాం అని కనిపించిన వాళ్లందరికీ భరోసాలు ఇచ్చేస్తున్నారట. ఇన్నాళ్లూ కేడర్‌ను పట్టించుకోలేదని ఆరోపణలు ఎదుర్కొన్న నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెడుతున్నారట నాయకులు. వారిని చాలా ఆప్యాయంగా పలకరిస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా ఉద్యమ నాయకులు చాలా యాక్టివ్ అయినట్టు తెలుస్తోంది. స్థానికంగా తమకు పట్టు ఉందని నిరూపిస్తున్నారట.పార్టీ నేతల హడావిడి చూశాక.. సిట్టింగ్‌లలోనూ అలజడి మొదలైనట్టు చెబుతున్నారు. కేడర్ చెదిరిపోకుండా.. పట్టు నిలుపుకొనేందుకు పోటీగా ఎత్తుగడలు వేస్తున్నారట. దీంతో నిన్న మొన్నటి వరకు ఒక్కటిగా కనిపించిన గులాబీ శ్రేణులు.. వర్గాలుగా విడిపోతోంది. పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహిస్తూ బలం చాటే ప్రయత్నం చేస్తున్నారు. ఒక నియోజకవర్గంలో మాజీ మంత్రులు ఇద్దరికి ఎప్పటి నుంచో అస్సలు పడటం లేదు. ఈ దఫా అక్కడ ప్రత్యర్థిపై పైచెయ్యి సాధించేందుకు కుమార్తెను బరిలో దించే ఆలోచన చేస్తున్నారట వారిలో ఒక మాజీ అమాత్యుడు. నియోజకవర్గంలోని ముఖ్య నేతలతో సమావేశాలు నిర్వహిస్తూ సిట్టింగ్ ఎమ్మెల్యే శిబిరంలో చర్చగా మారారట.హడావిడి వెనక మరో కారణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు రేస్‌లో ఉంటే.. ఒకవేళ టికెట్ రాకపోయినా తర్వాతి కాలంలో మంచి గుర్తింపు వస్తుందని లెక్కలేసుకుంటున్నారు గులాబీ నాయకులు. మొత్తానికి సర్వే వివరాలు తెలియకపోయినా.. ఊహల ఆధారంగా పాగా వేసే పనిలో పడ్డారు ఆశావహులు. మరి.. ఎవరి ఆశలు పండుతాయో చూడాలి.