అమరావతి
ఐదవ రోజు కుడా టీడీపీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. కల్తీ నాటు సారాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జేబ్రాండ్ మద్యం వల్ల వందలాది మంది చనిపోతున్నారంటూ వరుసగా అయిదో రోజూ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకేష్ ఆధ్వర్యంలో ఆ పార్టీ శాసనసభాపక్షం నిరసనకు దిగింది. సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభిషేకం చేశారు. సీఎం ఫోటోపై మద్యం పోసి వినూత్నరీతిలో నిరసన చేపట్టారు. మద్య నిషేదం హామీ గోవిందా గోవిందా అంటూ నినాదాలు చేశారు. కల్తీ నాటుసారాతో పాటు జె బ్రాండ్తో జగన్ రెడ్డి జనాల ప్రాణాలు తీస్తున్నారని ప్లకార్డులు ప్రదర్శించారు. రాష్ట్రాన్ని జే బ్రాండ్ మద్యం, కల్తీసారా, గంజాయి, నార్కోటిక్స్ డ్రగ్స్ ముంచెత్తుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలో కరోనా మరణాలతో పోటీగా కల్తీ నాటు సారా మరణాలు చోటు చేసుకుంటున్నాయని నినాదాలు చేశారు. నాసిరకం మద్యం, నాటుసారాతో మహిళల మాంగల్యాలు జగన్ రెడ్డి తెంచుతున్నారని టీడీపీ నేతలు ప్లకార్డులు ప్రదర్శించారు. ముఖ్యమంత్రి మాటలు, పోలీసు ఎఫ్ఐఆర్లలో ఏది నిజం అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీలో అసత్య ప్రకటన చేసిన సీఎం రాజీనామా చేయాలని నినాదాలు చేశారు. కల్తీ సారా బాధిత కుటుంబాలకు రూ.25లక్షలు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇంకెన్ని సారా చావులు జగన్ రెడ్డి కోరుకుంటారని ప్లకార్డులు ప్రదర్శించారు. సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి అసెంబ్లీకి టీడీపీ శాసనసభ పక్షం నిరసన ర్యాలీ చేపట్టింది. కల్తీ సారా మరణాలపై ప్రశ్నిస్తే అన్యాయంగా తెలుగుదేశం సభ్యుల్ని సస్పెండ్ చేశారని మండిపడ్డారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చినరాజప్ప మాట్లాడుతూ.. నాటుసారా, చీప్ లిక్కర్ను జగన్ రెడ్డి ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. కల్తీ నాటుసారా, జే బ్రాండ్ మద్యం మరణాలపై న్యాయ విచారణ జరపాల్సిందే అని అన్నారు. ప్రజలు కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నా సీఎం వైఖరిలో మార్పు లేదని మండిపడ్డారు. ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మాట్లాడుతూ... అన్నపూర్ణగా పేరొందిన ఏపీ కాస్త మద్యాఆంధ్ర ప్రదేశ్గా మారిందన్నారు. ప్రజాకోర్టులో జగన్ రెడ్డికి శిక్ష తప్పదని హెచ్చరించారు.