విజయవాడ, మార్చి 22,
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. ఈ అంశం చుట్టూనే రాజకీయ మీడియా వర్గాల్లో జోరుగా చర్చలు సాగుతున్నాయి.ముఖ్యంగా అధికార వైసీపీలో అయితే, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చుట్టూనే అందరి ఆలోచనలు పరుగులు తీస్తున్నాయి. సహజంగా మంత్రి వర్గ విస్తరణ అంటే, అందరిలోనూ కొత్తగా ఎవరిని అదృష్టం వరిస్తుంది, అనే ఆసక్తే కనిపిస్తుంది. అయితే, ఇప్పుడు చిత్రంగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, కొత్తగా ఎవరికి అవకాశం కల్పిస్తారు అనేదాని కంటే, ప్రస్తుత మంత్రులో ఎంతమంది మిగులుతారు, ఎంతమంది మాజీలు అవుతారనే విషయంగానే ఎక్కువ ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. మరోవంక రోజులు దగ్గరయ్యేకొద్దీ, లెక్కలు మారుతున్న సంకేతాలు స్పష్టమవుతున్నాయి. దీంతో ఆశావహుల్లో ఆందోళన పెరిగి పోతోందని అంటున్నారు. మూడేళ్ళుగా మంత్రులుగా ఉన్న వారిలో ఎంతమంది మంత్రులుగా కొనసాగుతారు, ఎంతమందికి ముఖ్యమంత్రి ఉద్వాసన పలుకుతారు అనే విషయం పైనే ఆసక్తికర చర్చ జరుగుతోంది. ముందుగా ముఖ్యమంత్రి ప్రకటించిన విధంగా అయితే, ప్రస్తుత మంత్రులు అందరూ ఇంటికి పోవలసిందే. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తొలి మంత్రివర్గం తొలి సమావేశంలోనే, రెండున్నరేళ్ల తర్వాత, ఫస్ట్ బ్యాచ్ మంత్రులు అందరూ, తప్పుకుని కొత్త వారికి అవాకాశం ఇవ్వాలని క్లియర్ కట్’గా చెప్పారు. అయితే ఇప్పుడు కొందరు మంత్రులకు ముఖ్యమంత్రి మినహాయింపు ఇచ్చారని, ఆ విధంగా ఓ పది మంది వరకు మంత్రులు సెకండ్ బ్యాచ్’ లోనూ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు, నిజానికి, మొదట్లో మత్రులుగా కొనసాగే వారిలో బొత్స సత్యనారయణ, పెద్ది రెడ్డి వంటి కొద్దిమంది సీనియర్ల పేర్లు మాత్రమే వినిపించాయి. అయితే, రోజులు గడిచే కొద్దీ, కొనసాగే మంత్రుల సంఖ్య పెరుగుతోందని అంటున్నారు. మొత్తం 25 మంది మంత్రులలో, ఐదారుగు మాత్రమే వడపోతలు మిగులుతారని. మిగిలిన అందరికీ, ఉద్వాసన తప్పదని అనుకుని అనేక మంది ఆశలు పెంచుకున్నారు.దీంతో, ఆశావహుల్లో నిరాశ తొంగిచూస్తోందని అంటున్నారు. మరోవంక ఆశావహులు, ఎక్కేగడప,దిగేగడప అన్నట్లుగా కీలక నేతల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నారు. అయితే, ముఖ్యమంత్రి మనసులో ఏముందో ఎవరికీ తెలియదని, ఇతవరకు ఆయన ఒకరిద్దరు మినహా మరెవరితోనూ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ గురించి, మాట్లాడలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఆ ఒకరిద్దరితో కూడా క్లుప్తంగా మాట్లాడారే కానీ, తమ మనసులో ఏముందో బయట పెట్టలేదని అంటున్నారు. అదలా ఉంటే, వేకెన్సీలు ఎన్ని ఉంటాయో ఏమో తెలియక పోయినా, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఏ జిల్లా తీసుకున్నా, ఇద్దరు అంతకంటే ఎక్కువమందే ఆశలు పెట్టుకున్నారు.అలాగే, మంత్రి పదవులు ఆశిస్తున్న వారిలో స్పీకర్ తమ్మినేని సీతారామ్, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, కొలుసు పార్థసారధి, మాజీ చీఫ్ విప్ సామినేని ఉదయభాను, ఇంకా చాలా మందే ఉన్నారు. అయితే చివరకు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఏమి చేస్తారో , ఎవరిని అందలం ఎక్కిస్తారో, ఎవరికి నెక్స్ట్ టైమ్’ బెటర్ లక్’ అని పక్కన పెడతారో ఎవరికీ అంతుచిక్కడం లేదని అంటున్నారు. అన్నిటినీ మించి ఆశావహులు ఆశిస్తున్నట్లుగా, మంత్రి వర్గ విస్తరణ ఉగాదికి ఉంటుందా, లేక జూలై వరకు .. వాయిదా వేస్తారా .. అనేది ఇంకా తేలవలసే వుంది.