YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం నేరాలు ఆంధ్ర ప్రదేశ్

వివేకా కేసులో అడ్డంకులు

వివేకా కేసులో అడ్డంకులు

కడప, మార్చి 22,
ప్రత్యర్థిని నేరుగా ఢీకొట్ట లేనప్పుడు.. ఆ వ్యక్తికి మద్దతిస్తున్న వారిని బెదిరించు’ ఇది పూర్వీకులు చెప్పిన మాట. అంటే మన శత్రువును ఓడించాలంటే.. ఆ శత్రువుకు ఎవరి మద్దతు ఉందో, ఎవరి తోడ్పాటుతో మన మీదకు కాలుదువ్వుతున్నాడో గ్రహించాలన్నమాట. అలా మద్దతిచ్చే వ్యక్తిని మన ప్రత్యర్థికి దూరం చేస్తే.. సగం విజయం సాధించినట్లే అనేది వారు చెప్పిన మాట. ఏపీ సీఎం జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఒక్కొక్క రహస్యాన్ని ఛేదిస్తున్న సీబీఐ అధికారుల మీద కేసులు పడుతున్నవైనం పూర్వీకుల మాటను అక్షరాలా పాటిస్తున్నట్లు కనిపిస్తోందంటున్నారు విశ్లేషకులు.వివేకా హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారి రామ్ సింగ్ పై పులివెందుల బాకరాపురానికి చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి ఫిబ్రవరి 15న ఏఆర్ అడిషినల్ ఎస్పీ మహేశ్ కుమార్ కు ఫిర్యాదు చేశారు. వివేకా మర్డర్ కేసుకు సంబంధించి తనకు తెలిసిన విషయాన్నీ చెప్పినా సీబీఐ అధికారులు పట్టించుకోలేదని, తాము చెప్పినట్లు వినాలని తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించడమే కాకుండా కడప కోర్టులో పిటిషన్ వేశాడు. ఉదయ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేయాలని ఫిబ్రవరి 18న కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఐపీసీ 195ఏ, 323, 506 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద రిమ్స్ సీఐ సదాశివయ్య కేసు నమోదు చేశారు.అంతకు ముందు.. వివేకా హత్య కేసులో సీబీఐ తనకు 10 కోట్ల రూపాయలు ఆఫర్ చేసిందంటూ అనంతపురం జిల్లా యాడికికి చెందిన గంగాధర్ రెడ్డి జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం గమనార్హం. వివేకా హత్య కేసును తాను ఒప్పుకోవాలని సీబీఐ ఈ ఆఫర్ చేసిందని, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణ హాని ఉందని ఎస్పీకి గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశాడు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి పాత్ర ఉందని సాక్ష్యం చెప్పాలని, లేదంటే ఆ హత్య తానే చేసినట్లు ఒప్పుకోవాలని సీబీఐ తనపై ఒత్తిడి చేసిందని గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేయడం విశేషం.గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి తమ డిపార్ట్ మెంట్ పైనే కేసులు వేయడం వెనుక ఎవరి హస్తమో ఉండి ఉంటుందని సీబీఐ అధికారుకు అనుమానం వచ్చినట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే వారు చాప కింద నీరులా ఫిర్యాదు చేసిన వెనక ఉన్నది ఎవరనేది కూపీ లాగినట్లు తాజాగా అందుతున్న సమాచారం. వివేకా హత్య కేసులో అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి, వివేకా కుమార్తె సునీత, వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, అప్పటి పులివెందుల సీఐ శంకరయ్య, ఇంటి పనిమనిషి రంగయ్య తదితరులు ఇచ్చిన వాంగ్మూలాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులే వారి చేత సీబీఐ అధికారుల మీద కేసులు వేయించినట్లు తెలుసుకున్నారట.వివేకా హత్యకు స్కెచ్ వేసిన వారు, హత్యలో స్వయంగా పాల్గొన్నవారు, హత్యానంతరం ఆధారాలను తుడిపించి, ఆనవాళ్లు లేకుండా చేయించిన వారు, గుండెపోటుతో వివేకా మరణించారంటూ మీడియా ద్వారా లీకులు ఇచ్చి ప్రచారం చేసిన వ్యక్తులే ఇలా గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చేత కేసులు వేయించినట్లు సీబీఐ కూపీ లాగారని తెలుస్తోంది. దాంతో పాటుగా వైఎస్ వివేకా రాజకీయంగా తన ఎదుగుదలకు అడ్డొస్తున్నారనే అక్కసుతో ఆయన మర్డర్ కు స్కెచ్ వేసిన వ్యక్తే వీరిని ఉసిగొలిపి ఎదురు కేసులు వేయించినట్లు సీబీఐ విచారణలో తెలుసుకున్నట్లు సమాచారం. అలా ఉల్టా తమపైనే కేసులు వేయించడం వెనుక ఉద్దేశం సుస్పష్టం అని సీబిఐ భావిస్తోందట. కేసులు వేయించడం ద్వారా సీబీఐ అధికారులను తప్పుదోవ పట్టించడమే కాకుండా, కేసు దర్యాప్తు వేగాన్ని తగ్గించడం, విచారణ మరి కొంతకాలం ఆలస్యం చేయించడమే నిందితుల ఉద్దేశం అని సీబీఐ గుర్తించిందని సమాచారం. సీబీఐ అధికారుల మీదే కేసులు పెట్టించడం అంటే.. వివేకా హత్య కేసులో వారు వేగం పెంచకుండా నిరోధించడమే లక్ష్యంగా గంగాధర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి చేత నిందితులు కేసులు వేయించినట్లు చెబుతున్నారు.ఏదేమైనా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు తుది దశకు చేరిందని తెలుస్తోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలకు నోటీసులు ఇచ్చేందుకు సీబీఐ అధికారులు ప్రయత్నిస్తే.. వాటిని తీసుకునేందుకు తిరస్కరించారు. దీంతో సీబీఐ అధికారులు కడప కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి ఎంపీ కనుక ఆయన అరెస్ట్ కోసం సీబీఐ అధికారులు లోక్ సభ స్పీకర్ కు సమాచారం ఇచ్చారని, త్వరలోనే సీబీఐ ఉన్నతాధికారులు ఆయనను అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయంటూ మీడియాలో వార్తలు వస్తుండడం గమనార్హం.

Related Posts