YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

లిధియం బ్యాటరీతోనే సమస్య

లిధియం బ్యాటరీతోనే సమస్య

నెల్లూరు, మార్చి 22,
పెరుగుతున్న వాతావరణ కాలుష్యాన్ని అదుపుచేసేందుకు ప్రపంచమంతా విద్యుత్‌ వాహనాల వినియోగానికి మొగ్గు చూపుతోంది. 2040 నాటికి ప్రపంచంలోని పాసింజర్‌ వెహికిల్స్‌లో మూడింట రెండొంతులు విద్యుత్‌ వాహనాలే ఉంటాయని ‘బ్లూమ్‌బర్గ్‌’ అనే అంతర్జాతీయ మీడియా సంస్థ అంచనా వేసింది. మన దేశంలోనూ కేంద్ర ప్రభుత్వం 2070 నాటికి కర్బన ఉద్గారాలు సున్నాకు చేరేలా ప్రయత్నాలు చేస్తోంది. విద్యుత్‌ వాహనాల కోసం జాతీయ రహదారుల వెంబడి విద్యుత్‌ వాహనాల చార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు మన రాష్ట్రం సన్నాహాలు చేస్తోంది.బ్యాటరీ స్టోరేజ్‌ సాంకేతికతలు అభివృద్ధి చెందుతుండడంతో విద్యుత్‌ నిల్వ వ్యవస్థలూ పెరుగుతున్నాయి. విశాఖలోనూ బ్యాటరీలతో విద్యుత్‌ నిల్వ చేసే ప్రాజెక్టుల స్థాపనకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో విద్యుత్‌ నిల్వ, వాహనాలు నడిచేందుకు ప్రధానాధారమైన బ్యాటరీలు ప్రస్తుతానికి ఖరీదైనవే కాకుండా రీసైక్లింగ్‌కు కష్టతరమవుతుండటంపై ఇప్పుడు చర్చ సాగుతోంది.  ప్రస్తుతం ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఎక్కువగా లిథియం అయాన్‌ బ్యాటరీలను వినియోగిస్తున్నారు. కానీ, సాధారణ బ్యాటరీలను రీసైకిల్‌ చేసేందుకు ఉపయోగించే పద్ధతులు లిథియం బ్యాటరీ విషయంలో పనిచేయవు. లిథియం బ్యాటరీలు సాధారణ బ్యాటరీల కంటే పెద్దవి. వీటి నిర్మాణం సంక్లిష్టంగా ఉండటమే కాకుండా రీసైక్లింగ్‌లో ఏ మాత్రం తేడా జరిగినా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. వీటిని ల్యాప్‌టాప్స్, వాహనాలు, పవర్‌ గ్రిడ్స్‌ వంటి అనేక రంగాల్లో వినియోగిస్తున్నారు.సాధారణంగా రీసైక్లింగ్‌ ప్లాంట్లలో బ్యాటరీ భాగాలను చూర్ణం చేస్తారు. ఆ చూర్ణాన్ని అలాగే కరిగించడం(పైరోమెటలర్జీ) లేదా, యాసిడ్‌లో కరిగించడం(హైడ్రో మెటలర్జీ) చేస్తారు. కానీ లిథియం బ్యాటరీలను అలా చేయడం సాధ్యం కాదు. అంతేకాదు రీసైక్లింగ్‌లో తిరిగి ఉపయోగించేందుకు పనికొచ్చే ఉత్పత్తుల విలువ కంటే రీసైక్లింగ్‌ ప్రక్రియకు అయ్యే ఖర్చు చాలా ఎక్కువ. దీంతో 5 శాతం లిథియం బ్యాటరీలు మాత్రమే రీసైక్లింగ్‌ అవుతున్నాయి. ఒక టన్ను లిథియం తవ్వాలంటే 5 లక్షల గ్యాలన్ల(సుమారు 22,73,000 లీటర్ల) నీరు అవసరం. అలాగే పదేళ్ల తర్వాత.. వాడేసిన కోట్లాది లిథియం బ్యాటరీలను సమర్థంగా రీసైకిల్‌ చేసే వ్యవస్థలుండాలి. దీంతో లిథియం బ్యాటరీల రీసైక్లింగ్‌కు పర్యావరణ అనుకూల, తక్కువ ఖర్చు, సులభ పద్ధతుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరో వైపు లిథియం బ్యాటరీలు కాకుండా.. పర్యావరణ అనుకూల బ్యాటరీలను తయారు చేసేందుకు మరికొన్ని ప్రయాత్నాలు జరుగుతున్నాయి.సేంద్రియ పదార్థాలను సింథసైజ్‌ చేసి ఎలక్ట్రాన్‌లను పుట్టించేలా ఆర్గానిక్‌ రాడికల్‌ బ్యాటరీ(ఓఆర్‌బీ)లను తయారు చేస్తున్నారు. 2025 సంవత్సరం చివరికల్లా లక్షలాది ఎలక్ట్రానిక్‌ వెహికిల్‌ బ్యాటరీల జీవిత కాలం ముగుస్తుంది. అప్పటిలోగా వాటిని సమర్థంగా రీసైక్లింగ్‌ చేయగలిగే విధానాలను గాడిలో పెట్టడంతో పాటు ఆర్గానిక్‌ బ్యాటరీలు అందుబాటులోకొస్తే విద్యుత్‌ వాహనాలకు రవాణా రంగంలో తిరుగుండదు

Related Posts