హైదరాబాద్, మార్చి 22,
రాజ్యసభకి మైహోం రామేశ్వర్రావు. ఇదేదో గాసిప్ వార్త కాదు. బ్రేకింగ్ న్యూస్. అప్పుడో ఎప్పుడో కాదు.. అతిత్వరలోనే మైహోం అధినేతను పెద్దల సభలో కూర్చోబెట్టనున్నారు కమలనాథులు. రామేశ్వరరావు రాజ్యసభ సీటుకు.. బీజేపీతో పాటు చినజీయర్ ఆశీస్సులూ ఫుల్‌గా ఉన్నాయని తెలుస్తోంది. ఇప్పటికే, కేసీఆర్‌తో సంబంధాలు పూర్తిగా బెడిసి కొట్టడంతో.. ఇక క్షణం ఆలస్యం చేయకుండా, గులాబీ బాస్‌కు గట్టి ఝలక్ ఇచ్చేందుకు.. రామేశ్వరరావును బీజేపీ తరఫున రాజ్యసభకు పంపించనున్నారని సమాచారం. మరికొన్ని వారాల్లోనే తెలంగాణలో టీఆర్ఎస్ సభ్యులైన డి.శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావుల పదవీ కాలం ముగియనుంది. ఇదే సమయంలో యూపీ, కర్ణాటక నుంచి కూడా పలు ఖాళీలు ఏర్పడుతున్నాయి. దీంతో.. వీలైతే యూపీ.. లేదంటే కర్నాటక నుంచి మైహోం రామేశ్వరరావును రాజ్యసభకు పంపనుందట బీజేపీ. కేవలం, మోదీని, అమిత్‌షాను పొగిడినంత మాత్రానికే.. ఏళ్లుగా తనకు అత్యంత సన్నిహితులైన చినజీయర్ స్వామిని, రామేశ్వర్‌రావును పక్కన పెట్టేశారు కేసీఆర్. జీయర్ స్వామి లేకుండానే యాదాద్రి ఆలయ పునఃప్రారంభం చేస్తున్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మలపై ఎప్పుడో 20 ఏళ్ల క్రితం చేసిన వ్యాఖ్యల వీడియోను టీఆర్ఎస్ సోషల్ మీడియా విభాగం వైరల్ చేసి.. చినజీయర్ ఇమేజ్‌ను బాగా డ్యామేజ్ చేసింది. ఇక, మైహోం గ్రూప్ వ్యాపారాలపైనా కేసీఆర్ సర్కారు ప్రెజర్ పెడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే.. స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీని ఓన్ చేసుకున్న బీజేపీ.. ఇప్పుడిక చినజీయర్, మైహోం రామేశ్వర్‌రావులనూ తమ వారిని చేసుకునేందుకు సిద్ధమైంది. ఇప్పటికే చినజీయర్‌పై.. కేసీఆర్ మనిషి అనే ముద్ర తొలగిపోయి.. బీజేపీ స్వామిగా ప్రచారం జరిగిపోతోంది. ఇక, రామేశ్వర్‌రావును సైతం బీజేపీ నుంచి రాజ్యసభకు పంపించి.. కేసీఆర్ రివేంజ్ నుంచి రక్షణ కల్పించాలని భావిస్తోంది. వేల కోట్ల ఆస్తులు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, సిమెంట్ కర్మాగారాలు, ప్రముఖ మీడియా సంస్థల అధిపతి అయిన రామేశ్వర్‌రావుకు కేంద్రం-బీజేపీ ఆశీస్సులు తప్పనిసరిగా కావాలి. లేదంటే, కేసీఆర్ టార్గెట్‌కు బలయ్యే అవకాశాలు ఎక్కువ. అందుకే, బీజేపీ ఆఫర్‌కు రామేశ్వర్‌రావు సైతం వెంటనే ఒప్పేసుకున్నారని.. అందులోనూ పార్లమెంట్‌కు వెళ్లాలనేది ఆయన చిరకాల కోరిక కూడా అని తెలుస్తోంది.దీంతో.. ఇటు బీజేపీకి, అటు రామేశ్వర్‌రావుకు ఈ డీల్ విన్-విన్ సిచ్యుయేషన్ అంటున్నారు. జూపల్లి రామేశ్వరరావు బీజేపీలో చేరబోతున్నారని, ఆయనను రాజ్యసభకు పంపిస్తారని ప్రచారం సాగుతోంది. నెల రోజుల క్రితమే ప్రత్యేక ఆర్టికల్ పబ్లిష్ చేసింది. అది, అతిత్వరలోనే నిజం కాబోతోంది. యూపీ నుంచి బీజేపీ కోటాలో రామేశ్వరరావును పెద్దల సభకు ఎంపిక చేయడం దాదాపు కన్ఫామ్ అయిపోయిందని ఢిల్లీ బీజేపీ వర్గాల నుంచి కచ్చితమైన సమాచారం ఉంది. మరికొన్ని వారాల్లోనే ఆ మేరకు ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది.