YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

రామన్నకు ఇంటి సెగ

రామన్నకు ఇంటి సెగ

అదిలాబాద్, మార్చి 22,
అక్కడ గ్రూప్‌వార్‌ గుదిబండగా మారిందా? ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా మరో శిబిరం పుట్టుకొచ్చిందా? మున్సిపల్‌ ఎన్నికల సమయంలో మొదలైన వైరం ఇప్పుడు నియోజకవర్గం అంతా పాకిందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో కొంత కాలంగా ఎమ్మెల్యే జోగురామన్నకు సొంత పార్టీ నేతలకు మధ్య వైరం మొదలైంది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ నుంచి పోటీ చేసేందుకు అనుమతి ఇవ్వలేదనే కోపంతో.. అసంతృప్తులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నారు. ఎమ్మెల్యే కాదు.. ప్రజలకు మేమున్నాం అని వారు చేస్తున్న కామెంట్లు స్థానిక రాజకీయాన్ని వేడెక్కిస్తోంది. గతంలో మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌గా పనిచేసిన మనీషా పవన్‌రావ్‌ నేతృత్వంలో ఒక టీమ్‌ పనిచేస్తున్నట్టు చెబుతున్నారు. జైనాథ్‌, బేలా మండలాల్లో అధికారిక, అనధికారికి కార్యక్రమాలకు కూడా హాజరై పార్టీలో మేము కూడా ఉన్నామని పవన్‌రావ్‌ వర్గం స్థానికులకు చెబుతోందట. జోగు రామన్న సొంత మండలంలో సైతం పర్యటన చేస్తుండటంతో ఆదిలాబాద్‌ అధికారపార్టీలో చీలికలు వచ్చాయన్న ప్రచారం జోరందుకుంది. గ్రూప్‌వార్‌ను కిందిస్థాయి బలంగా తీసుకెళ్తున్నారట. మున్సిపల్‌ ఎన్నికల్లో జోగు రామన్న తన కుమారుడు జోగు ప్రేమేందర్‌ను మున్సిపల్‌ ఛైర్మన్‌ను చేశారు. ఆ సమయంలో తనకు వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడకుండా పార్టీ పరంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారట రామన్న. అప్పటికే ఛైర్‌పర్సన్‌గా ఉన్న మనీషాకు కౌన్సిలర్‌గా పోటీ చేసేందుకు కూడా అవకాశం కల్పించలేదని ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఆరోపిస్తోంది. పురపోరు సమయంలోనే దీనిపై దుమారం రేగింది. అప్పటి నుంచి రామన్న వ్యతిరేకవర్గం ఒక గొడుగు కిందకు చేరుతున్నట్టు చెబుతున్నారు. ఇప్పుడు వారి సంఖ్య అనూహ్యంగా పెరిగిందన్నది పార్టీ వర్గాల టాక్‌.నియోజకవర్గంలో ఇన్నాళ్లూ టీఆర్‌ఎస్‌ నేత గోవర్దన్‌రెడ్డి ఒక్కరే రామన్నకు వ్యతిరేకంగా మాట్లాడేవారు. ఇప్పుడు ఆయన తగ్గితే  ఆ స్థానాన్ని మనీషా పవర్‌రావ్‌ భర్తీ చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. వ్యతిరేకవర్గం గేర్‌ మార్చడంతో ఎమ్మెల్యే శిబిరం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. అయినప్పటికీ అసంతృప్తులు ఏ మాత్రం వెనకంజ వేయడం లేదట. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తుంటే మాకు పార్టీ పెద్దలు చెప్పారు.. అందుకే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నాం అని బదులిస్తున్నట్టు సమాచారం. మనీషా పవర్‌రావ్‌కు పార్టీలో ఓ సీనియర్‌ నేత అండ ఉన్నట్టు తెలుస్తోంది. గతంలో లోకల్‌ బాడీలలో ప్రజాప్రతినిధులుగా పనిచేసిన వారు సైతం వ్యతిరేకవర్గం శిబిరంలోకి వస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో రామన్నకు టికెట్‌ రాకుండా పావులు కదపాలన్న ఆలోచనలోనూ ఉన్నారట. మరి.. రానున్న రోజుల్లో ఆదిలాబాద్‌ టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాలి.

Related Posts