హైదరాబాద్, మార్చి 22,
సమస్యలను పక్కదారి పట్టించేందుకే.. కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని తెరపైకి తెచ్చారని సీఎం కేసీఆర్ తప్పుబట్టారు. కశ్మీర్‌లో హిందూ పండిట్‌లను చంపినప్పుడు బీజేపీ అధికారంలో లేదా? అని ప్రశ్నించారు. ఇప్పుడు చర్చ జరగాల్సింది చిత్రాలపై కాదని, రైతు సమస్యలపై చర్చ జరగాలని కేసీఆర్ అన్నారు. ఈనెల 25 నుంచి టీఆర్ఎస్ శ్రేణులు 'రైతు పోరు' పేరుతో ఆందోళన చేయాలని పిలుపునిచ్చారు. ధాన్యం కొనుగోలుపై ఎంపీలు పార్లమెంట్‌లో పోరాడాలని ఆదేశించారు. తెలంగాణ ఉద్యమం తరహాలో రైతు సమస్యలపై పోరాటం చేయాలని గులాబీ బాస్ పిలుపునిచ్చారు. గ్రామస్థాయి నుంచి ఢిల్లీ వరకు 'రైతు పోరు' ఉద్యమం కొనసాగాలన్నారు కేసీఆర్. రైతులు వేసే పంటలన్నింటికీ కేంద్రం గిట్టుబాటు ధర ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 24, 25 తేదీల్లో రైతు సమస్యలపై ఆందోళనలు నిర్వహిస్తామని తెలిపారు. లీగల్ సమస్యలు లేకుండా ఉద్యోగ నోటిఫికేషన్లు వేస్తామని చెప్పారు. 28న నేతలంతా యాదాద్రికి రావాలని కేసీఆర్ సూచించారు.‘కశ్మీర్ ఫైల్స్’లాగా త్వరలోనే ‘హైదరాబాద్ ఫైల్స్’ కూడా వస్తుందని బీజేపీ జాతీయ నేత మురళీధరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్ నుంచి ఇస్లామాబాద్ వరకు ఎంఐఎం.. టెర్రర్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తోందని ఆరోపించారు.నిజామాబాద్, బైంసా, నిర్మల్, బోధన్ ప్రాంతాలను ఉగ్రవాదానికి అడ్డాగా మార్చారని మురళీధర్‌రావు మండిపడ్డారు. టీఆర్ఎస్, పోలీసులు ఎమ్ఐఎమ్‌కి సహకరిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్, ఆదిలాబాద్‌లో లవ్ జిహాద్ కేసులలో పురోగతి లేదని.. బోధన్‌లో హిందువులను అక్రమ అరెస్టులు చేశారని మండిపడ్డారు. అసలు తెలంగాణ భారతదేశంలో ఉందా? లేదా పాకిస్థాన్‌లో ఉందా? అంటూ ప్రశ్నించారు బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు.మతోన్మాద, ఉగ్రవాద కార్యకలాపాలకు కారణం కేసీఆర్ అని.. హిందువుల ప్రాణాల, ఆస్తుల నష్టానికి కేసీఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. హోంమంత్రి మహమూద్ ఆలీ రోహింగ్యాలకు సహకరిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్ నుంచి హిందులు వలసలు ఎందుకు జరిగాయని నిలదీశారు. 1970 తర్వాత ఎందుకు హిందువుల సంఖ్య తగ్గిందో తెలియాలన్నారు మురళీధర్‌రావు.