కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల కన్నా ఘోరంగా చిన్నబోయింది. గాంధీ కుటుంబం నుంచి వచ్చిన వారసుడు రారాజుగా పిలుచుకునే రాహుల్ గాంధీ పార్టీని నడిపించడంలో తీవ్రంగా ఫెయిల్ అయ్యారనే వ్యాఖ్యలు జోరుగా వినిపిస్తున్నాయి. ప్రధానంగా బీజేపీలో ఆ ఇద్దరుగా పేరు తెచ్చుకున్న అమిత్ షా, మోడీల ద్వయాన్ని ఎదుర్కోవడంతో రాహుల్ గాంధీ ప్రజ్ఞా పాటవాలు ఎంత మాత్రమూ పనికిరావడం లేదని అంటున్నారు పరిశీలకులు. ఇప్పటి వరకు వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విఫలమైంది. రాహుల్ నాయకత్వంపై తమకు ఇప్పటికీ విశ్వాసం ఉన్నా ఆయన సోదరి ప్రియాంక గాంధీ వాద్రాకు పార్టీలో తక్షణం ప్రాధాన్యత ఇవ్వాలని ఆ పార్టీ శ్రేణులు కోరుతుండడం రాహుల్‌లోని నాయకత్వ లోపాన్ని ఎత్తి చూపుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పార్టీని విజయతీరాలకు చేర్చేందుకు ప్రియాంక గాంధీ అవసరం ఉందని కొందరు నేతలు గట్టిగా అభిప్రాయపడుతున్నారు. రాహుల్ నాయకత్వంలో పలు రాష్ట్రాల్లో పార్టీ ఓటమి పాలవుతుండటంతో ఆయన నాయకత్వంపై పలువురు నేతల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీని అభిమానించే కార్యకర్తలు వరుస ఓటములతో డీలాపడుతున్నారు. పార్టీలో ప్రియాంకకు సముచిత స్ధానం ఇవ్వాలని గత కొన్నేళ్లుగా గట్టి డిమాండ్ వినిపిస్తున్నా కర్ణాటకలో పార్టీ ఓటమితో ఈ డిమాండ్ మళ్లీ తెరపైకి వచ్చింది.
ముఖ్యంగా గోవా, మణిపూర్ వంటి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేతిదాకా అందినా కాంగ్రెస్ వినియోగించుకోలేక పోవడంతో బీజేపీ టక్కున దూకి అధికార పగ్గాలు అందుకుంది. ఇక, యూపీలోనూ కాంగ్రెస్ సత్తా చాటలేక పోయింది.
అక్కడి అధికార పార్టీ ఎస్పీతో పొత్తు పెట్టుకున్నా రెండంకెల సీట్లకు సైతం చేరుకోలేదు. అదేవిధంగా అసోంలోనూ పరిస్థితి ఇంతే. ఇప్పుడు తాజాగా కాంగ్రెస్ చేసిన వ్యూహ లోపం.. కర్ణాటకలో ఆ పార్టీకి చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ ఓటమితో ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం అలుముకుంది. పెద్ద రాష్ట్రంలో అధికారం కోల్పోవడం కాంగ్రెస్‌కు గట్టి షాక్ ఇచ్చింది. దేశంలోని 22వ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటు దిశగా మెజారిటీ సాధించడంతో కాంగ్రెస్ విస్తుపోయింది. ఆ పార్టీ చీఫ్ రాహుల్ గాంధీ కర్ణాటకలో విస్తృతంగా ప్రచారం చేపట్టి ఇక నుంచి పార్టీకి ఓటమి ఉండదని భరోసా ఇచ్చినా, పార్టీ తుదివరకూ పోరాడినా దిగ్భ్రాంతికర ఫలితాలు ఎదురవ్వడం మింగుడుపడటం లేదు.రాహుల్ గాంధీ కర్ణాటకలో కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మూడు నెలల పాటు మకాం వేసి రాష్ట్రంలోని 30 జిల్లాల్లోనూ పర్యటించి ఓ రికార్డు కూడా క్రియేట్ చేశారు. ఆయన సభలకు జనాల నుంచి మంచి స్పందనే వచ్చింది. అయితే చివర్లో మోడీ ఎంటర్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయ్యి మోడీ ఛరిష్మా ముందు రాహుల్ తేలిపోయారు. ఇక ప్రియాంక ఇప్పటివరకూ తన రాజకీయ కార్యకలాపాలను గాంధీ కుటుంబం బరిలో నిలిచే అమేథి, రాయ్‌బరేలి నియోజకవర్గాలకే పరిమితం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో తన తల్లి సోనియా, సోదరుడు రాహుల్ తరఫున మాత్రమే ప్రియాంక ప్రచారం నిర్వహించారు. అయితే, ఇప్పుడు మారుతున్న రాజకీయ సమీకరణలు, మోడీ, షాలను ఎదుర్కొనడం అటుంచి, కాంగ్రెస్ వైపు ప్రజలను తిప్పగలిగే చరిష్మా ఉన్న నాయకులు కాంగ్రెస్‌కు అత్యవసరం. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ పోలికలను పుణికి పుచ్చుకున్న ప్రయాంక అయితే, దేశ ప్రజలకు కనెక్ట్ అవుతుందని భావిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.