YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీ పై పట్టుబిగిస్తున్న జగన్

పార్టీ పై పట్టుబిగిస్తున్న జగన్

సంకల్పమే సగం బలం అంటారు. మొండి… జగమొండి గా పేరుబడ్డ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాదయాత్ర ద్వారా 2000 కిలోమీటర్ల మైలు రాయిని దాటి ప్రజాసంకల్ప యాత్రలో ముందడుగు వేశారు. ఇడుపుల పాయనుంచి ఇచ్ఛాపురం వరకు 3 వేలకిలోమీటర్ల లక్ష్యాన్ని ఏపీలోని 13 జిల్లాలను కలుపుతూ పాదయాత్ర చేస్తున్నారు జగన్. జగన్ తొలిరోజు 8.9 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. కడప జిల్లాలో 100 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం గొట్లూరు లో 500ల కిలోమీటర్ల మైలు రాయి దాటారు. చిత్తూరు మీదుగా నెల్లూరు చేరుకున్న జగన్ సైదాపురం దగ్గర 1000 కిలోమీటర్ల మైలు రాయి అధిగమించారు. ఆ తరువాత గుంటూరు జిల్లా ములుకుదురు దగ్గర 1500 కిలోమీటర్ల రికార్డ్ అధిగమించి సాగిపోయారు. ఇక తాజాగా కృష్ణా జిల్లా మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి జగన్ తాజా రికార్డ్ 2000 ల కిలోమీటర్లకు వేదిక అయ్యింది.ఒకసారి వాయిదా పడి తిరిగి నవంబర్ 6 వతేదీన ఇడుపులపాయలో తన తండ్రి సమాధికి నమస్కారం చేసి బయల్దేరిన జగన్ కి పాదయాత్ర ముళ్లబాటే అని చెప్పాలి. యాత్ర సంకల్పించినప్పుడే కోర్టు ద్వారా తొలి ఇబ్బంది ఎదుర్కొన్నారు జగన్. ప్రతి శుక్రవారం తన కేసులనుంచి ప్రత్యక్ష హాజరును మినహాయించాలని ఆయన పెట్టుకున్న అభ్యర్ధన తిరస్కరించింది. కోర్టు ఇచ్చిన ఝలక్ కి జంక లేదు జగన్. ఇక జగన్ పాదయాత్రకు బ్రేక్ పడిందని ప్రత్యర్ధులు సంబరపడే సమయంలోనే సంచలన నిర్ణయానికి తెరతీశారు జగన్. కోర్టు ఆదేశాలు తూచా తప్పకుండా పాటిస్తూ తన పాదయాత్ర కొనసాగించాలన్న నిర్ణయం తీసుకున్నారు.46 ఏళ్ళ యువనేత జగన్ ఈ రెండువేలకిలోమీటర్ల మజిలీలో అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. వెన్ను నొప్పి తొలి రోజుల్లోనే ఎదురైంది. కాలికి బొబ్బలు షరా మామూలు అయిపోయాయి. ఇక జ్వరం జలుబు, డస్ట్ ఎలర్జీలు సరే సరి. అనేక సందర్భాల్లో వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని కోరినా ఆయన లెక్క చేయలేదు. యాత్ర కొనసాగించడంపైనే దృష్టి పెట్టారు. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా జిల్లాల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా మాదేపల్లి దగ్గర 2000 కిలోమీటర్ల మైలు రాయిని విజయవంతంగా అధిగమించారు. ఇంత చిన్న వయస్సులో ఇలాంటి లక్ష్యాన్ని అధిగమించిన నేతగా రికార్డ్ కి ఎక్కారు. తనతండ్రి వైఎస్సాఆర్ స్థాపించిన పాత పాదయాత్ర రికార్డ్ ను అధిగమించి తండ్రికి మించిన కుమారుడిగా సరికొత్త రికార్డ్ ను నెలకొల్పబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి.జగమొండి జగన్ వైఖరిలో చాలా మార్పులకు వేదికైంది. వైఎస్ చనిపోయిన తరువాత ఆయన చేపట్టిన ఓదార్పు యాత్ర. ఎవరైతే తన తండ్రి కోసం అసువులు బాసారో వారి కుటుంబాల్లో ధైర్యం నింపేందుకు చేపట్టిన ఓదార్పు యాత్ర ఒక రికార్డ్ గానే చెప్పొచ్చు. ఆ యాత్రలో తనతండ్రి కారణంగా ఎందుకు అంతమంది చనిపోయారో సవివరంగా తెలుసుకోగలిగారు జగన్. వైఎస్ చాలామంది గుండెల్లో కొలువైన దేవుడు గా గుర్తించారు. వారు అలా ఎందుకు ఆరాధిస్తున్నారో తెలుసుకున్న జగన్ ఆ తరువాత ప్రజలకు దూరంగా వున్న సందర్భాలు బాగా తక్కువ. నిత్యం ప్రజలమధ్యే గడుపుతూ వారితో మమేకం అయిపోయారు. ఇక ప్రజాసంకల్ప యాత్ర ఆయన రాజకీయ ప్రస్థానంలో ప్రజల కష్టనష్టాలను స్వయంగా చూసే వీలుకల్పించింది. ఒక రాజకీయ లక్ష్యంతో చేపట్టిన పాదయాత్రలో అనేక సమస్యలు, వాటి పరిష్కారాలు, ప్రజలు తమ నేతలనుంచి ఏమి కోరుకుంటున్నారో పూర్తిగా తెలుసుకోగలుగుతున్నారు జగన్.జగన్ యాత్ర ప్రారంభం నుంచి ఒక వైపు అధికారపార్టీ మొదలు కొని అన్ని వైపులనుంచి విమర్శలు వర్షంలా కురుస్తున్నాయి. ఇంకోవైపు వేలాదిగా ప్రజలు జగన్ యాత్రలో పాల్గొంటూ రాజశేఖర రెడ్డి తనయుడిపై ప్రేమగా పూల వర్షం కురిపిస్తున్నారు. ఈ రెండిటిని సమానంగానే స్వీకరిస్తూ భావోద్వేగాలకు లోనుకాకుండా తన అడుగులు ముందుకు వేస్తూ ఔరా అని సాగిపోతున్నారు బహుదూరపు బాటసారిలా. అధికార పార్టీపై నిప్పులు కురిపిస్తూ ఎక్కడికక్కడ ప్రజాసమస్యలు ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వినూత్న రీతిలో ఆకట్టుకుంటున్నారు. ఈ ఆరునెలల వ్యవధిలో సుమారు 73 నియోజకవర్గాల్లో జగన్ పర్యటించారు. జగన్ పర్యటన లో మొత్తం 125 అసెంబ్లీ నియోజకవర్గాలు వున్నాయి. వాటిలో సగానికి పైగానే యాత్రను ఆయన దాటేశారు. ఇక ఈ యాత్రలో కవర్ కానీ 50 నియోజకవర్గాల్లో బస్సు యాత్ర ద్వారా కలవడానికి ఆయన ఎన్నికలముందు సిద్ధం అవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన ఇప్పటికే 60 శాతం అభ్యర్థులను ఖరారు చేసేసారు. ఇలా అటు పార్టీని ఇటు ప్రజా సమస్యలకు సమాన ప్రాధాన్యత ఇస్తూ రాబోయే ఎన్నికల కురుక్షేత్రానికి వైసిపి అధినేత సర్వ సన్నద్ధం కావడం విశేషం.

Related Posts