తిరుపతి, మార్చి 23,
అధికారపార్టీ వైసీపీలో ఫైర్‌బ్రాండ్ ఎమ్మెల్యే రోజా. చిత్తూరు జిల్లా నగరి నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. శాసనసభ్యురాలిగా మొదటి టర్మ్ విపక్షంలోనే గడిచిపోయింది. గత ఎన్నికలలో వైసీపీ పవర్‌లోకి రావడంతో అధికారపక్షంలో ఉన్నారు. రోజా ది ఫైర్‌బ్రాండ్ అనే ట్యాగ్ లైన్ చూసి తప్పకుండా కేబినెట్‌లోకి తీసుకుంటారని 2019లోనే ఆశించారు. సామాజిక, జిల్లా రాజకీయ సమీకరణాల వల్లో ఏమో మంత్రివర్గంలో చోటు దక్కలేదు. రెండున్నరేళ్ల తర్వాత కేబినెట్ ప్రక్షాళన ఉంటుందని సీఎం జగన్ చెప్పడంతో ఆ మాట పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు సీఎం జగన్ ఆ దిశగా కసరత్తు ఉంటుందని స్పష్టం చేయడంతో రోజా ఆశలు రెట్టింపు అయ్యాయట.మంత్రి కావాలన్నది రోజా బలమైన ఆశగా చెబుతారు ఆమె సన్నిహితులు. అది దక్కకపోవడం వల్లే అప్పట్లో ఫైర్ తగ్గింది. తర్వాత సర్దుకుని గాడిలో పడ్డారు. APIIC ఛైర్‌పర్సన్ పదవి వరించింది. గడువు తీరడంతో ఆ పదవిలోకీ ఇంకొకరు వచ్చేశారు. ప్రస్తుతం ఎమ్మెల్యే తప్ప చేతిలో ఇంకే పదవీ లేదు. కేబినెట్‌లోకి తీసుకొనే ఆలోచన ఉండటం వల్లే మరో నామినేటెడ్ పదవి ఇవ్వలేదన్నది రోజా అనుచరుల మాట. ఈ సందర్భంగా అధిష్ఠానం ఆశీసులు దక్కాలని మునుపటిలా టీడీపీపై విరుచుకుపడుతున్నారు రోజా. దైవబలం కూడా ఉండాలని రోజా తిరగని గుడి లేదు.. మొక్కని దేవుడూ లేడు. నగరి ఎమ్మెల్యే రోజాకు దైవభక్తి ఎక్కువే. తరచూ తిరుమల వెళ్తారు. ఈ మధ్య కాలంలో తిరుమల మరిన్ని ఎక్కువసార్లు వెళ్తూ… మనసులో కోరికను స్వామివారికి నివేదిస్తున్నారట.రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలన్నింటినీ చుట్టేశారు రోజా. ఒక్క గుళ్లే కాదు.. మారుమూల గ్రామాల్లో కొందరికి అమ్మవారు ఆవహిస్తారని.. ఆ సమయంలో ఆశీసులు తీసుకుంటే మేలు జరుగుతుందని తెలిస్తే అక్కడికి వెళ్లిపోతున్నారు. అలా విజయనగరం జిల్లా మక్కువ మండలం పాపయ్యవలస గ్రామంలోనూ తళుక్కుమన్నారు. అక్కడ దుర్గమ్మను దర్శించుకుని అంబ పలికేతే చాలు.. అధిష్ఠానం ఆశీసులు అందితే చాలన్నట్టుగా పూజలు నిర్వహించారు రోజా.
ఇటీవల హైదరాబాద్ ముచ్చింతల్‌లో సమతామూర్తి విగ్రహావిష్కరణలో పాల్గొని ఆథ్యాత్మిక తన్మయత్వంలో మునిగి తేలారు ఎమ్మెల్యే రోజాఏదో ఒక దేవుడు లేక దేవత తన మొర ఆలకించక పోతారా.. ఆశ నెరవేరకపోతుందా అని భావించి తెలంగాణలోని మరో పుణ్యక్షేత్రం యాదాద్రిలోనూ ప్రత్యక్షం అయ్యారు రోజా. ఇటీవలే తూర్పుగోదావరిలోని పంచారామ క్షేత్రాలను దర్శించి.. భోళాశంకరుడికి తన కోరికను నివేదించి వచ్చారు రోజా. సామర్లకోట, ద్రాక్షారామాల్లో పూజలు చేశారు. ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంకేశ్వర స్వామి, త్రిపుర సుందరీ సన్నిధిలో కనిపించారు రోజా. కేబినెట్‌లో చోటు దక్కితే అదే పదివేలన్నట్టుగా ఆదిదంపతులకు ప్రత్యేక పూజలు చేశారు.పూజల్లో లోటు లేదు.. భక్తిలో తగ్గేదే లేదన్నట్టుగా రోజా ఆలయాల యాత్ర సాగుతోంది. కేబినెట్ ప్రక్షాళన గడువు సమీపించేలోపు మేడమ్ జాబితాలో మరిన్ని ఆలయాలు చేరే అవకాశం లేకపోలేదు. మరి.. అధిష్ఠానం ఆశీసులు లభించేలా ఏ దేవీదేవతలు రోజాను కరుణిస్తారో చూడాలి.