విజయవాడ, మార్చి 23,
నిబంధనలు తుంగలో తొక్కడంలో జగనన్న తర్వాతే ఎవరైనా. రూల్స్ ఒప్పుకోకున్నా.. తన వారిని అందలమెక్కించారు. అడ్డగోలుగా పదవులు పంచేశారు. కేంద్రం కాదూకూడదన్నా వినిపించుకోలేదు. ఇక ఇలా అయితే కుదరదని.. ఢిల్లీ నుంచి స్ట్రాంగ్ వార్నింగ్ వచ్చింది. ఇక చేసేది లేక, తప్పేలా లేదని.. తన వారితో రాజీనామాలు చేయించింది. ఇలా స్మార్ట్ సిటీ మిషన్ ఛైర్మన్ల విషయంలో జగనన్నకు బిగ్ షాక్ తగిలింది. ఇంతకీ మేటర్ ఏంటంటే.. స్మార్ట్ సిటీల నామినేటెడ్ చైర్మన్ల విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. తిరుపతి, ఏలూరు, విశాఖ, కాకినాడ స్మార్ట్ సిటీల చైర్మన్లు తమ పదవులకు రాజీనామా చేశారు. విశాఖ స్మార్ట్ సిటీ ఛైర్మన్ జి.వెంకటేశ్వర రావు, కాకినాడ స్మార్ట్ సిటీ చైర్మన్ ఏ.రాజు బాబు, ఏలూరు స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ బి.అఖిల, తిరుపతి స్మార్ట్ సిటీ ఛైర్ పర్సన్ ఎన్. పద్మజలు తమ పదవులకు రాజీనామా చేశారు. సాంకేతికంగా స్మార్ట్ సిటీ మిషన్లకు నామినేటెడ్ నియామకాలు చెల్లవని కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ధి శాఖ ఏపీ ప్రభత్వానికి లేఖ రాసింది. తక్షణం రాజీనామాలు చేయించాలని గత డిసెంబర్‌లో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ తేల్చి చెప్పింది. కేంద్ర ప్రభుత్వం రాసిన లేఖ మేరకు రాష్ట్రంలో స్మార్ట్ సిటీ మిషన్ చైర్మన్లతో ప్రభుత్వం రాజీనామాలు చేయించింది. ఇన్నాళ్లుగా నిధులు లేకున్నా.. ఆఫీసు, సిబ్బంది కూడా లేకున్నా.. నామినేటెడ్ పోస్టులతో ఫోజులు కొట్టారు ఆ నలుగురు వైసీపీ నేతలు. తాజా రాజీనామాలతో అధికార పార్టీ పరువు పోయినట్టైంది. అయితే, సీఎం జగన్‌కు పంపిన లేఖల్లో వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్టు తెలపడం ఆసక్తికరం.