YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వివాదమవుతున్న జప్తు పథకం

వివాదమవుతున్న జప్తు పథకం

కాకినాడ, మార్చి 23,
పన్నులు కట్టకపోతే.. ఆస్తులు జప్తు చేసే విధానం ఇవాళ కొత్తగా వచ్చిందా?‘.. ఇదీ ఏపీ మున్సిపల్‌ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్య. ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహజ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. కరెంట్ కట్టకపోతే ఫ్యూజులు తీసేస్తామనడం తప్పు అంటే ఎలా? పన్నులు కట్టకపోతే ఆస్తులు జప్తు చేస్తామని చెప్పటం తప్పు అంటే ఎలా అనేది ఆయన ప్రశ్న. గత ప్రభుత్వాలు ఆస్తులు జప్తు చేసినప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అనేది బొత్స తీసిన లాజిక్‌. ఆస్తి పన్ను వసూలు కోసం ఓ మున్సిపల్‌ కార్పొరేషన్‌ బ్యానర్ ఏర్పాటు చేయడం, సామాన్లు జప్తు చేస్తామని ఆ బ్యానర్‌ ద్వారా బెదిరింపులకు దిగడంలో తప్పేమీ మంత్రి బొత్సకు కనిపించలేదంటున్నారు.నవరత్నాలు అమలు చేస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్‌ రెడ్డి సర్కార్‌ కొత్తగా పదో రత్నం.. ‘జప్తు పథకం’ తీసుకొచ్చినట్లు ఉందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవరత్నాల్లో పథకా అమలు ఎలా ఉన్నప్పటికీ జగనన్న జప్తు పథకాన్ని మాత్రం ఠంచన్‌ గా అమలు చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి దాకా ఆస్తి పన్ను, ఆదాయపు పన్ను, వృత్తి పన్ను, అమ్మకపు పన్ను లాంటి ట్యాక్పుల్ని మనం కడుతూనే ఉన్నాం. అయితే.. అసలే ఖజానాలో కాసుల కొరతను కొని తెచ్చిపెట్టిన జగన్‌ రెడ్డి సర్కార్‌ కు కొత్తగా చెత్త పన్ను వసూలు చేయడానికి అడ్డగోలు పనులు చేయడం మొదలుపెట్టింది. చెత్త పన్ను కట్టలేదని కర్నూలులోని కొండారెడ్డి బురుజు సమీపంలోని దుకాణాల ముందు మున్సిపల్ అధికారులు చెత్త గుమ్మరించడం విమర్శలకు దారితీసింది. అలాగే పన్ను బకాయిలు చెల్లించని వారి సామాన్లు జప్తు చేస్తామంటూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఫ్లెక్సీలు కట్టడంపై వివాదం రాజుకుంది. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఇంటిపన్ను, కుళాయి పన్ను, జగన్‌ రెడ్డి సర్కార్ కొత్తగా తెచ్చిన చెత్త పన్ను చెల్లించలేదని మున్సిపల్ అధికారులు రెండు ఇళ్లకు సీళ్లు వేయడం కూడా వివాదాస్పదం అయింది. పన్నులు కట్టాలంటూ మున్సిపల్‌ అధికారులు కాల్‌ మనీ వడ్డీ వ్యాపారుల మాదిరిగా పీడించుకు తింటున్నారంటూ పలువురు ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల తీరుతో స్థానికులు తీవ్ర ప్రతిఘటించడం, ఆందోళనలకు దిగుతున్న సంఘటనలు జరుగుతుండడం విశేషం.నిజానికి ప్రతి పౌరుడూ ప్రత్యక్షంగానో.. పరోక్షంగానో ఏదో విధంగా ఏదో రకంగా పన్ను కడుతూనే ఉంటాడు. ఇంటి అవసరాలకు కొనుక్కునే వస్తువుల నుంచి రెస్టారెంట్‌ లో భోజనం చేయడం దాకా ప్రజలు పరోక్షంగా పన్నులు కడుతూనే ఉంటారు. ఆదాయపు పన్ను, ఆస్తిపన్ను లాంటి ప్రత్యక్ష పన్నులు కావచ్చు, స్థానిక ప్రభుత్వాలు విధించే పన్నుల్ని కూడా పౌరులు కడుతూనే ఉంటారు. అయినప్పటికీ మార్చి నెలాఖరు ఆర్థిక సంవత్సరం ముగింపు తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అధికారులు పన్నుల వసూలును ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ అధికారులు పన్ను వసూళ్లలో వేగం పెంచారు. బకాయి పడిని పలువురి నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆస్తులను జప్తు చేయడం, సముదాయాల ముందు చెత్తను గుట్టలు గుట్టలుగా పోయడం, ఫ్లెక్సీలు కట్టి బెదిరింపులకు పాల్పడడం, మరీ ముఖ్యంగా పన్ను కట్టని వారి ఇంట్లోని సామాన్లు జప్తు చేస్తామంటూ అధికారులు ఏకంగా ట్రాక్టర్లు, వాహనాలతో సహా తిరగంపై ప్రజలు, ప్రతిపక్ష పార్టీల నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.పన్నుల వసూలు పేరుతో జగన్ రెడ్డి సర్కార్ ప్రజలను పీక్కుతినే విధంగా వ్యవహరిస్తోందని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ నిప్పులు చెరగడం ప్రస్తావించదగిన అంశం. పన్నులు కట్టకపోతే.. ఇంట్లో మహిళలు ఉండగానే ఇంటికి సీలు వేసి మరీ పన్ను కట్టాలని హెచ్చరించడం ఏమిటని నిలదీశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో అధికారులు ఇంట్లో మహిళలు ఉండగానే తలుపులు, గేట్లకు సీళ్లు వేయడం గమనార్హం. ప్రజల ఆత్మగౌరవాన్ని జగన్‌ రెడ్డి అహంకారంతో దెబ్బ తీస్తున్నారని విమర్శించారు. ఇళ్లకు తాళాలు వేయడం, కుళాయిలకు బిరడాలు కొట్టడం, దుకాణాల ముందు చెత్త వేయడం లాంటి సంఘటనలు పాలకుల వికృత మనస్తత్వానికి దర్పణం పడుతున్నాయని మనోహర్‌ ఆగ్రహం వ్యక్తం చేయడం గమనార్హం. ‘సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పడేస్తున్నాం కదా.. ప్రజలు మా దగ్ర పడి ఉండాల్సిందే’ అనే నియంతృత్వ ధోరణి వైసీపీ ప్రభుత్వంలో కనిపిస్తోందన్న నాదెండ్ల వ్యాఖ్య వాస్తవమే అనిపిస్తోందంటున్నారు పలువురు.

Related Posts