YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రారంభం కానీ ఇళ్లు

ప్రారంభం కానీ ఇళ్లు

విజయవాడ,  మార్చి 23,
నవరత్నాలు-పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీల పేరుతో ప్రభుత్వం మొదటి ఫేజ్‌లో 15.60 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పనులు ముందుకు సాగడం లేదు. ఇప్పటి వరకు 11.65 లక్షల ఇళ్లు గ్రౌండింగు కాగా, 3.95 లక్షల ఇళ్లు గ్రౌండింగుకు ఇంకా నోచుకోలేదు. పునాది దశ, ఆ పైన దశలో 3 లక్షల ఇళ్లు మాత్రమే ఉన్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. నిర్మాణ వ్యయాన్ని తగ్గించడానికి 500 కంటే ఎక్కువ గృహాలు కలిగిన పెద్ద లే అవుట్ల దగ్గర సిమెంటు, ఉక్కు, ఇతర నిర్మాణ సామగ్రిని నిల్వ చేయడానికి ప్రభుత్వం ఇప్పటి వరకు 65 తాత్కాలిక గోదాములను మంజూరు చేసింది. వీటిలో ఇప్పటి వరకు ఎన్ని పూర్తయ్యాయనే విషయంపై ప్రభుత్వం వద్ద స్పష్టత లేదు. వెయ్యి గృహాల కంటే ఎక్కువ ఉన్న లే అవుట్లలో ఇటుక/బ్లాక్‌ తయారీ యూనిట్ల ఏర్పాటుకు సంబంధించి కేవలం 157 యూనిట్లనే ఏర్పాటు చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. గోదాముల నిర్మాణాలు వేగవంతం కాకపోవడంతో ఆయా కాలనీల్లో నిర్మాణాలు చేపట్టిన గృహ యజమానులకు ఇనుము, సిమెంటు, ఇసుకతో పాటు నిర్మాణ సామగ్రిని నిల్వ చేసుకోవడం ఇబ్బందికరంగా మారింది. లే అవుట్లలోని అప్రోచ్‌ రోడ్లు చేపట్టడం, విద్యుత్‌ వస్తువుల తరలింపు, గోదాముల నిర్మాణం, భూమిని చదును చేయడం, ఇతర మౌలిక సదుపాయాల పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.282.31 కోట్లను మంజూరు చేసింది. శాశ్వత మౌలిక సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు డిపిఆర్‌ కోసం ప్రభుత్వం నివేదికలను రూపొందించనుంది. జనాభా ప్రాతిపదికపై లే అవుట్లలో పాఠశాలలు, ఆస్పత్రులు, అంగన్‌వాడీ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులు, సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్‌ లైబ్రరీలతోపాటు సామాజిక మౌలిక సదుపాయాల కోసం ప్రణాళికలను అధికారులు సిద్ధం చేశారు.గృహ నిర్మాణాల్లో నాణ్యత తనిఖీల కోసం ప్రభుత్వం 'వాప్కోస్‌' ద్వారా థర్డ్‌పార్టీని నియమించింది. ఇందుకోసం గృహ నిర్మాణ సిబ్బంది, ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లకు తిరుపతిలోని ఐఐటి ద్వారా ప్రభుత్వం నాణ్యత అంశాలపై శిక్షణ ఇచ్చింది.

Related Posts