YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

అగ్రిగోల్డ్ సంగతి ఎక్కడ...

అగ్రిగోల్డ్ సంగతి ఎక్కడ...

విజయవాడ,  మార్చి 23,
అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటానని హామీ ఇచ్చిన సిఎం వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, తాజా బడ్జెట్‌లో ఇందుకోసం నయాపైసా కేటాయించలేదు. గతేడాది బడ్జెట్‌లో రూ.200 కోట్లను కేటాయించినా, అందులో ఎంత ఖర్చు చేశారో స్పష్టం చేయలేదు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన 2022-23 బడ్జెట్‌లో బాధితులకు ఆర్థిక సహాయం అందించేందుకు ఎలాంటి నిధులను కేటాయించలేదు. దీంతో అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునే చర్యలను ప్రభుత్వం నిలిపివేసిందనే ఆందోళన వ్యక్తమవుతోంది. అగ్రిగోల్డ్‌లో రాష్ట్రానికి చెందిన 19.52 లక్షల మంది డిపాజిట్‌లు, పెట్టుబడులు పెట్టగా, దేశంలోని ఏడు రాష్ట్రాలలో 32 లక్షల మంది బాధితులు ఉన్నారు. రాష్ట్రానికి చెందిన బాధితులకు న్యాయం చేస్తామని గత టిడిపి ప్రభుత్వం, ప్రస్తుత వైసిపి సర్కార్‌ ఇచ్చిన హామీలు ఏడేళ్లైనా నెరవేరలేదు. అయినప్పటికీ బాధితులు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు. బాధితులకు రూ.3,964 కోట్లను చెల్లించాలని క్రైమ్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (సిఐడి) తేల్చింది. అగ్రిగోల్డ్‌ సంస్థ 2015 జనవరిలో బోర్డు తిప్పేయడంతో డిపాజిట్‌దారులు, ఏజెంట్లు గుండెపోటుతో ఇప్పటి వరకు 300 మందిపైనే మృతి చెందారు. వారిలో 144 మందికి గత ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించగా, రూ.10 లక్షలు ఇస్తామన్న సిఎం వైఎస్‌ జగన్‌ నేటి వరకు ఒక్క పైసా ఇవ్వలేదు. మొత్తం బాధితులలో రూ.20 వేలలోపు డిపాజిట్‌లున్న వారు 10 లక్షల మంది ఉన్నారని అంచనా వేయగా, వారిలో ఆరు లక్షల మందికి ప్రభుత్వం రూ.964 కోట్లను చెల్లించింది. మిగిలిన వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమకాలేదు. వీరిలో ఒక్కొక్కరికి రెండు మూడు బాండ్‌లు ఉన్నప్పటికీ ఒక్క బాండ్‌కే చెల్లింపు చేశారు. రూ.20 వేలపైబడి డిపాజిట్‌ చేసిన బాధితులు 13.52 లక్షల మంది ఉన్నారు. వారికి ఆర్థిక సహాయం అందించే అంశాన్ని బడ్జెట్‌లో ఎక్కడా ప్రస్తావించలేదు.అగ్రిగోల్డ్‌ సంస్థకు రాష్ట్ర వ్యాప్తంగా రూ.35 వేల కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు సాక్షాత్తు హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత ప్రకటించారు. ఇందులో హారుల్యాండ్‌ విలువే రూ.5 వేల కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇప్పటికే వాటన్నింటినీ కోర్టుకు అటాచ్‌ చేశారు. ఆస్తులను వేలం వేసి బాధితులందరికీ డిపాజిట్‌లను చెల్లిస్తామన్న గత, ప్రస్తుత ప్రభుత్వాల హామీలు నెరవేరడంలేదు. కోర్టుకు అటాచ్‌ చేసిన అగ్రిగోల్డ్‌ సంస్థ ఆస్తులన్నింటినీ ఒకేసారి వేలం నిర్వహించాలి. ఇందుకోసం జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో జిల్లా జడ్జి, సబ్‌ రిజిస్ట్రార్‌తో కూడిన త్రిసభ్య కమిటీని నియమించాలి. అపుడే బాధితులందరికీ న్యాయం జరుగుతుంది. ఆరు నెలల్లో అందరికీ డిపాజిట్‌లను చెల్లిస్తానన్న సిఎం జగన్‌ తన హామీని నెరవేర్చలేదు. కనీసం బడ్జెట్‌లో బాధితుల ప్రస్తావనే లేకపోవడం బాధాకరం.'

Related Posts