హైదరాబాద్, మార్చి 23,
తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి సెగలు రగులుతూనే ఉన్నాయి. పీసీసీ చీఫ్‌తో సీనియర్ల పంచాయితీ పాకాన పడింది. రాహుల్ గాంధీ ఏరి కోరి తెచ్చుకున్న రేవంత్ రెడ్డి పనితీరును పార్టీ విధేయులుగా చెప్పుకునే పలువురు సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట కన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌ని పెంచుకునే ఎజెండాతో రేవంత్ పనిచేస్తున్నారనేది వారి ప్రధాన ఆరోపణ. కాంగ్రెస్‌లో ఇంటిపోరు కొత్త కాదు. వర్గపోరు, వర్గ భేటీలు కూడా కొత్త కాదు. అయితే నేటి రాజకీయ పరిస్థితులు మునపటిలా లేవు. చాలా మారాయి. ఐదేళ్లు మీరు.. ఐదేళ్లు మేము అధికారం పంచుకునే రోజులు పోయాయి. ఒకసారి పవర్‌లోకి వచ్చిన పార్టీ అక్కడే పాతుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీహార్, బెంగాల్, గుజరాత్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, ఒడిషా రాష్ట్రాలు అందుకు ఉదాహరణ. తెలంగాణలో టీఆర్‌ఎస్ కూడా హ్యట్రిక్ ప్రయత్నాల్లో ఉంది. టీఆర్‌ఎస్ సర్కార్ ప్రజాకర్షక పథకాలతో జనం మనస్సులను గెలుస్తోంది. దానిని అధిగమించి పార్టీని అధికారంలోకి తీసుకురావాలంటే కాంగ్రెస్ సర్వశక్తులొడ్డాల్సిందే.మరోవైపు, కాంగ్రెస్ స్థానాన్ని ఆక్రమించేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ పరిస్థితులలో హస్తం పార్టీలో సమష్టి కృషి అవసరం. కానీ ఇప్పుడా పార్టీలో ఎవరికైనా అది కనిపిస్తుందా? కాంగ్రెస్‌లో ఇంటి పోరు ఇప్పుడే కొత్తగా పుట్టింది కాదు. కానీ, ఇలా వీధిన పడలేదు. ఈ తరహా సంస్కృతి ఒక్క కాంగ్రెస్ లోనే సాధ్యం.రేవంత్ రెడ్డి పీసీసీ పగ్గాలు చేపట్టి ఎనిమిది నెలలు అవుతోంది. తొలి రోజులలో సీనియర్లు అలిగినా, మనస్థాపానం చెందినా అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే వారందరూ ఆ పదవిని ఆశించిన వారే కాబట్టి. దశాబ్దాల పాటు పార్టీకి సేవలందించిన వారికి బదులు నాలుగేళ్ల క్రితం వచ్చిన వ్యక్తిని అందలం ఎక్కిస్తే ఆ మాత్రం అసంతృప్తి సహజం. కానీ దానిని వ్యక్తంచేసే తీరు ఇలా కాదు కదా. అంతర్గత వేదికల మీద చర్చించాలి కానీ కోపం వచ్చిన ప్రతి ఒక్కరు మీడియా ముందు మీటింగ్ పెడతారా? సొంత పార్టీ నాయకుడిని విమర్శిస్తే పబ్లిక్‌లో పార్టీ ఇమేజ్ పలచనకాకపోతే ఇంకేమవుతుంది.?పార్టీతో తమకు పంచాయితీ లేదు..ఫలానా వ్యక్తితోనే తమ పంచాయితీ అంటారు. అలా చూసినా ఆ వ్యక్తి తనకు తాను పీసీసీ పీఠం మీద కూర్చోలేదు. ఆయన అధిష్టానం ఎంపిక చేసిన వ్యక్తి. ఆయనను విమర్శిస్తే అధిష్టానాన్ని విమర్శించటమే అవుతుంది. గత కొన్ని రోజులుగా సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యవహారం పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. రేవంత్‌పై అసమ్మతితో పార్టీని వదిలిపెట్టేందుకు కూడా సిద్ధపడ్డారాయన. సీనియర్లు బుజ్జగింపుతో ఆయన తాత్కాలికంగా ఆగిపోయారు.ఆదివారం రేవంత్ రెడ్డి యల్లారెడ్డి టౌన్‌లో జరిగిన “మన ఊరు మన పోరాటం” సభలో పాల్గొన్నారు. విధేయులం అని అని చెప్పుకునే కొందరు అసంతృప్త సీనియర్ రాష్ట్ర నాయకుల బృందం అదే రోజు రేవంత్ లేకుండా హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో భేటీ అయ్యారు. కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలను పట్టించుకోకుండా వారు ఈ భేటీ నిర్వహించారు. రేవంత్ రెడ్డి, ఆయన వ్యవహార శైలిపైనే వారు ప్రధానంగా చర్చించారు. సమావేశంలో పాల్గొన్న వారిలో ఒక ఎమ్మెల్యేతో పాటు ముగ్గురు సీనియర్ నేతలు పీసీసీ చీఫ్ పై తీవ్ర స్థాయిలో తమ అసంతృప్తి వెల్లగక్కారు. ఇది రాష్ట్ర కాంగ్రెస్ విభేదాలను మరోసారి బయటపెట్టింది.ఆదివారం నాటి భేటీ కాంగ్రెస్‌లో తీవ్ర కలకలం రేపింది. సమావేశం తరువాత జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర సంచలనం రేపాయి. సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి తాను రాజీనామా చేసి ఇండిపెండెంట్ గా పోటీ చేస్తానని ఆయన ప్రకటించారు. అయితే తనపై కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని పెట్టి గెలిపించాలని రేవంత్ రెడ్డికి సవాల్ విసరటం అసమ్మతికి పరాకాష్ట.రాష్ట్ర కాంగ్రెస్‌లో నిర్ణయాలు ఏకపక్షంగా జరుగుతున్నాయని, పార్టీలో నేతలకు సరైన కమ్యూనికేషన్ ఛానెల్ లేదని సీనియర్లు చాలా రోజుల నుంచి ఆరోపిస్తున్నారు. సహజంగా పార్టీలో ఓ నిర్ణయం తీసుకోవటానికి ముందు నాయకులు కూర్చుని చర్చిస్తారు. కానీ ఇప్పుడు అలాంటి రెగ్యులర్ చర్చలు లేవనేది అసమ్మతి నేతల ఆరోపణ. అలాగే పార్టీలో ఏం జరుగుతుంది అనే దాని మీద కూడా తమకు సమాచారం అందటం లేదంటున్నారు.రేవంత్ రెడ్డి వ్యవహార శైలిలో మాజీ సీఎం వైఎస్ లక్షణాలు కనిపిస్తున్నాయనే వారు కూడా ఉన్నారు. వైఎస్ 1980వ దశకంలో పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు అలాగే ఉండేవారని,కాపీ పార్టీ విశ్వాసం సంపాదించి అధికారంలోకి రావడానికి ఆయనకు 20 ఏళ్లు పట్టిందని గుర్తు చేస్తారు. కనుక పార్టీలో సమష్టి నిర్ణయాలే తప్ప ఏకపక్ష నిర్ణయాలకు చోటు ఉండకూడదంటున్నారు.వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డికి తాము వ్యతిరేకం కాదని అంటున్నారు. పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తించాల్సిన రీతిలో పార్టీ పనిచేయడం లేదన్నదే తమ బాధ అంటున్నారు.హైకమాండ్ దృష్టికి విషయాలను తీసుకురావాలంటే ఇలాంటివి అవసరం అని అసంతృప్త నేతలు తమ అనధికార సమాశాలను సమర్ధించుకుంటున్నారు. గత మూడేళ్లుగా ఇలా భేటీ కావాల్సిన అవసరం ఏర్పడిందని అంటున్నారు. సమావేశం కావద్దని హైకమాండ్ కోరినట్లు వచ్చిన వార్తలను వారు ఖండించారు. ఢిల్లీ నుంచి తమకు అలాంటి సమాచారం ఏదీ లేదని అంటున్నారు.ఏది ఏమైనా అసమ్మతి నేతల చర్యలు కాంగ్రెస్ ప్రతిష్టను దెబ్బతీస్తాయని ఇతర కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. చర్చించటానికి పార్టీలో కావాల్సినంత ప్రజాస్వామ్యం ఉన్నప్పుడు ఇలా బహిరంగ ప్రకటనలు చేయటం పార్టీకి మేలు చేయదని అంటున్నారు. సీనియర్ నాయకులంటే పార్టీలో అందరికీ గౌరమే, వారి సలహాలు పార్టీకి కూడా చాలా అవసరం కానీ వారికా ప్రవర్తన పార్టీ పరువు తీస్తోందని రేవంత్ రెడ్డి విధేయులు అంటున్నారు. చివరకు పార్టీ అప్రతిష్ట పాలైతే వారే దీనికి బాధ్యులని అంటున్నారు.ఈ నెల 14న మర్రి శశిధర్ రెడ్డి కూడా విధేయులతో సమావేశం నిర్వహించారు. మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య తదితరులు ఆ భేటీకి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో సోమవారం పీసీసీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. జగ్గారెడ్డికి అప్పగించిన బాధ్యతల నుంచి తొలగించింది. ఎంపీ నియోజకవర్గాల బాధ్యతలు, అలాగే అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి కూడా ఆయనను తప్పించింది. ప్రస్తుతం జగ్గారెడ్డి వద్ద ఉన్న బాధ్యతలను మిగతా వర్కింగ్ ప్రెసిడెంట్లకు అప్పగిస్తూ పీసీసీ నిర్ణయం తీసుకుంది. దాంతో ఆయన మంగళవారం మరోసారి మీడియా ముందుకు వచ్చారు. రేవంత్ రెడ్డి తనకు ఝలక్ ఇవ్వడం కాదు.. తానే ఆయనకు ఝలక్ ఇస్తా అంటున్నారు. మున్ముందు రేవంత్ అసలు స్వరూపం బయట పెడుతానని జగ్గారెడ్డి అంటున్నారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నప్పటికీ పార్టీలో తగిన బాధ్యతలు అప్పగించకపోవడంపై జగ్గారెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏదేమైనా టీ కాంగ్రెస్‌లో జగ్గారెడ్డి ఎపిసోడ్ చివరకు దేనికి దారితీస్తుందో తెలియదు!