న్యూఢిల్లీ, మార్చి 23,
దేశంలో అత్యంత వృద్ధ పార్టీలో సంస్థాగత మార్పులకు సోనియాగాంధీ ప్రయత్నిస్తున్నారా? అందుకు ముహూర్తం కూడా ఖరారైందా? అంటే 10 జన్ పథ్ నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి. ఏఐసీసీ ప్రక్షాళనకు వేళయిందంటున్నారు. త్వరలో కాంగ్రెస్ పార్టీకి కొత్తరూపు ఇవ్వనున్నారు సోనియా గాంధీ. ఏఐసీసీ, పీసీసీ పదవులపై సోనియా గాంధీ సమీక్ష నిర్వహించారు.పలు అంశాల పై పరస్పర అంగీకారం, అవగాహనకు వచ్చారు సోనియా గాంధీ, గులామ్ నబీ ఆజాద్. “అసంతృప్తి నేతల”కు నాయకత్వం వహించిన గులామ్ నబీ ఆజాద్ తో జరిపిన చర్చల్లో పలు నియామకాలను చేసేందుకు సోనియా గాంధీ సమ్మితించినట్లు నమాచారం అందుతోంది. గులామ్ నబీ ఆజాద్ కు కీలకమైన కర్నాటక రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ నిర్ణయం తీసుకున్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న కర్నాటకలో పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేసే బాధ్యతలు తీసుకోవాలని ఆజాద్ ను సోనియా గాంధీ కోరినట్లు సమాచారం. వచ్చే ఏడాది మే నెలలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే, 6 నెలల ముందే ఈ ఏడాది చివరలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.కర్నాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత, ఆజాద్ కు కర్నాటక నుంచి రాజ్యసభ కు ప్రాతినిధ్యం వహించేలా సోనియా గాంధీ నిర్ణయం. అలాగే, మరో అసమ్మతి నేత ఆనంద శర్మ ను కూడా రాజ్యసభ కు పంపాలనే నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. మరో అసమ్మతి నేత, ప్రస్తుతం లోకసభ సభ్యుడు గా ఉన్న మనీష్ తివారి కి ఏఐసిసి లో సముచిత బాధ్యతలు అప్పగించేందుకు సోనియా గాంధీ సుముఖత వ్యక్తం చేశారు. కొత్తగా అసమ్మతి నేతల బృందంలో చేరిన భూపేందర్ సింగ్ హుడా కు హర్యానా పిసిసి అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం అందుతోంది.హర్యానా ప్రస్తుత పీసీసీ అధ్యక్షురాలు షెల్జా కుమారిపై పూర్తి వ్యతిరేకతతో ఉన్నారు భూపేందర్ సింగ్ హుడా. గాంధీ కుటుంబం పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రముఖ సుప్రీంకోర్టు. న్యాయవాది, కేంద్ర మాజీ మంత్రి కపిల్ సిబల్ పై ఆగ్రహంతో ఉన్నారు సోనియా గాంధీ. కపిల్ సిబల్ కు పార్టీలో బాధ్యతలు అప్పగించే అంశంపై ఏలాంటి నిర్ణయం తీసుకోని సోనియా గాంధీ. పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు ఇరువురు నేతలు. కాంగ్రెస్ అసమ్మతి నేతల (G23 Leaders) అభిప్రాయాలను, మనోభావాలను పరిగణనలోకి తీసుకుంటానని ఆజాద్ కు సోనియా గాంధీ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.