YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా దేశీయం

కోట్లు కొల్లగొడుతున్న కశ్మీర్ ఫైల్స్

కోట్లు కొల్లగొడుతున్న కశ్మీర్ ఫైల్స్

ముంబై, మార్చి 23,
1990వ దశకంలో లక్షలాది మంది హిందువులు కట్టుబట్టలతో కశ్మీర్‌ నుంచి పరాయి ప్రాంతాలకు వలస వెళ్లారు. వారిలో కొంత మంది తిరిగి వచ్చారు. చాలా మంది పుట్టిన గడ్డకు శాశ్వతంగా దూరమయ్యారు. వారి దుస్థితికి దారితీసిన పరిస్థితులు, వారిపై సాగిన దమనకాండ ఇతివృత్తంగా రూపొందిన “ది కశ్మీర్‌ ఫైల్స్‌ ” చిత్రం ఇప్పుడు సరికొత్తకు చర్చకు తెరతీసింది.సున్నిత అంశంతో కూడిన ఈ సినిమాను అధికార భారతీయ జనతా పార్టీ బాహాటంగానే ప్రమోట్‌ చేస్తోంది. దాంతో ఇది రాజకీయ వివాదంగా కూడా మారింది. నిజానికి, మొదట్లో ఈ సినిమా పెద్దగా ఎవరి దృష్టిలో పడలేదు. మీడియాలో కూడా పెద్ద ప్రచారం లేదు. కానీ, సోషల్‌ మీడియాలో దీనిపై విస్తృత చర్చ నడిచింది. దాంతో అది ప్రధాన మీడియాను కూడా ఆకర్షించింది.ఇంతలో, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ స్వయంగా ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన బాటలోనే ఆయన ముఖ్యమంత్రులు, మంత్రులు నడిచారు. ఫలితంగా పలు బీజేపీ పాలిత రాష్ట్రాలు దీనికి వినోదపన్ను మినహాయింపు ఇచ్చాయి. అంతే కాదు పోలీసులు ఈ సినిమా చూసేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక రోజు సెలవు కూడా ఇచ్చింది. ఈ చిత్రం మీద వస్తున్న విమర్శలపై కూడా ప్రధాని స్పందించారు. ఈ విమర్శలు సినిమాను అప్రతిష్టపాలు చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం అన్నారు.నిశ్శబ్దంగా వచ్చి వెళ్లిపోవాల్సిన ఈ చిత్రం బీజేపీ, సోషల్‌ మీడియా ఉచిత ప్రచారం వల్ల ఇప్పుడు బాక్సాఫీస్‌ హిట్‌గా నిలిచింది. ఈ తక్కువ బడ్జెట్ చిత్రం 150కోట్లకు పైగా వసూలు చేయటం విశేషం. మిథున్‌ చక్రవర్తి, అనుపమ్‌ ఖేర్‌, పల్లవి జోషీ వంటి క్యారెక్టర్‌ నటులు తప్ప పెద్ద స్టార్లు ఎవరూ ఈ చిత్రం లేరు. అయినా ఈ చిత్రం ప్రేక్షకులను సీట్లకు కట్టిపడేస్తోందంటే కారణం అందులోని విషయమే. వాస్తవానికి మన దేశంలో కాశ్మీర్‌ను ముట్టుకుంటేనే పెద్ద వివాదం అవుతుంది. అందునా కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తరచూ కాశ్మీర్‌ హిందువుల వ్యథలను ప్రస్తావిస్తుంది. అలాంటిది ఇప్పుడు ఆ అంశం చుట్టూ రూపొందిన ఈ చిత్రానికి ప్రచారం కల్పించకుండా ఎలా ఉంటుంది? జాతీయవాద పార్టీ బీజేపీ కాశ్మీర్‌ అంశాన్ని చాలా కాలంగా ఎన్నికల రాజకీయాల్లో వాడుకుంటూ వచ్చింది. నాడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పండిట్ల దుస్థితిని నిర్లక్ష్యం చేసిందనేది బీజేపీ ఆరోపణ.ముస్లిం జనాభా అధికంగా ఉన్న కాశ్మీర్‌ లోయలో 1980ల చివరలో వేర్పాటువాదం తీవ్రమైంది. భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటు మొదలైంది. 1990లలో మైనారిటీ వర్గానికి చెందిన కాశ్మీరీ హిందువులు, ముఖ్యంగా అగ్రవర్ణ పండిట్లను ఇస్లామిస్ట్ మిలిటెంట్లు లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించారు. దాంతో పండిట్లు చాలా ఇబ్బందుల పాలయ్యారు. వేర్పాటువాద ఉగ్రవాదులు వారిపై దమనకాండ సాగించారు. అత్యాచారాలకు పాల్పడ్డారు.సజీవ దహనాలు చేశారు, ఇళ్లు లూటీ చేశారు.. ఆస్తులనూ స్వాధీనం చేసుకున్నారు. ఫలితంగా లక్షలాది హిందూ కుటుంబాలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని సొంతగడ్డను వదిలిపోయారు. అప్పటి వాస్తవాలనే దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరమీద చూపించే ప్రయత్నం చేశారు. కానీ, సినిమా ఎప్పటికీ వాస్తవం కాదు..ఎంతో కొంత కల్పన ఉంటుంది. నేటికీ పూర్తిగా మానని ఆ గాయాన్ని ఇప్పుడు తిరగదోడి విద్వేషాలు రెచ్చగొడుతున్నారనేది మరో వర్గం అంటోంది.దశాబ్దాల కాశ్మీర్ హింసపై ఇప్పటి వరకు అనేక మంది పుస్తకాలు రాశారు. సినిమాలు కూడా వచ్చాయి. కాని నిర్వాసితులైన కాశ్మీర్ పండిట్‌ కుటుంబాలు, వారి దుస్థితికి గల కారణాలపై ఎవరూ అంతగా దృష్టి పెట్టలేదు. తమకు జరిగిన అన్యాయాన్ని ప్రపంచానికి తెలియకుండా చేస్తున్నారనే భావనలో కశ్మీరీ పండిట్లు ఉన్నారు. అందుకే “ది కశ్మీర్ ఫైల్స్‌” మీద స్పందనలు ఇంత తీవ్రంగా ఉన్నాయి. నిజానికి, పండిట్లు మాత్రమే కాదు ఏ దమనకాండను, హింసా కాండ కూడా బాలీవుడ్‌కు కథాంశం కాదు. ఎందుకంటే సినిమా అనేది ఫక్తు వ్యాపారం.ది కాశ్మీర్ ఫైల్స్”కు ప్రధాన విమర్శకల నుంచి ఓ మాదిరి సమీక్షలు వచ్చాయి. చాలా మంది దీనిని ఎక్స్‌ప్లాయిటేషన్‌ అన్నారు. ఐతే, కాశ్మీర్ చరిత్రలో విస్మరించిన రక్తసిక్త భాగాన్ని ఇది వెలుగులోకి తెచ్చిందని ఓ వర్గం అంటోంది.చరిత్రను సరైన కోణంలో, సరైన సమయంలో, సమాజం ముందు ఉంచాలి. ఈ క్రమంలో పుస్తకాలకు, కవితలకు, సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. అలాగే సినిమాకు కూడా ప్రాధాన్యం ఉంటుందని ప్రధాని ఈ సినిమాని దృష్టిలో పెట్టుకుని అన్నారు. ఆయన మాటలు నూటికి నురుపాళ్లు నిజం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మహాత్మా గాంధీకి అదే జరిగింది. ప్రపంచం మొత్తం మార్టిన్ లూథర్ గురించి మాట్లాడింది, నెల్సన్ మండేలా గురించి మాట్లాడింది. కానీ, మహాత్మాగాంధీ గురించి ప్రపంచం ఎక్కువగా మాట్లాడ లేదని అంటారు ప్రధాని.ఏదేమైనా ఈ చిత్రం నచ్చే వారికి నచ్చుతుంది.. నచ్చని వారికి నచ్చదు. కశ్మీరీ పండిట్లను ఊచకోత కోసిన హంతకులుగా తమను చూపించి దర్శకుడు తమ మనోభావాలను గాయపరిచారంటూ ఒక వర్గం వారు న్యాయస్తానాలను ఆశ్రయించారు. తాజాగా ది కశ్మీర్‌ ఫైల్స్‌ అంశం కర్నాటక శాసన మండలిని కుదిపేసింది. అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదాలతో అట్టుడికింది. కొద్దిసేపు వాయిదా కూడా పడింది. మండలి చైర్మన్‌ బసవరాజ్‌ హొరట్టి కశ్మీర్‌ఫైల్స్‌ సినిమాక మీద చేసిన ప్రకటనే వివాదానికి కారణం. ఈ సినిమా చూడాల ఆయన సభ్యులను కోరడంతో సభలో గందరగోళం రేగింది.

Related Posts