YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గుడులు క‌ట్టించే వారు గుడుల‌ను క‌ట్టించండి.. బ‌డులు క‌ట్టించే వారు బ‌డులు క‌ట్టించండి..

గుడులు క‌ట్టించే వారు గుడుల‌ను క‌ట్టించండి.. బ‌డులు క‌ట్టించే వారు బ‌డులు క‌ట్టించండి..

హైద‌రాబాద్ మార్చ్ 23
తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన మ‌న ఊరు మ‌న బడి ప‌థ‌కంపై ఎన్ఆర్ఐల‌తో మంత్రి కేటీఆర్ ముఖాముఖి నిర్వ‌హించారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న కేటీఆర్ కాలిఫోర్నియాలోని మిల్పిటాస్‌లో మీట్ అండ్ గ్రీట్ విత్ కేటీఆర్ కార్య‌క్ర‌మంలో పాల్గొని ప్ర‌సంగించారు.మ‌నం చదువుకున్న పాఠ‌శాల అభివృద్ధికి త‌మ వంతుగా స‌హాయం చేయాల‌న్నారు. గుడులు క‌ట్టించే వారు గుడుల‌ను క‌ట్టించండి.. బ‌డులు క‌ట్టించే వారు బ‌డులు క‌ట్టించండి.. లైబ్ర‌రీలు క‌ట్టించే వారు లైబ్ర‌రీలు క‌ట్టించండి.. దీని వ‌ల్ల స్థానికుల నుంచి వ‌చ్చే కృత‌జ్ఞ‌త మ‌రిచిపోలేనిదిగా ఉంటుంద‌న్నారు. తెలంగాణ అభివృద్ధిలో మీ అంద‌రి భాగ‌స్వామ్యం ఉండాలి. మీకు మించిన బ్రాండ్ అంబాసిడ‌ర్స్ ఎవ‌రూ ఉండ‌రు. తెలంగాణ గురించి మీరే గొప్ప‌గా ప్ర‌చారం చేయ‌గ‌ల‌రు. అభివృద్ధిలో ముందంజ‌లో ఉన్నాం. విద్యావ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తున్నాం. ప్ర‌త్యేక రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు తెలంగాణ‌లో కేవ‌లం మూడు మెడిక‌ల్ కాలేజీలు మాత్ర‌మే ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్ప‌డిన త‌ర్వాత కొత్త‌గా 33 మెడిక‌ల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటున్నామ‌ని కేటీఆర్ తెలిపారు. అలా వైద్య విద్య‌తో పాటు స్కూల్ ఎడ్యుకేష‌న్‌ను ప‌టిష్టం చేస్తున్నామ‌ని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.రూ. 7,230 కోట్ల తో తెలంగాణ‌లోని 26 వేల పాఠ‌శాల‌ల‌ను అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కంక‌ర‌ణం క‌ట్టుకుందని కేటీఆర్ తెలిపారు. ఈ విద్యా య‌జ్ఞంలో మీరు కూడా పాలు పంచుకోవాలి. నా మాతృభూమి కోసం, నా గ్రామం, ప‌ట్ట‌ణం కోసం.. నేను ఏదైనా చేయాలి.. చేస్తే బాగుంటుందని, అవ‌స‌ర‌మైతే నా త‌ల్లిదండ్రుల పేరు మీదో, నా గ్రాండ్ పేరెంట్స్ పేరు మీదో ఏదో చేయాల‌నుకుంటే ఈ విద్యాయ‌జ్ఞంలో పాల్గొనే అవ‌కాశం ఉంది. మీ మీద ఆధార‌ప‌డి ప్ర‌భుత్వం చేస్తున్న కార్య‌క్ర‌మం కాదు. విద్యా రంగాన్ని ప‌టిష్టం చేసేందుకు ప్ర‌యివేటు వ్య‌క్తుల స‌హ‌కారం కోస‌మేన‌ని చెప్పారు. మీకు ఇష్ట‌మున్న పాఠ‌శాల‌ను ఎంపిక చేసుకొని అభివృద్ధి చేయొచ్చ‌న్నారు. ఇది ఒక అద్భుత అవ‌కాశం అని కేటీఆర్ పేర్కొన్నారు. అన్ని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఇంగ్లీష్ మీడియం ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నామ‌ని తెలిపారు.అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం ముందంజ‌లో ఉంద‌ని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత క‌నీస స‌దుపాయాల‌పై దృష్టి సారించామ‌ని స్ప‌ష్టం చేశారు. దేశానికి నిధులు స‌మ‌కూరుస్తున్న నాలుగో అతిపెద్ద రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. క‌రోనా స‌మ‌యంలోనూ 14 శాతం వృద్ధిరేటు న‌మోదు చేశాం. దేశ జ‌నాభాలో తెలంగాణ 12వ స్థానంలో ఉంద‌న్నారు. తెలంగాణ ఏర్ప‌డే నాటికి క‌రెంట్ కోత‌ల‌తో తెలంగాణ అల్లాడుతోంది. క‌రెంట్ స‌మ‌స్య‌ను సీఎం కేసీఆర్ తొలి ఆరు నెల‌ల్లోనే ప‌రిష్క‌రించారు. విద్యుత్ వ్య‌వస్థాప‌క సామ‌ర్థ్యం 7 వేల మెగావాట్ల నుంచి 16 వేల మెగావాట్ల‌కు పెంచామ‌ని తెలిపారు.అన్ని రంగాల‌కు 24 గంట‌ల నాణ్య‌మైన విద్యుత్ను అందిస్తున్నామ‌ని చెప్పారు.ప్ర‌తి ఇంటికి సుర‌క్షిత‌మైన తాగునీటిని అందిస్తున్నాం. ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన కాళేశ్వ‌రం ప్రాజెక్టును నాలుగేండ్ల‌లోనే పూర్తి చేసి ప్ర‌తి ఎక‌రానికి సాగునీరు అందిస్తున్నాం. తెలంగాణ నుంచి వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తులు పెరిగాయి. పంజాబ్‌తో స‌మానంగా వ‌రి ధాన్యం ఉత్ప‌త్తి చేస్తున్నామ‌ని తెలిపారు. ఒక‌ప్ప‌టి క‌రువు నేల నేడు దేశానికి అన్న‌పూర్ణగా మారింద‌న్నారు. ఇదంతా కేసీఆర్ స‌మ‌ర్థ‌వంత‌మైన పాల‌న వ‌ల్లే సాధ్య‌మైంద‌న్నారు. టీఎస్ ఐపాస్ చ‌ట్టం అమ‌లు చేసిన త‌ర్వాత తెలంగాణ‌కు ప‌రిశ్ర‌మ‌లు త‌ర‌లివ‌చ్చాయి. ప్ర‌పంచ స్థాయి కంపెనీలు త‌మ కార్యక‌లాపాల‌ను హైద‌రాబాద్‌లో ప్రారంభించాయని మంత్రి కేటీఆర్ తెలిపారు.

Related Posts