మంటూరు లాంచీ ప్రమాదంపై బుధవారం ఉదయాన్నే మరోమారు సీఎం చంద్రబాబు సమీక్ష జరిపారు. రాత్రంతా దీనిపై అధికారులకు ఎప్పటికప్పుడు సూచనలిచ్చిన ముఖ్యమంత్రి ఉదయం 9గం.కల్లా తన నివాసానికి రావాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. పోలీస్, ఎన్డీఆర్ అధికారులతో అయన మాట్లాడారు. గాలింపు,సహాయక చర్యల గురించి అడిగి తెలుసుకున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులకు అన్ని ఏర్పాట్లు చేయాలని అయన ఆదేశించారు. పెద్దపెద్ద క్రేన్లు తెప్పించాలి, వెంటనే మృతదేహాలను వెలికి తీయాలని అన్నారు. పోస్ట్ మార్టమ్ లకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు అక్కడికక్కడే చేయాలని అన్నారు.
పాత గుంటూరు దుర్ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసారు. బుధవారం ఉదయం సీఎస్, డిజిపి,ఇంటలిజెన్స్ అధికారులతో సీఎం భేటి అయ్యారు. ఆడపిల్లల జోలికి వచ్చేవారిని ఉపేక్షించవద్దు.నిందితులను కఠినంగా శిక్షించాలని అయన అన్నారు. బాధితురాలిని, ఆమె కుటుంబాన్ని ఆదుకోవాలి. ఆడబిడ్డలకు అన్యాయం చేస్తే కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఒకరిద్దరిని కఠినంగా శిక్షిస్తే మిగిలినవారికి బుద్ది వస్తుంది. ఆడబిడ్డలకు రక్షగా ఉండాలన్న ప్రచారం విస్తృతంగా జరగాలని అయన అన్నారు. నేరాలకు పాల్పడితే జీవితాలు నాశనం అవుతాయన్న ఇంగితం పెరగాలని అన్నారు. అసాంఘిక శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.అశాంతి,అభద్రత సృష్టిస్తే కఠినంగా వ్యవహరిస్తానని హెచ్చరించారు.