YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్కింగ్ పై జనాల ఆగ్రహం

పార్కింగ్ పై జనాల ఆగ్రహం

రాజమండ్రి, మార్చి 24,
రోడ్డు పక్కన బైక్ పార్క్ చేసి వెళ్తున్నారా.. రద్దీ ప్రాంతాల్లో ఏదో ఒక మూల కార్ నిలిపి షాపింగ్ కి వెళ్లాలనుకుంటున్నారా.. అయితే తస్మాత్ జాగ్రత్త. ఎక్కడ పడితే అక్కడ కార్, బైక్ పార్క్ చేసి వెళ్తే ఇక పై కుదరదంటూ హెచ్చరిస్తున్నారు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు.. రద్దీ ప్రాంతాల్లో ఇక పై పార్కింగ్ చేసే వాహనాలపై ఫీజు వసూలు చేసేందుకు సిధ్దమవుతున్నారు. ఇప్పటికే ఎడాపెడా పన్నులతో ఇబ్బందులు పెడుతున్న మున్సిపల్ కార్పోరేషన్ పార్కింగ్ ఫీజులు భారం మోపడం విమర్శలకు తావిస్తోంది.రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు నయా బాదుడికి తెరతీశారు.. అసలే ఇంటి పన్నులు పెంపు, చెత్తా పన్ను విధింపుతో గగ్గోలు పెడుతున్న స్థానికులపై ములిగే పక్కపై తాటి పండు పడినట్లుగా పార్కింగ్ ఫీజులు వసూలు గుదిబండగా మారాయి. రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయించారు.. పెయిడ్ పార్కింగ్ స్థలాలను ఇప్పటికే గుర్తించిన అధికారులు సైన్ బోర్డులను ఏర్పాటు చేసారు. మహా నగరాల్లో వసూలు చేస్తున్న రీతిగానే రాజమండ్రిలో పార్కింగ్ ఫీజ్ వసూలు చేసేందుకు రంగం సిధ్దం చేస్తున్నారు. పీవీ నరసింహారావు పార్క్, కందకం రోడ్డు, కంబాలచెరువు, ఎస్ బి ఐ, గణేష్ నగర్. రైతు బజార్, స్టేడియం రోడ్డు, జామ్ పేట, దిశ పోలీస్టేషన్ వంటి సెంటర్లలో పెయిడ్ పార్కింగ్ బోర్డులను ఏర్పాటు చేసారు కార్పోరేషన్ అధికారులు.ఇప్పటికే పార్కింగ్ ఫీజు వసూలు చేసేలా టెండర్లను కూడా రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు ఆహ్వానించారు.. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, రద్దీ సమయాల్లో నియంత్రణ నగరంలో ఇబ్బందికరంగా మారింది.. దీంతో ప్రైవేట్ సంస్ధల ద్వారా పార్కింగ్ ఫీజు వసూలు చేసి దాని ద్వారా ఆదాయం పొందాలనేది అధికారుల ప్రణాళిక.. ఉభయగోదావరి జిల్లాలకు వాణిజ్య రాజధాని రాజమండ్రి నగరానికి ప్రతీ రోజు వేలాది వాహానాల్లో లక్షల్లో జనం వివిధ అవసరాల నిమిత్తం తరలివస్తుంటారు.. ఇలా వచ్చే వారు రోడ్లపై వాహనాలను పార్క్ చేస్తే ఇక పై ఫీజ్ చెల్లించాల్సిందే.. మహా నగరాల్లో అమల్లో ఉన్న పార్కింగ్ ఫీజ్ వసూలు చేయాలనే అధికారుల చర్యలపై మండిపడుతున్నారు రాజమండ్రి నగరవాసులు..రివర్ సిటీగా ప్రసిధ్ది చెందిన రాజమండ్రిలో ఇక పై గోదావరి అందాలను వీక్షించాలన్నా డబ్బు చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.. పుష్కర్ ఘాట్ రోడ్డులో కూడా పార్కింగ్ ఫీజ్ వసూలు చేయాలని అధికారులు ప్రణాళికలు చేస్తున్నారు.. దీంతో రోడ్డు పై బైక్ లేదా కార్ పార్క్ చేసి కాసేపు గోదావరి తీరంలో ప్రశాంతంగా కూర్చోవాలన్నా జేబులు గుల్లకాక తప్పేట్టు లేదు.. మరో వైపు ఉపాధి ఉద్యోగ రిత్యా రాజమండ్రి వచ్చే వారికి కూడా పార్కింగ్ వాత తప్పడం లేదు.. తొలిదశలో తొమ్మిది ప్రాంతాలను గుర్తించిన కార్పోరేషన్ అధికారులు పెయిడ్ పార్కింగ్ ప్రాంతాలను మరింత పెంచేలా ప్రణాళికలు చేస్తున్నారు.. పెయిడ్ పార్కింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఒకసారి బండి నిలిపి వెళ్తే 30 రూపాయిలు చెల్లించాలి.. ఇలా చెల్లించిన 30 రూపాయలు మూడు గంటల వరకు మాత్రమే వర్తిస్తుంది. ఆపై మరో 30 చెల్లించక తప్పదు. ప్రధానంగా కూలీ నాలి చేసుకునే సామాన్యులు రోడ్డు పక్కన ద్విచక్ర వాహనాన్ని పార్క్ చేస్తే రోజుకు వంద రూపాయల వరకు పార్కింగ్ ఫీజ్ చెల్లించాల్సి వస్తుంది. పెట్రోల్, డీజిల్ ధరల బాదుడుతో పాటు సామాన్యుల నడ్డి విరిచేలా పార్కింగ్ ఫీజ్ వసూలు చేయడాన్ని తప్పుబడుతున్నారు వామపక్షాల నేతలు..రాజమండ్రి సిటీలో వాహనదారులకు గుదిబండగా మారిన పార్కింగ్ ఫీజులు వసూళ్లు మానుకోవాలని అధికార వైసీపీ నేతలు కార్పోరేషన్ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్ ఈ మేరకు అధికారులను ఆదేశించారు. పార్కింగ్ ఫీజులు లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. రాజమండ్రి నగరపాలక సంస్థకు కార్యవర్గం లేనందున అధికారులు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటున్నారని జనం మండిపడుతున్నారు.. ఇలాంటి నిర్ణయాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేస్తున్నారు.. తక్షణమే రాజమండ్రి కార్పోరేషన్ అధికారులు అమలు చేయాలని చూస్తోన్న పెయిడ్ పార్కింగ్ విధానాన్ని విరమించాలని డిమాండ్ చేస్తున్నారు.మహా నగరాల్లోని రద్దీ ప్రాంతాల్లో మల్టీ లెవల్ భవనాలను నిర్మించి పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం పరిపాటి.. కానీ రాజమండ్రిలో మాత్రం రోడ్డుపై పార్క్ చేసినా ఫీజు వసూలు చేయాలని అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు నగరవాసులు. పెరిగిన ధరలకు తోడు పార్కింగ్ ఫీజులంటూ వడ్డనకు తెరతీయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. రాజమండ్రి వంటి ద్వితీయ శ్రేణి నగరాల్లో పార్కింగ్ బాదుడు తగదంటున్నారు. పైగా రద్దీ ప్రాంతాల్లో ఐదు నుంచి పది నిమిషాల పాటు పని ముగించుకుని వెళ్లేందుకు 30 రూపాయల పార్కింగ్ ఫీజు వసూలు చేయాలనుకోవడం సరికాదని అంటున్నారు. ఇప్పటికే పలు రకాల పన్నుల భారంతో సతమతమవుతున్న జనం నెత్తిన పెయిడ్ పార్కింగ్ గుదిబండను మోపవద్దని జనం వాపోతున్నారు..

Related Posts