YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

జగన్‌రెడ్డి సై అంటారా? సరెండర్ అవుతారా?

జగన్‌రెడ్డి సై అంటారా? సరెండర్ అవుతారా?

విజయవాడ,  మార్చి 24,
కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కుండబద్దలు కొట్టింది. ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని, పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పింది. ఇందుకు సంబదించి విశాఖ వైసీపీ ఎంపీ సత్యనారాయణ లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు, కేంద్ర హోమ్ శాఖ శ్యామంత్రి నిత్యానందరాయ్, గతంలో ఇచ్చిన సమాధానమే మళ్ళీ ఇచ్చారు. అదే  జిరాక్స్ కాపీని మళ్ళీ సభ ముందుంచారు. “ప్రత్యేకహోదాపై 14వ ఆర్ధిక సంఘం సిఫార్సు చేయలేదు. కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెంచాం. ఏపీ విభజన చట్టంలోని చాలా అంశాలు నెరవేర్చాం, హోదా ముగిసిన అధ్యాయం” ఇంతే సంగతులు  చిత్తగించ వలెను, ఇదీ నిత్యానందరాయ్, చిద్విలాసంగ ఇచ్చిన సమాధానం. నిజానికి తప్పయినా ఒప్పయిన కేంద్ర ప్రభుత్వం, మాట తప్పిందే కానీ, తప్పిన మాటను మార్చలేదు. గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ఏమి చెప్పిందో, ఇప్పుడూ అదే చెప్పింది. అయితే, అప్పుడు విపక్షంలో వుండి గర్జించిన, ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఎందుకు పెదవి విప్పడంలేదు. అప్పట్లో ఎంపీలతో రాజీనామా చేయించిన, జగన్ రెడ్డి కేంద్రాన్ని హోదాకోసం డిమాండ్ చేయడం లేదు. అప్పుడు ఎగిరెగిరి పడిన జగన్ రెడ్డి ఇప్పుడు ఎందుకు కుక్కిన పేనులా, కేంద్రం ముందు మోకరిల్లుతున్నారు? ఇందుకోసం రాష్ట ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెడుతున్నారు? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ్న. కేంద్ర ప్రభుత్వం తాజాగా, మరోమారు, ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని తెగేసి చెప్పిన నేపధ్యంలో,  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడేమి చెపుతారు? ఏమి చేస్తారు? ఇప్పటికైనా కళ్ళు తెరిచి, కేంద్ర ప్రభుత్వం పై ‘ధర్మ పోరాటం’ తరహ పోరాటానికి సిద్ధమవుతారా? అనే చర్చ ఇప్పడు రాజకీయ, మీడియా వర్గాల్లో జోరుగా సాగుతోంది. తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రాన్ని నమ్మించి మోసం చేసింది. ప్యాకేజి వలన హోదాకు మించి ప్రయోజనాలు ఉంటాయని, నమ్మ బలకింది. చివరకు అదీ ఇదీ ఏదీ లేకుండా చేసింది. ఈ నేపధ్యంలోనే, తెలుగు దేశం ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి చంద్రాబాబు నాయుడు, కొంచెం అలస్యంగానే అయినా, బీజేపీతో తెగ తెంపులు చేసుకున్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు,‘ధర్మ పోరాటం’ చేశారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని జాతీయ స్థాయిలో ఎండగట్టారు. అయినా కేంద్రం లొంగి రాలేదు, అనుకోండి, అది వేరే విషయం. అదలా ఉంటే, 2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ప్రత్యేక హోదా విషయంలో ఎన్నో ప్రగల్బాలు పలికి, ఎన్నో వాగ్దానాలు చేసిన జగన్ రెడ్డి, ఇప్పడు ఏమి సమాధానం చెపుతారు.  నిజమే, ఇప్పుడు ఆయన కొత్తగా  చెప్పేది ఏమీ ఉండక పోవచ్చును. ఎందుకంటే, ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే జగన్ రెడ్డి హోదా విషయంలో చేతులెత్తేశారు. కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు మరొకరి అవసరం లేకుండా, బీజేపీ/ఎన్డీఏకి 350వరకు సీట్లు వచ్చాయి, కాబట్టి, విజ్ఞప్తులు, విన్నపాలు చేయడం తప్పించి ఇక చేయ గలిగింది ఏమీ లేదని, చేతులు ఎత్తేశారు. నిజమే, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో, సంఖ్యాబలం చాలా కీలకం. అందులో సందేం లేదు. ప్రభుత్వాలను ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వాలను కూల్చి వేయడానికి సంఖ్యా బలం చాలా కీలకం. కానీ, ప్రజాందోళనకు, చట్ట సభల్లో సంఖ్యతో సంబంధం లేదు.ఇందుకు మన కళ్ళముందే, ఎన్నో ఉదాహరణలున్నాయి. వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు చేసిన ఆందోళనకు తలోగ్గే  కేంద్ర ప్రభుత్వం చట్టాలను వెనక్కి తీసుకుంది. వరసగా రెండవ సారి సొంత బలంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోడీనే   రైతులకు క్షమాపణలు చెప్పి మరీ చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సో.. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ/కూటమికి సంఖ్యాబలం ఉంది కాబట్టి, అదొక సాకుగా చూపింది కేంద్రంతో కాంప్రమైజ్’ అవుతామంటే, ప్రజలు హర్షించారు. ప్రభుత్వం చేతులు ముడుచుకుని కూర్చున్నా ప్రజలు ఊర్కోరని, ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు హెచ్చరిస్తున్నాయి. ఉద్యమాలు, ఆందోళన కాకపోయినా  రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా, రాజ్యసభలో అనేక కీలక బిల్లులు ఆమోదం పొందడంలో కేంద్ర ప్రభుత్వం వైసీపీ సహా అనేక ప్రాంతీయ పార్టీలపై ఆధార పడింది.అలాంటి సందర్భాలలో కూడా వైసీపీ, జీహుజూర్’ పాలసీనే ఫాలో అయింది కానీ, హోదా సాధనకు అదొక సాధనంగా ఉపయోగించుకునే ప్రయత్నం చేయలేదు. ఇలా గడచిన మూడేళ్ళుగా కేంద్రం అడుగులకు మడుగులొత్తుతూ వచ్చిన జగన్ రెడ్డి ప్రభుత్వం, వైసీపీ పార్టీ  ఇప్పటికైనా,కళ్ళు తెరుస్తారా? ఇప్పుడు మరో మూడు నెలలలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికను అవకాశంగా తీసుకుని, హోదా కోసం పట్టు పడతారా? అంటే, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అలాంటి ఆలోచన చేస్తున్న దాఖాలాలు ఏవీ కనిపించడం లేదని అంటున్నారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎలక్టోరల్ కాలేజీలో బీజేపీ/ఎన్డీఎకి తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు, తమకు ఉన్న 48 శాతం ఓటుకు మరో మూడు శాతం ఓటు తక్కువ పడుతోంది. గతంలో వైసీపీతో పాటుగా అప్పటికి జాతీయ రాజకీయాల్లో తటస్థంగా ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్’ కూడా బీజేపీ అభ్యర్ధులకు మద్దతు ఇచ్చారు. కానీ, ఇప్పుడు, కేసీఆర్ బీజేపీ ప్రత్యర్ధి శిబిరంలో చేరి పోయారు. సో..ఎలెక్టోరల్ కాలేజీలో 4 శాతం బలమున్న వైసీపీ మద్దతు, బీజేపీకి కీలకంగా మారింది. ఏ నేపధ్యంలో ఈ చివరి అవకాశాన్ని అయినా జగన్ రెడ్డి సద్వినియోగం చేసుకుంటారా? రాష్ట్రపతి, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లో మా మద్దతు కావాలంటే, హోదా ఇవ్వాల్సిందే, అని బీజేపీ ముందు రాష్ట్ర ప్రజల డిమాండ్ ఉంచుతారా? లేక, మాములుగా ఎప్పటిలానే,రాష్ట్రం నోట్లో మట్టి కొట్టినా సరే కానీ, అక్రమాస్తుల కేసుల నుంచి కాసింత బయట పడేయండని కేంద్రానికి మళ్ళీ ‘సరెండర్’ అవుతారా?ఇప్పడు ఇదే అందరి నోట వినిపిస్తున్న మాట. మరి జగన్ ఏమి చేస్తరు.. కేంద్రంపై పోరుకు సాయి అంటారా ? సరెండర్ అవుతారా ? చూడవలసి వుందని అంటున్నారు.

Related Posts