YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి తెలంగాణ

టీచర్లకు ఇంగ్లీషు మీడియం క్లాసులు

టీచర్లకు ఇంగ్లీషు మీడియం క్లాసులు

హైదరాబాద్, మార్చి 24,
విద్యార్థులకు పాఠాలు చెప్పే టీచర్లకూ ప్రభుత్వం పాఠాలు చెప్పిస్తోంది. ప్రయివేటు పాఠశాలలకు దీటుగా విద్యాబోధన అందించేందుకు సర్కారు బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్‌ బోధన ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అందులో భాగంగా ఉపాధ్యాయులకు ఇంగ్లీష్‌పై శిక్షణ ఇప్పిస్తోంది. ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి ఆంగ్ల బోధనపై మెళకువలపై అధికారులు తర్ఫిదు ఇస్తున్నారు. అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్కడే ఉండాల్సిన ఆ టీచర్లకు ప్రభుత్వం కనీస సదుపాయాలూ కల్పించడం లేదు ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 4,884 మంది ఎస్జీటీ, ఆంగ్లంలో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఆంగ్ల బోధన శిక్షణ తరగతులకు ఎంపిక చేశారు. ఇదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా టీచర్లను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. హైదరాబాద్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్‌, ఎస్‌జీటీలు కలిపి 2,300 మంది శిక్షణ తీసుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఆంగ్లంలో విద్యాబోధనలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఉపాధ్యాయులకు ఆంగ్ల బోధనపై విద్యాశాఖ ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తోంది. జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి శిక్షణకు రిసోర్సుపర్సన్లుగా 8 మందిని ఎంపిక చేయగా.. రంగారెడ్డి జిల్లా నుంచి 5 మంది, వికారాబాద్‌ నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు శిక్షణ పూర్తి చేసుకున్నారు. రిసోర్సు పర్సన్లుగా శిక్షణ పొందిన వారితో జిల్లా స్థాయిలో ఉమ్మడి జిల్లాలో 110 మందికి ఇటీవల ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లా స్థాయిలో శిక్షణ పొందిన ఉపాధ్యాయులకు పరీక్షలు నిర్వహించి ఉత్తీర్ణులైన వారితో మండల స్థాయిలో ఎంపికైన ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లా స్థాయిలో 110 మందితో 40 సెంటర్ల ద్వారా ఒక్కో సెంటర్‌కు ముగ్గురు రిసోర్స్‌పర్సన్‌లను కేటాయించారు. ఒక్కో సెంటర్‌కు 40 నుంచి 50 ఉపాధ్యాయులు మొత్తం 4,884 మందికి రిసోర్సు పర్సన్లతో ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలో 22 సెంటర్లు, 2600 మంది ఉపాధ్యాయులు, వికారాబాద్‌లో 18 సెంటర్ల నుంచి 2284 మందికి ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు విద్యాశాఖ ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లో 14 సెంటర్లలో శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ తరగతులు ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యాయి. అయితే, శిక్షణాకేంద్రాల్లో కనీస సదుపాయాలు కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. మంచినీళ్లతోపాటు అన్నీ వారే వెంట తెచ్చుకోవాల్సిన దుస్థితి. స్టేషనరీ ఇవ్వడం లేదు. రవాణసౌకర్యం లేదు. అనేక రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని టీచర్లు తెలిపారు. శిక్షణలో సౌకర్యాలు కల్పించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరుతున్నాయి. ఐదు రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతుల్లో భవిష్యత్‌ విద్యాసంవత్సరంలో ప్రస్తుతం విద్యావ్యవస్థల్లో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యాబోధనలు అందిచేందుకు కావాల్సిన పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలోని విద్యార్థులు సైతం ఉన్నత స్థాయిలో రాణించేందుకు ప్రైమరీ నుంచి ఆంగ్లంలో విద్యాబోధన అందించేందుకు తీసుకోవాల్సిన మెళకువలపై ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. ఉమ్మడి జిల్లాలో జిల్లాలో ప్రస్తుతం 80 శాతం ట్రైనింగ్‌ సెంటర్లును ప్రారంభించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నారు.ఆంగ్ల బోధనపై ఉపాధ్యాయులకు శిక్షణ తరగతులు ఐదు రోజుల పాటు ప్రత్యేక తరగతుల ద్వారా నిర్వహించి.. అనంతరం 9 వారాల పాటు ప్రత్యేక సాఫ్ట్‌వేరు ద్వారా ఆన్‌లైన్‌ శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకు ఉపాధ్యాయులను ఆ దిశగా ఆన్‌లైన్‌ తరగతులకు సిద్ధంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులకు అల్టిమేట్‌ జారీ చేస్తున్నారు. వచ్చే ఏడాది విద్యాసంవత్సరానికి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో ఇంగ్లీష్‌ మీడియంలో విద్యార్థులకు బోధన చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. స్కూల్‌, శిక్షణ నడిచేలా ఏర్పాటు చేసినట్టు హైదరాబాద్‌ అధికారులు తెలిపారు.  

Related Posts