విశాఖపట్నం
పెరిగిన గ్యాస్ ధరలను నిరసిస్తూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. పంది మెట్ట జంక్షన్ వద్ద ఉన్న గ్యాస్ గోడం ఎదుట వినూత్న నిరసన నిర్వహించారు. కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఐద్వా నగర కార్యదర్శి పద్మ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని పక్కన పెట్టేసింది అని మండిపడ్డారు. గ్యాస్ ధరలను విపరీతంగా పెంచడంపై మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా మరోసారి గ్యాస్ ధరలు పెంచడం దుర్మార్గపు చర్య అని అన్నారు. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెరగడం వలన నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెట్రోల్ గ్యాస్ ధరలపై నియంత్రణ ఎత్తివేయడం వలన ఆయా కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా బిజెపి ప్రభుత్వం వ్యవహరిస్తోందని తెలిపారు. పెరుగుతున్న ధరల పై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి పెంచిన ధరలను తగ్గించాలని కోరారు.