విశాఖను క్షయ వ్యాధి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు జిల్లా కలెక్టర్ మల్లికార్జునరావు తెలిపారు. నేడు అంతర్జాతీయ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా కలెక్టరేట్ నుండి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ అవగాహన ర్యాలీ ని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మల్లికార్జునరావు మాట్లాడుతూ క్షయ వ్యాధి నిర్ధారణ, నివారణ చర్యల్లో భాగంగా విశాఖ జిల్లాలో 26 ట్రీట్మెంట్ యూనిట్లు, అత్యాధునికమైన ఆర్ టి పి సి ఆర్ పరికరాలతో సేవలు అందిస్తున్నామన్నారు. బాధితులకు చికిత్స కాలంలో నెలకు 500 రూపాయలు, గిరిజన ప్రాంతాల వారికి 750 రూపాయలు పౌష్టికాహారం కొనుగోలుకు ఇస్తున్నామన్నారు. టీబి రోగిని గుర్తించిన ప్రైవేట్ వైద్యులకు ప్రోత్సాహకంగా వెయ్యి రూపాయలు ఇస్తున్నట్లు తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో ఈ నెల 24 నుంచి ఇంటింటా సర్వే ప్రారంభిస్తున్నట్లు తెలిపారు.