YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పడిపోతున్నభూ గర్భజలాలు

పడిపోతున్నభూ గర్భజలాలు

ఖమ్మం జిల్లాల్లో  భానుడి ప్రతాపం ఉగ్రరూపం చూపిస్తున్నాడు. పగటి ఉష్ణోగ్రతలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఉక్కపోత ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఎండలతోపాటు నీటి కష్టాలు కూడా తీవ్రమౌతున్నాయి. గుక్కెడు నీటి కోసం జనం అల్లాడుతున్నారు.ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం కాకరవాయిలో భూగర్భ జల మట్టం అనూహ్యంగా పెరిగింది. గత మార్చిలో 4.12 మీటర్ల లోతులో ఉన్న నీరు ఏప్రిల్‌లో 2.97 మీటర్ల లోతుకు అందుబాటులోకి వచ్చింది. అంటే 1.15 మీటర్ల లోతు నీటి మట్టం పెరిగింది. భక్తరామదాసు ప్రాజెక్టు ద్వారా గ్రామంలోని చెరువులో నీటిని నింపటంతో భూగర్భ జలాలు వృద్ధి చెందాయి. వేంసూరు మండలం కల్లూరుగూడెం, సత్తుపల్లి మండలం చెరుకుపల్లి, తిరుమలాయపాలెం మండలం బచ్చోడు, లకారం చెరువులో నీటి నిల్వ వల్ల ఖమ్మంలో, కొణిజర్ల, బోనకల్లు మండలం ముష్టికుంట్ల, రఘునాథపాలెం మండలం ఈర్లపుడి తదితర గ్రామాల్లో భూగర్భ నీటి మట్టాలు స్వల్పంగా పెరిగాయి. సాగర్‌ కాలువల ప్రాంతంలో చెరువుల్లో నీరు నిల్వ చేయటం, మెట్ట ప్రాంతంలో విద్యుత్తు మోటార్ల వాడకం ఆపేయటంతో భూగర్భ జలాలు పెరిగినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని గ్రామాల్లో మాత్రం భూగర్భ నీటి మట్టం తగ్గుతూనే ఉంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని పలు గ్రామాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోవడమే దీనికి కారణం. అందనంత లోతుకు భూగర్భ జలాలు జారిపోతున్నాయి. మే, జూన్‌ నెలల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని, భూగర్భ జలాలు మరింత లోతుకు దిగజారుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో పరిస్థితి బాగా దిగజారిపోగా.. ఖమ్మం జిల్లాలోనూ అంతంత మాత్రంగానే ఉంది. గతనెల పంటలు కోతకు రావడంతో వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం తగ్గింది. దీంతో ఏప్రిల్‌లో నమోదైన భూగర్భ జలమట్టాలు ఖమ్మం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పెరుగుదల కనిపించింది. మే, జూన్‌ నెలల్లో ఇవి మరింత లోతుకు పడిపోయే ప్రమాదం పొంచి ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సరాసరిన మార్చిలో 11.63 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ నీటి మట్టం ఏప్రిల్‌లో 12.10 మీటర్ల లోతుకు జారిపోయింది. సరాసరిన జిల్లాలో 0.47 మీటర్ల లోతుకు నీరు తగ్గిపోయింది. గోదావరి నది ఒడ్డునే ఉన్న భద్రాచలం పట్టణంలో భూగర్బ జలమట్టం వేగంగా తగ్గిపోతోంది. గత మార్చి నెలలో 11.65 మీటర్ల లోతులో ఉన్న నీరు ఏప్రిల్‌లో 12.55 మీటర్ల లోతుకు జారిపోయింది. అంటే ఒక్క నెలలో 0.90 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. మణుగూరు, పినపాక, గుండాల, కొత్తగూడెం సహా జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో భూగర్భ నీటి మట్టం పడిపోతోంది.

Related Posts