న్యూఢిల్లీ మార్చ్ 24
విద్యా సంస్థల తరగతి గదుల్లో విద్యార్థినులు హిజాబ్ ధరించరాదని కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అత్యవసర విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది. ఈ అపీలుపై విచారణ జరిపే తేదీని ప్రకటించేందుకు తిరస్కరించింది. ఈ అంశాన్ని మరింత సున్నితంగా మార్చవద్దని కోరింది. కర్ణాటక హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పులో హిజాబ్‌ను ధరించడం ఇస్లాం ప్రకారం మతపరమైన ఆచారం కాదని తెలిపింది. విద్యా సంస్థల్లో హిజాబ్ సహా మతపరమైన వస్త్రాలను ధరించడంపై విధించిన నిషేధాన్ని సమర్థించింది. ఈ తీర్పుపై సుప్రీంకోర్టులో అపీలు దాఖలైంది. ఇదిలావుండగా, ఈ తీర్పు చెప్పిన న్యాయమూర్తులు (ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ రితు రాజ్ అవస్థి, జస్టిస్ కృష్ణ దీక్షిత్, జస్టిస్ ఖాజీ ఎం జైబున్నీసాలకు ప్రభుత్వం Y కేటగిరి భద్రత కల్పించింది. తమకు బెదిరింపులు వస్తున్నాయని వీరు తెలియజేయడంతో ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సమక్షానికి ఈ అపీలు వచ్చింది. పిటిషనర్ల తరపున సీనియర్ అడ్వకేట్ దేవదత్ కామత్ వాదనలు వినిపిస్తూ, పరీక్షలు జరగబోతున్నందువల్ల ఈ అపీలుపై అత్యవసరంగా విచారణ జరపాలని గట్టిగా కోరారు. దీనిపై జస్టిస్ రమణ స్పందిస్తూ, పరీక్షలతో దీనికి సంబంధం లేదన్నారు. ఈ అంశాన్ని మరింత సున్నితంగా మార్చవద్దని కోరారు. ఈ అపీలు దాఖలైన సమయంలో దీనిపై హోలీ పండుగ తర్వాత విచారణ జరుపుతామని చెప్పిన సంగతి తెలిసిందే. ఇదిలావుండగా, చాలా మంది విద్యార్థినులు హిజాబ్ నిషేధం నేపథ్యంలో పరీక్షలకు గైర్హాజరైనట్లు తెలుస్తోంది. ఇటువంటివారికి మరోసారి పరీక్షలను నిర్వహించబోమని కర్ణాటక విద్యా శాఖ మంత్రి నగేష్ తెలిపారు.