YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కనుమరుగుతున్న ఒంగోలు గిత్త

కనుమరుగుతున్న ఒంగోలు గిత్త

ఒంగోలు, మార్చి 25,
చక్కని శరీర సౌస్ఠవం.. చూపు తిప్పుకోలేని అందం.. నడకలో రాజసం.. వీటన్నిటి మించి అబ్బురపరిచే తెలివితేటలు.. ఒంగోలు జాతి గిత్తలకు పుట్టుకతో లభించిన వరం. పశువుల జాతిలో ఏ జాతికి లేని లక్షణాలు, ప్రత్యేకతలు ఒంగోలు జాతి గిత్తల సొంతం. ప్రపంచంలో మరెక్కడా ఇలాంటి అపురూప లక్షణాలున్న జాతి పశువుల జాడ ఇంత వరకు లభించలేదు. బండలాగుడు పోటీలు, పశువుల అందాల పోటీలు ఎక్కడ జరిగినా ఒంగోలు జాతి ఎద్దుల ముందు ఎంతటి పశు జాతైనా బలాదూరు కావాల్సిందే.. అయితే ప్రస్తుతం ఒంగోలు జాతి గిత్తల పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలమ్మాల్సిన దుస్థితిలా తయారైంది. వీటి పోషణ భారంగా మారడంతో పెద్ద రైతులు తప్ప సామాన్య రైతులు వీటిని పోషించలేక పోతున్నారు. వీటి అభివృద్ది కోసం ఏర్పాటు చేసిన పశు సంరక్షణ కేంద్రాల్లో నిధుల లేమితో తిండి, నీరు లేక పశువులు బక్క చిక్కిపోతున్నాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తల అభివృద్ది కోసం వట్టి మాటలు కట్టిపెట్టి ఇకనైనా ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు పశు పోషకులు.క్రీస్తు పూర్వం సుమారు 4 వేల సంవత్సరాల క్రితం ఒంగోలు సమీపంలో ఓ అపురూపమైన జాతి పశువుల జాడ వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఇరాన్‌ దేశంగా ఉన్న ఆర్యావర్తనం నుంచి వచ్చినవారితో కలిసి మధ్య ప్రదేశ్‌, హర్యానా మీదుగా ఒంగోలుకు ఈ గిత్తలు వచ్చినట్టు చరిత్ర పరిశోధకులు చెబుతారు. ఆ జాతే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి గిత్తలుగా అవతరించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాలో తూర్పున బంగాళాఖాతం, దక్షిణాన పాలేరు, ఉత్తరాన గుండ్లకమ్మ , పడమర ముసి నదులు ఉన్నాయి. వీటి మధ్య ప్రాంతాన్ని ఒంగోలు ట్రాక్‌ అంటారు. ఈ ట్రాక్‌లో కరవది, ఉలిచి, నాగులుప్పలపాడు, చేకూరపాడు, దొడ్డవరప్పాడు, టంగుటూరు, కారుమంచి, కామేపల్లి ముఖ్య గ్రామాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో జొన్న చొప్పను రైతులు అధికంగా పండించేవారు. ఇక్కడి నేలల్లో సున్నం, భాస్వరం, ఇతర ఖనిజ లవణాలు అధికంగా ఉంటాయి. ఈ నేలల్లో పండిన మొక్కలను ఎక్కువగా ఆహారంగా తీసుకునే ఈ జాతి పశువులు మంచి ఎముక పుష్టి కలిగి ఏపుగా ఎదిగాయి. ఆహారం, వాతావరణం, భూసారం అనుకూలించడంతో ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకుని నిలబడగలిగే రోగ నిరోధక శక్తి ఈ జాతి పశువులకు లభించింది. పాల ఉత్పత్తి, బరువులు లాగడంతో ఈ జాతి పశువులు ప్రపంచంలో మరో జాతి పోటీ పడలేదు. వీటి సామర్ధ్యాన్ని పసిగట్టిన ఆనాటి రైతులు వీటిని వ్యవసాయానికి ప్రధాన సాధనంగా వినియోగించారు. వ్యవసాయం చేయడంలో ఒంగోలు జాతి గిత్తలు మంచి పేరు సంపాదించడంతో వేల సంవత్సరాలుగా ఈ జాతి ఎద్దులు రైతుల బంధువులుగా మారిపోయాయి.వీటికి తెలివితేటలు కూడా ఎక్కువే. యజమాని అభీష్టాన్ని బట్టి నడుచుకోవడం వీటి ప్రత్యేకత. వీటికి సెంటిమెంటు కూడా ఎక్కువే. యజమాని పట్టించుకోకుంటే ఇవి దిగులు పెట్టుకుంటాయి. ఆహారం తీసుకోకుండా మారాం చేస్తాయి. యజమాని కాలం చెందితే, దిగులుతో ఆహారం స్వీకరించకుండా ఆత్మత్యాగం చేసే విశ్వాసం ఒంగోలు జాతి గిత్తది. దీంతో వీటిని పసి పిల్లలతో సమానంగా చూసుకుంటారు రైతులు. ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడుకుంటూ కడుపునిండా దాణా పెడతారు. తిండికి తగ్గట్టుగా ఇవి వ్యవసాయ పనుల్లో చురుగ్గా పాల్గొని రైతులకు మంచి పంట దిగుబడి వచ్చేలా సహకరిస్తాయి. దీంతో ఈ జాతి పశువులు వ్యవసాయంలో మేటిగా నలిచాయి. ఒంగోలు జాతి ఎద్దులు మన దేశంలో కంటే ఇతర దేశాల్లో ఎక్కువగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాయి. ఈ జాతి ఎద్దులను ఇతర దేశాలకు చెందిన రైతులు లక్షల రూపాయలు పెట్టి కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. బ్రెజిల్‌, ఆస్గ్రేలియా, అమెరికా, మెక్సికో, ఇండోనేషియా, ఫిలిప్నీన్స్‌, కొలంబియా దేశాలు వీటిని పెంచి పోషిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఒంగోలు జాతి గిత్తల సంఖ్య 15 కోట్లు ఉంటుందని అంచనా.. అయితే మన దేశంలో వీటి సంఖ్య గణనీయంగా పడిపోయింది. పుట్టి పెరిగిన ఒంగోలు పరిసర ప్రాంతాల్లో వీటి సంఖ్య వేలల్లోనే ఉందంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. వీటి పెంపకం, నిర్వహణ ఖర్చులు అధికం కావడంతో సామాన్య రైతులు వీటికి దూరంగా ఉంటున్నారు. పాత రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఉండటం వల్ల వ్యవసాయం కోసం రైతులు ఎక్కువగా ఒంగోలు జాతి పశువులపై ఆధారపడే వారని, ప్రస్తుతం ఆ పరిస్థితి లేనందువల్ల సన్న, చిన్నకారు రైతులు వీటిని పోషంచలేక పోతున్నారని పశు సంవర్ధక శాఖ అధికారులే ఒప్పుకుంటున్నారు. ఈ జాతి అభివృద్ధిపైనే అన్నపూర్ణగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మనుగడ ఆధారపడి ఉండేది.ఎద్దుల పోటీల్లోనే కాదు, సినిమాల్లో కూడా ఒంగోలు జాతి గిత్తలు ప్రత్యేక పాత్రలు పోషించిన సందర్భాలు ఉన్నాయి. ఎన్టీఆర్‌ నటించిన పెత్తందార్లు, కృష్ణ నటించిన పాడి పంటలు సినిమాలు… తాజాగా బాలకృష్ణ నటించిన అఖండ సినిమాలో కూడా నటించాయి అనేకంటే జీవించాయి అనవచ్చు… ఇలా, చాల సినిమాల్లో ఈ ఒంగోలు జాతి ఎద్దులను ప్రత్యేకంగా చూపించారు. వీటి తెలివితేటల్ని, బలాన్ని, అందాలను సిల్వర్‌ స్క్రీన్‌పై చూసిన ప్రేక్షకులు అబ్బురపడి ఆ సినిమాల్ని సూపర్‌ హిట్‌లు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఈ జాతి ఎద్దుల పోషణ తలకు మించిన భారంగా మారుతుందని రైతులు ఆవేదన చెందుతున్నారు. కేవలం కొంతమంది డబ్బున్న రైతులు స్టేటస్‌ సింబల్‌గా పెంచుతున్నారే కానీ, వీటి పెంపకం వల్ల రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోతుందంటున్నారు. వీటిని పోటీల్లో ప్రదర్శించి, అవి గెలిస్తే గర్వపడి మానసిక సంతృప్తిని పొందుతారు రైతులు. సంక్రాంతి సంబరాల్లో ఒంగోలు జాతి ఎద్దుల పోటీలు ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం ఈ జాతి పశువులను అభివృద్ది చేయడానికేనంటారు రైతులు. మరోవైపు ఈ పోటీల నేపధ్యంలో గిత్తలను కొట్టి హింసిస్తున్నారంటూ కొంతమంది జంతు ప్రేమికులు కోర్టులను ఆశ్రయించిన సందర్భాలూ ఉన్నాయి. అయితే కన్న బిడ్డల కంటే ఎక్కువగా ప్రేమించే ఈ ఒంగోలు జాతి ఎద్దులను రైతులు కొట్టరని, కేవలం పోటీల్లో ఉత్సాహంగా పరుగులు తారని చెబుతారు. ఇలాంటి పందేల్లో పాల్గొనే రైతులకు వచ్చే ఆనందం కోటి రూపాయలు డబ్బులు ఇచ్చినా కలగదంటారు.మనదేశంలోని పశు సంపదలో ఒంగోలు జాతికి విశిష్ట స్థానం ఉంది. ఇతర అన్ని జాతుల కన్నా ఈ జాతి బలిష్ఠంగా ఉంటుంది. ఒంగోలు జాతి ఎద్దులు ఎంతటి భారాన్ని అయినా అలవోకగా మోయడంతో పాటు సేద్యానికి బాగా ఉపకరిస్తాయి. అందువల్లనే మెట్ట భూములు అధికంగా ఉండే జిల్లా రైతాంగం వ్యవసాయానికి ఈ జాతి ఎద్దులను ఉపయోగించేవారు. ఒంగోలు జాతి ఆవులు కూడా ఎక్కువ పాలు ఇస్తాయి. శతాబ్దం క్రితమే ఈ జాతి దేశ, విదేశాలలో పేరు ప్రఖ్యాతులు పొందింది. దీంతో 19వ శతాబ్ద ప్రారంభం నుంచే ఒంగోలు జాతి పశు సంపదను విదేశీయులు, దేశంలోని ఇతర ప్రాంతాల వారు తీసుకెళ్లడం ప్రారంభించారు.1906 నుంచే ఒంగోలు జాతిని తరలించే ప్రయత్నం ప్రారంభమైంది. 1961-62 ప్రాంతంలో బ్రెజిల్‌ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల్లో మధ్యవర్తుల్ని ఏర్పాటుచేసుకుని ప్రతి గ్రామాన్ని జల్లెడ పట్టారు. మేలైన వాటిని గుర్తించి 107 ఆవులతో పాటు కొన్ని ఎద్దులను. జాతీయస్థాయి పశు సదస్సులో ప్రథమ బహుమతి పొందిన కరవది ఎద్దు ఇందులోనే ఉంది. బ్రాహ్మణ, జెబూ జాతి కూడా వీటి నుంచి సృష్టించిందే. అమెరికా, ఆస్ట్రేలియా, మెక్సికో, ఫిలిప్పైన్స్‌, కొలంబియా తదితర 30కి పైగా దేశాల్లో వీటికి ఎంతో డిమాండు ఉంది. మ్యాడ్‌కౌ వంటి వ్యాధుల్ని తట్టుకునే శక్తి మరో కారణం. బయోలాజికల్‌ డైవర్సిటీ చట్టం ప్రకారం ఇతర దేశాలకు వీటిని తరలించాలంటే బోర్డు అనుమతి తప్పనిసరి. అయినా దీన్ని ఖాతరు చేయకుండా కొనుగోళ్లు జరుగుతున్నాయి. ఈ జాతి ఎద్దులను పోషించాలంటే కన్నబిడ్డలకు ఎలాంటి ఆహారం పెట్టి పోషిస్తామో ఆలాంటి ఆహారమే వీటికీ పెడతామంటున్నారు పశుపోషకులు.సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేకంగా నిర్వహించే బండలాగుడు పోటీల్లో పాల్గొనే ఎద్దులను రైతులు ప్రత్యేకంగా పెంచుతారు. వీటిని వ్యవసాయ పనులకు తక్కువగా వినియోస్తారు. వీటికి ప్రత్యేకంగా ఓ మెను కూడా ఉంటుంది. ఆహారం కూడా ఓ క్రమ పద్దతిలో పెడతారు. ఒక్కొక్క ఎద్దుకు ఉదయం పది లీటర్లు, సాయంత్రం పది లీటర్ల పాలు తాగిస్తారు. అనంతరం ప్రాక్టీసు కోసం పరుగు పెట్టిస్తారు. ఉలవలు ఉడికించి తయారు చేసిన ముద్దలు తినిపిస్తారు. కొబ్బరి బొండాం నీళ్ళల్లో గ్లూకోజ్‌ కలిపి తాగించడం, రాగి సంగటి – బెల్లం కలిపి ప్రత్యేకంగా వండిన ఆహారం తినిపిస్తారు. ఇలా పుష్టికరమైన, బలవర్ధకమైన ఆహారం పెడతారు. ఇలా ఒక్కొ జత పశువులకు నెలకు యాభై వేల రూపాయల నుంచి డెభ్భై వేల రూపాయల వరకు ఖర్చు పెడతారు.ఇది నాణానికి ఒకవైపు మాత్రమే…. మరోవైపు హృదయవిదారక వాస్తవాలు ఉన్నాయి. మనకు తిండిగింజలు పెట్టిన ఒంగోలు జాతికి నేడు తిండికి కరువొచ్చింది. తాగునీటికి కటకటలాడుతున్నాయి. అరకొర తిండి….. ఫ్లోరైడ్‌ నీరు….బక్కచిక్కిన శరీరాలు.. పుట్టినింట్లోనే ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడింది ఒంగోలు జాతి. అన్నపూర్ణ ఆంధ్రావనిలో గోమాతలుగా.. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఒంగోలు జాతి పశువులుగా…… సూపర్‌ యానిమల్‌గా పేరు సంపాదించుకున్న ఒంగోలు జాతి పశువుల గురించి అని తెలిస్తే ఎవరికైనా గుండెల్లో కలుక్కు మనక మానదు.. ఒకప్పుడు రాజసానికి మారుపేరైన ఒంగోలు జాతి పశువులు నేడు కడుపునిండా తిండిలేక ఆకలితో అలమటిస్తున్నాయి. వ్యవసాయం ఎలాగూ దండగే అయింది. కనీసం పాడిని కూడా బతికించే పరిస్థితి కనిపించడం లేదు..సనాతన సాంప్రదాయంలో పశుసంతతికి పూజ్యనీయమైన స్థానం ఉంది. గోవుని మనం పూజిస్తాం. వృషభాన్ని పరమశివుని వాహనంగా సేవిస్తాం. మన దేశంలో గోవధ నిషేధచట్టం ఉన్నా.. ఆచరణలో పాలకులకు చిత్తశుద్ధి లేక పోవడం మనం చేసుకున్న దౌర్భాగ్యం అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం నిర్లక్ష్యం చేసి విదేశాలకు వెళ్లిన ఒంగోలు జాతి.. ఇంకా మిగిలివుందని మనం ఆనంద పడాలా..? వారికి ఆహారంగా మారుతోందని బాధపడాలా..? తేల్చుకోవాల్సింది ఇప్పుడు మనమే. ఒంగోలు జాతికి మన రుణం అలాగే మిగిలిపోయింది. కానీ ఆ జాతి మనకు రుణపడి లేదు.. కాబోలు.. గుండెబలం, కండబలం దండిగా ఉన్న ఈ ఒంగోలు జాతి మొనగాళ్ళను రక్షించుకోవాల్సిన బాధ్యత మన తెలుగు రైతులపై ఖచ్చితంగా ఉంది.

Related Posts