విజయవాడ, మార్చి 25,
2019 ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ పని అయిపోయిందనుకున్నారు అందరూ. 23 స్థానాలను సాధించడంతో ఇక పార్టీ కోలుకోలేదని భావించారు. ఇక నలుగురు ఎమ్మెల్యేలు పార్టీ నుంచి తప్పుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. గెలిచిన 23 మందిలో చివరకు మిగిలేది బావ, బామ్మర్ది అన్న సెటైర్లు కూడా రాజకీయంగా వినిపించాయి. కానీ చంద్రబాబు మీద పార్టీ నేతలకు నమ్మకం ఎక్కడా ఏమాత్రం సన్నగిల్లలేదని స్పష్టమయింది. జగన్ స్టేట్ మెంట్ తో... 2019 ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి జగన్ తాను ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను తీసుకోనని, ఒకవేళ వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని జగన్ అసెంబ్లీలోనే చెప్పారు. దీంతో టీడీపీకి పెద్ద రిలీఫ్ దక్కినట్లయింది. అయినా కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలిగిరి, వాసుపల్లి గణేష్ కుమార్ లు వైసీపీకి మద్దతుదారులుగా మారారు. పార్టీలో వీరు నేరుగా చేరకుండా టీడీపీకి దూరంగా, వైసీపీకి దగ్గరగా ఉన్నారు. దీంతో మరికొంత మంది ఎమ్మెల్యేలు కూడా జగన్ వైపు వెళతారన్న ప్రచారం జరిగింది. చంద్రబాబు ప్రతిపక్ష హోదా కూడా పోతుందన్న వారు కూడా లేకపోలేదు. గొట్టిపాటి రవికుమార్, ఏలూరి సాంబశివరావు, గణబాబు వంటి వారు కూడా పార్టీ నుంచి వెళ్లిపోతారని భావించారు. గంటా శ్రీనివాసరావు టీడీపీకి దూరంగా ఉన్నా ఆయన ఏపార్టీలో చేరలేదు. అయితే ఇప్పటి వరకూ నలుగురు తప్ప మరెవ్వరూ పార్టీని వీడలేదు. ఇక ఛాన్స్ లేదు.... ఇక ఎన్నికలకు రెండేళ్లు మాత్రమే సమయం ఉంది. ఈ రెండేళ్లలో పార్టీ నుంచి వెళ్లిపోయే ఎమ్మెల్యేలు ఉండరనే చెప్పాలి. వచ్చే ఎన్నికల్లో తిరిగి తమకు టీడీపీ లో టిక్కెట్ ఖాయమని, మరోసారి విజయం సాధిస్తామన్న నమ్మకం వారిలో ఉండటమే అందుకు కారణం. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నేరుగా టీడీపీ కండువా కప్పుకున్నారు. వారిని చంద్రబాబు పార్టీలో చేర్చుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. కానీ ఈసారి మాత్రం చంద్రబాబు తన ఎమ్మెల్యేలు జంప్ కాకుండా నిలుపుకోగలిగారు