శ్రీకాకుళం, మార్చి 25,
వరి ఇంట అయినా ఆడపిల్ల పుట్టిందంటే టక్కున లక్ష్మీ దేవి పుట్టిందని తెగ సంబర పడతారు… అది అక్షరాలా నిజం చేసింది ఈ పేదింటి చదువుల సరస్వతీ. శ్రీకాకుళం జిల్లా మందస మండలం, రాంపురం గ్రామానికి చెందిన కొంచాడ సింహాచలం, సుహాసిని దంపతులకు ఇద్దరు పిల్లలు. కుమార్తె కొంచాడ స్నేహ కిరణ్, కుమారుడు సూర్య కిరణ్. ఐటీబీపీ పారామిలటరీలో పని చేస్తూ ఉండగా తండ్రి సింహాచలం ఆరోగ్య పరిస్థితి దెబ్బతినడంతో.. 13 ఏళ్ల క్రితం వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని జీడిపప్పు తయారీ కర్మాగారంలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. తల్లి సుహాసిని గృహిణి… అటువంటి పేద ఇంట పుట్టిన ఆడ పిల్ల ఏకంగా ఏడాదికి 44 లక్షల రూపాయలు సంపాదించే కొలువును కైవసం చేసుకోవడంతో ఆ పెద ఇంట సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి.నిరు పేద కుటుంబంలో పుట్టిన ఆ ఇద్దరు పిల్లలకు సరస్వతీ కటాక్షం చిన్నతనంలోనే లభించింది. చదుపై వారికున్న ఆసక్తిని గుర్తించిన చదువు రాని తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ఇద్దరిని ప్రైవేట్ స్కూల్‌లో చదివిస్తూ వచ్చారు. అలా తల్లిదండ్రులు కష్టాన్ని కళ్లారా చూసిన ఆ ఇద్దరు పిల్లలు అహర్నిశలూ శ్రమించి చదువులో ముందు వరుసలో నిలిచారు. వీరిలో కుమార్తె స్నేహ కారణ్‌కు గణితంపై మక్కువ ఎక్కువ. నాలుగేళ్ల క్రితం ఎంసెట్ పరీక్షలో ఏకంగా 7000ల ర్యాంకు సాధించింది. ఈ ర్యాంకుతో విశాఖపట్నం అనిట్స్ లో సీఎస్సీ గ్రూప్ లో సిటు వచ్చింది. చదివిన చదువును సార్ధకం చేసుకునే ఛాన్స్ వచ్చిన స్నేహ ఆ సదావకాశాన్ని సద్వినియోగపరచుకుంది. నాలుగేళ్లపాటు కష్టపడి చదివి చివరి ఏడాదిలో కళాశాల యాజమాన్యం నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో ఏడాదికి ఏకంగా 44 లక్షల రూపాయల ప్యాకేజీతో అమెజాన్ కంపెనీకి ఎంపికైయింది. కరోనా కష్టకాలంలోనూ ఆన్‌లైన్ క్లాసులను బోధించిన అధ్యాపకులు, తోటి విద్యార్ధుల సహకారంతో ఈ కొలువును సొంతం చేసుకున్నట్లు స్నేహ ఆనందం వ్యక్తం చేసింది. ఈ మేరకు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన విజయగాధను పంచుకుంది స్నేహ.