ఏజెన్సీ ప్రాంతాల్లో వాహనచోదకులకు పెట్రోల్, డీజిల్ అందుబాటులో ఉంచేందుకు, గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఏపీలో 20 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) నిర్ణయించింది. ఇందులో ఇప్పటికే 13 పెట్రోల్ బంక్‌లు అందుబాటులోకి వచ్చాయి. వీటి ద్వారా ప్రతి ఏడాది వంద కోట్లకు పైగానే ఆదాయాన్ని ఆర్జిస్తోంది. ప్రస్తుతం ఒక్క విశాఖ జిల్లాలో పది పెట్రోల్ బంక్‌లను నిర్వహిస్తోంది. చింతపల్లి పరిధిలో ఆరు, పాడేరు పరిధిలో మరో నాలుగు పెట్రోల్ బంక్‌లు నడుస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో రంపచోడవరం, అడ్డతీగల, చింతూరు మూడు బంక్‌లున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా కోటరామచంద్రపురంలో త్వరలో కొత్తగా జీసీసీ పెట్రోల్ బంక్ ఏర్పాటుకానుంది. దీంతోపాటు విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం, సాలూరు, పార్వతీపురం ప్రాంతాల్లో కొత్త పెట్రోల్ బంక్‌లు నిర్వహణకు సంస్థ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి జిల్లాలో మారేడుమిల్లి, రాజఒమ్మంగి, చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతాల్లో పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఏపీలోని 13 జిల్లాలకు సంబందించి ఏజెన్సీ ప్రాంతాలు అత్యధిక కలిగి ఉండే ఆరు జిల్లాల్లో 20 పెట్రోల్ బంక్‌లు ఏర్పాటు చేయాలన్నదే జీసీసీ లక్ష్యం. ఏజెన్సీ ప్రాంతాల్లోని వాహనచోదకులు పెట్రోల్, డీజిల్ కోసం మైళ్ళ కొద్దీ వెళ్లాల్సి వచ్చేది. ఏజెన్సీ ప్రాంతాల్లో నివాసం ఉండే వారి అవస్థలు గమనించి జీసీసీ హెచ్‌పీసీఎల్‌తో అవగాహన కుదుర్చుకుంది. ఈ నేపథ్యంలో జీసీసీ స్థలం ఇస్తూ హెచ్‌పీసీఎల్ తరపున డీలర్‌గా వ్యవహరిస్తుంది. కొత్తగా రానున్న మరికొన్ని పెట్రోల్ బంక్‌ల ద్వారా అర్హులైన గిరిజన యువతకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రస్తుతం నిర్వహిస్తున్న బంక్‌ల ద్వారా జోరుగానే విక్రయాలు జరుగుతున్నాయని సంబంధితాధికారి ఒకరు తెలిపారు. దేశంలో మరే ఏజెన్సీ ప్రాంతాల్లో నిర్వహించని రీతిలో సరికొత్త ప్రయోగానికి జీసీసీ మేనేజింగ్ డైరెక్టర్ ఎండీ రవిప్రకాష్ 2016 మార్చిలోనే శ్రీకారం చుట్టారని, ఇది ఇపుడు విజయవంతమైందన్నారు.