న్యూ ఢిల్లీ మార్చ్ 25
అతిపెద్ద ఖండాంతర బాలిస్టిక్ క్షిపణి(ఐసీబీఎం)ని పరీక్షించినట్లు ఇవాళ ఉత్తర కొరియా ప్రకటించింది. హాసాంగ్-17 మిస్సైల్‌ను తొలిసారి 2020లో ఆవిష్కరించారు. భారీ సైజు ఉన్న ఆ క్షిపణిని పరేడ్‌లో ప్రదర్శించారు. 2017 తర్వాత మళ్లీ గురువారం రోజున ఉత్తర కొరియా తొలిసారి ఐసీబీఎంను పరీక్షించినట్లు తెలుస్తోంది. ఖండాంతర క్షిపణులు సుదీర్ఘ దూరం ప్రయాణిస్తాయి. కొరియా నుంచి అమెరికాను కూడా అవి చేరుకోగలవు. వాస్తవానికి ఉత్తర కొరియాపై ఆ క్షిపణుల పరీక్ష బ్యాన్ ఉంది. దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ ఆదేశాల మేరకు గురువారం ఐసీబీఎం పరీక్ష జరిగినట్లు ఆ దేశ మీడియా పేర్కొన్నది.ఉత్తర కొరియా తన ఆయుధ సంపత్తిని పెంచుకుంటోంది. అయితే అణ్వాయుధాల సమీకరణలో ఉత్తర కొరియా కొత్త మైలురాయిని చేరుకున్నట్లు నిపుణులు భావిస్తున్నారు. గురువారం జరిగిన ఐసీబీఎం పరీక్షను జపాన్, దక్షిణ కొరియా మిలిటరీలు ట్రాక్ చేశాయి. ఆ మిస్సైల్ సముద్ర మట్టానికి ఆరు వేల కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లినట్లు జపాన్ తెలిపింది. గంట సేపు ప్‌ంయాణించిన తర్వాత అది జపాన్ జలాల్లో పడినట్లు తెలుస్తోంది. గతంలో హాసాంగ్-15 మిస్సైల్ 4500 కిలోమీటర్ల ఎత్తుకు వెళ్లింది. ఇప్పుడు హాసాంగ్-17 ఆ పాత రికార్డును బ్రేక్ చేసింది.ఒకవళ హాసాంగ్-15 క్షిపణిని.. స్టాండర్డ్ ట్రాజెక్టరీలో పైర్ చేసి ఉంటే, అది దాదాపు 13వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంటుందని నిపుణులు అంటున్నారు. అయితే గురువారం ప్రయోగించిన మిస్సైల్ మరింత ఎక్కువ దూరం వెళ్తుందని నిపుణులు అన్నారు. దీన్ని రాక్షస క్షిపణిగా పిలుస్తున్నారు.