విజయవాడ, మార్చి 26,
ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ను పునర్వ్యవస్థీకరిస్తానని సీఎం వైఎస్ జగన్ అన్నప్పటి నుంచీ ఆశావహుల భజన అవధులు దాటేస్తోంది. జగన్ ను పొడడంతోనే సరిపెట్టుకోకుండా ప్రతిపక్ష నేతలపై అవాకులు చెవాకులు మాట్లాడడానికి కూడా వారు వెనకాడడం లేదు. అసెంబ్లీ వేదికగా కూడా ఈ భజన బృందం తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తోంది. జగన్ ను పొగిడే విషయం యతి ప్రాసల్ని, ఉపమానాల్ని, సామెతలను కూడా వాడేస్తుండడం విశేషం. ఇలాంటి చర్యలన్నీ ఎలాగైనా జగన్ దృష్టిని ఆకర్షించి, కొత్త కేబినెట్ లో బెర్త్ కొట్టేయాలనే ప్రణాళిక ప్రకారమే వారంతా పొగడ్తలు, తెగడ్తలతో రెచ్చిపోతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చ సందర్భంగా రోజా మాట్లాడారు. ఏపీ శాసనసభ బడ్జెట్ సమావేశాల చివరి రోజు శుక్రవారం సభలో నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చేసిన వ్యాఖ్యలు జగన్ రెడ్డిని ఎంతగా పొగిడితే అంత లాభం అనే ధోరణిలో కొనసాగాయని అర్థమవుతోందంటున్నారు. టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ‘అఖండ’ అయితే.. ఆయన బావ, వియ్యంకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడ్ని ‘అనకొండ’ అని, చంద్రబాబు కుమారుడు, ఎమ్మెల్సీ నారా లోకేష్ ను ‘పప్పుండ’ అంటూ అసెంబ్లీ వేదికగా వ్యాఖ్యానించడం పట్ల టీడీపీ వర్గాల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్ ను విమర్శించడంతో ఆగని రోజా జగన్ ను ఏకంగా ‘బంగారుకొండ’ పోల్చారు. ఆ ముగ్గురూ బంగారుకొండ జగన్ ను ఢీకొనడా సాధ్యం కాదనేది రోజా యతి ప్రాసల ప్రసంగం.మరో అడుగు ముందుకేసిన రోజా.. సుపరిపాలనలో జగన్ ఫేమస్ అంటూ భజన చేయడం అందర్నీ ఆకర్షించింది. అక్కడితో ఆపకుండా ఏకంగా దేవుళ్లు, దేవతలతో సమానంగా జగన్ ను పోల్చడంపై సర్వత్రా విమర్శలకు తావిచ్చినట్లయింది. తిరుపతిలో వెంకన్న ఫేమస్ అయితే.. బెజవాడలో కనకదుర్గమ్మ ఫేమస్.. విశాఖపట్నంలో సింహాద్రి అప్పన్న ఫేమస్.. సుపరిపాలనలో జగన్ ఫేమస్ అని ఆమె పొగడాన్ని చూస్తూ అందరూ అవాక్కవుతున్నారు. అంతేకాదట.. గన్ పట్టుకున్న వందమంది పనికిరాని వాళ్ల కంటే గన్ లాంటి ఒక్క జగన్ చాలంటూ కొనియాడడం గమనార్హం.నిజానికి మంత్రి పదవి దక్కించుకోవాలని రోజా ఎన్నాళ్లుగానో ఎదురుతెన్నులు చూస్తున్నారు. తీరా మంత్రివర్గ విస్తరణ చేస్తామని సీఎం జగన్ అన్నప్పటి నుంచి ఆమెకు పోటీగా విడదల రజనీ బరిలోకి వచ్చారు. దీంతో రోజా ఆశలు గల్లంతయ్యే ప్రమాదం ముంచుకొచ్చేలా ఉందంటున్నారు. సామాజిక సమీకరణాలు, జిల్లాల సర్దుబాట్లు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే రోజాకు కేబెనెట్ బెర్త్ దక్కడం కాస్త కష్టమే అంటున్నారు. అయినప్పటికీ చివరి ప్రయత్నాల్లో భాగంగానే రోజా జగన్ ను ఓ రేంజ్ లో అసెంబ్లీ వేదికను ఉపయోగించుకున్నారంటున్నారు. మొదటి నుంచీ రోజా మంత్రి పదవిపై కన్నేశారు. దేవుడిచ్చిన అన్న జగన్ అంటూ ఏ సందర్భం వచ్చినా రోజా చెప్పుకుంటూనే ఉంటారు. అలాంటి దేవుడిచ్చిన అన్న మాత్రం ఎందుకో మంత్రి పదవి మాత్రం ఆమెకు రుచి చూపించడం లేదనే అనుమానాలు పలువురిలో వస్తుండడం గమనార్హం. కేవలం ఏపీఐఐసీ చైర్మన్ పదవితోనే రోజాకు సరిపెట్టడం వెనుక ఏమైనా రహస్యం ఉందా? విశేషం ఉందా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయిరోజాకు హోంమంత్రి పదవిని జగన్ ఈసారి కట్టబెడతారంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అందువల్లో ఏమో ప్రస్తుత హోంమంత్రి మేకతోటి సుచరిత అలికిడి కొద్దిగా తగ్గిపోయినట్లు కనిపిస్తోందంటున్నారు. విడదల రజనీ నుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకుని, పొగడ్తలతోనైనా ఈసారి రోజా మంత్రి పదవి దక్కించుకుంటారో లేదో కేవలం కొద్ది రోజుల్లోనే తేలిపోతుంది.