విజయవాడ, మార్చి 26,
ఏపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు పీఏసీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్. రూ. 48 వేల కోట్లు ఖర్చుకు లెక్కల్లేవంటూ నేను ఏడాది క్రితం చెప్పిన దాన్నే ఇప్పుడు కాగ్ స్పష్టంగా చెప్పింది. ప్రభుత్వం లెక్కలకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కాగ్ భయపడిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవాలి. రూ. 48 వేల కోట్లంటే.. 30 శాతం మేర బడ్జెట్టుకు లెక్కల్లేవని కాగ్ స్పష్టంగా చెప్పింది.ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం లెక్కలు చూపకుండా ఖర్చు పెట్టేస్తే చూస్తూ ఊరుకోవాలా..? ఇప్పటి వరకు ఏ రాష్ట్రానికైనా కాగ్ అన్ క్వాలిఫైడ్ ఓపీనియన్ ఇచ్చింది.. కానీ తొలిసారిగా ఏపీ ప్రభుత్వ లెక్కలను తప్పు పడుతూ క్వాలిఫైడ్ ఓపీనియన్ ఇచ్చింది. లెక్కలకు సంబంధించిన వివరాలు లభ్యం కానప్పుడే కాగ్ క్వాలిఫైడ్ సర్టిఫికెట్ ఇస్తుందన్నారు పయ్యావుల కేశవ్.నేను ఏడాది క్రితం ఇదే చెబితే… ఆనాడు మంత్రి బుగ్గన నా ప్రకటనపై వెటకారాలు ఆడారు. సరిగ్గా ఇదే అంశాన్ని ఏడాది తర్వాత కాగ్ స్పష్టం చేసింది. లెక్కల్లేవంటూ కాగ్ తప్పు పట్టిన అంశం గురించి బుగ్గన ఏం వివరణ ఇస్తారు..? లెక్కల్లేని ఖర్చులకు సంబంధించి ఓ జీవో ద్వారా రాటిఫై చేయడాన్ని కూడా కాగ్ తప్పు పట్టింది. రాటిఫై చేసే అధికారం ప్రభుత్వానికి లేదంటూ కాగ్ స్పష్టంగా చెప్పింది. గ్రాంట్-ఇన్-ఎయిడ్ నిధులు రెట్టింపయ్యాయి.. పన్నుల భారాన్ని పెంచారు.. అప్పుల భారాన్ని పెంచారు. ఇంత చేసినా రూ. 48 వేల కోట్లకు సరైన లెక్కలు లేకుండా పోయాయి. ఎఫ్ఆర్బీఎం లిమిట్ దాటి అప్పులు తీసుకున్నారు.టీడీపీ హయాంలో ప్రతి శాఖలోనూ జరిగిన కేటాయింపులకు ఇప్పటి కేటాయింపులపై చర్చకు సిద్దమా..? అని ఆయన ప్రశ్నించారు. వ్యవసాయ శాఖను ఈ ప్రభుత్వం మూసేసే దిశగా తీసుకెళ్తోంది. వ్యవసాయ శాఖలో జీతభత్యాల పోగా ఈ ప్రభుత్వం రైతు భరోసాకి మాత్రమే ఖర్చు పెడుతున్నారు. వ్యవసాయ శాఖలోని 11 అంశాలకు ఒక్క రూపాయి కూడా కేటాయించ లేదు. ఇరిగేషన్ కోసం టీడీపీ రూ. 60 వేల కోట్లు ఖర్చు పెట్టాం.. మీరఁత ఖర్చు పెట్టారు..? అన్నారు కేశవ్. అప్పులు పెరిగాయి.. ఆదాయం పెరిగింది.. కానీ ఖర్చు తగ్గుతోంది.. మిగిలిన నిధులు ఎక్కడ పోయాయి..? చెప్పాలన్నారు.మేం విజిల్ బ్లోయర్సుగా ఉన్నామని చెప్పడానికే సభలో టీడీపీ సభ్యులు విజిల్స్ వేశారు.సారా మరణాలన్నీ సహజ మరణాలంటారా..?ఈ ప్రభుత్వంలో ఏ ఒక్కటీ సహజంగా లేదు.. సీఎం ప్రకటన కానీ.. బడ్జెట్ లెక్కలు కానీ ఏవీ సహజంగా లేవు.ప్రభుత్వ ఆర్ధిక విధానాలు బాగుండ లేదు.. డబ్బులు ఎక్కడికిపోయాయో తెలియడం లేదు.ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా అడిగితే సమాచారం ఇస్తోందా..?పీఏసీ ఛైర్మన్ హోదాలో సమాచారం ఇవ్వాలని అడిగితే.. సమాచారం ఇవ్వొచ్చా..? అని అసెంబ్లీ కార్యదర్శికి ఓ ఐఏఎస్ లేఖ రాస్తారా..?అసలు ఆ ఐఏఎస్ అధికారిని ట్రైనింగుకు పంపాలని ఎద్దేవా చేశారు పయ్యావుల కేశవ్.