విశాఖపట్నం
దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో మార్చి 28వ తేదీన జిల్లాలోని అన్ని మండల, నియోజకవర్గ కేంద్రాలలో భారీ ప్రదర్శనలు, 29న కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఎదుట నిరసనలు తెలియజేయాలని కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం పిలుపుని చ్చింది. తిరుపతి యశోదా నగర్ లోని ఎంబి భవన్ లో రౌండ్ టేబుల్ సమా వేశం ఈ మేరకు తీర్మానించింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కందారపు మురళి, ఎఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి పి. మురళి, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షులు లేబూరి రత్నకుమార్, టిఎన్ టియుసి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు జయరామిరెడ్డి తదితరులు ప్రసంగిస్తూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం... రాష్ట్రంలోని జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాలు ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న నేపథ్యంలో వీటిని వెనక్కు కొట్టడానికి యావత్ కార్మికవర్గం వీధుల్లోకి రావాలని వారు పిలుపునిచ్చారు. 28, 29 తేదీలలో దేశం అంతటా పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతాయని పాతిక కోట్ల మంది సమ్మెలో పాల్గొంటారని వారు తెలిపారు. ఈ సార్వత్రిక సమ్మెకు రైతాంగ మద్దతు అత్యంత కీలకమైనదని పేర్కొన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేసుకుంటూ ప్రజలను క్షమాపణ కోరిందని... అదే రీతిన కార్మిక చట్టాల రద్దును ఉపసంహరించాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని నిలిపివేయాలని... దేశాన్ని కాపాడుకుందామని పిలుపునిచ్చారు. ఆటో వాలా నుంచి విమాన పైలెట్ దాకా ఈ సమ్మెలో పాల్గొంటున్నారని చిత్తూరు జిల్లాలోని 66 మండలాల్లో కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. 26వ తేదీన అన్ని ప్రాంతాలలో స్కూటర్ ర్యాలీలు జరపాలని 28వ తేదీన భారీ ప్రదర్శన నిర్వహించాలని కోరారు. 28వ తేదీన తిరుపతి నగరంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు భారీ ప్రదర్శన ఉంటుందని... 29వ తేదీన బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఎదుట నిరసన తెలియజేస్తామని ప్రకటించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె నేపథ్యంలో టీటీడీ లాంటి ధార్మిక సంస్థలో ధర్మాన్ని కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. 26వ తేదీన జిల్లా అంతట స్కూటర్ ర్యాలీలు నిర్వహించాలని కోరారు.