న్యూఢిల్లీ
నెలరోజులుగా కొనసాగుతున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం మరింత ఉదృతమయింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ కు చెంపపెట్టులా ఇప్పటికి ఏడుగురు ఆ దేశ జనరల్స్ హతయినట్లు సమాచారం. ఈ మేరకు పలు వార్తా సంస్థలు కథనాలు ప్రచురించాయి.. తాజాగా లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రేజన్స్టీవ్ మృతి చెందారు. యాకోవ్ రష్య 49వ కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన లెఫ్టినెంట్ జనరల్. మరో ఆర్మీ కమాండర్ జనరల్ వ్లాయిస్లావ్ యేర్సోహ్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈయన ఆరో కంబైన్డ్ ఆర్మ్స్ ఆర్మీకి చెందిన జనరల్. అయితే యేర్సోహ్ను వారం రోజుల క్రితమే బాధ్యతల నుంచి తొలగించారు. ఉక్రెయిన్పై రష్యా మిలిటరీ జరిపిన దాడిలోవ్యూహాత్మక వైఫల్యాల కారణంగా యేర్సోహ్ను బాధ్యతల నుంచి ఆకస్మికంగా తొలగించారు. ఈ ఏడుగురిలో చెచెన్ స్పెషల్ ఫోర్సెస్ జనరల్ మగోమద్ తుషేవ్ కూడా ఉన్నారు. అండ్రే సుఖోవెట్సికి (మేజర్ జనరల్), విటలీ జెరాసిమోవ్ (మేజర్ జనరల్), అండ్రే కోలెస్నికోవ్ (మేజర్ జనరల్), ఒలెగ్ మిట్యయేవ్ (మేజర్ జనరల్), అండ్రే మోర్డివిచేవ్ (లెఫ్టినెంట్ జనరల్) లు వివిధ ప్రాంతాల్లో మృతి చెందారు.
ఈ యుద్ధంలో కేవలం 1,300 మంది సైనిక సిబ్బంది మరణించినట్లు రష్యా అధికారికంగా ప్రకటించింది. అయితే, ఈ సంఖ్య నాలుగు నుంచి ఐదు రెట్లు అధికంగా ఉండొచ్చని పశ్చిమ దేశాలు అంచనా వేస్తున్నాయి.
మరోవైపు, వరుస వైఫల్యాలను చవి చూస్తున్న రష్యన్ సైనికులు తిరుగుబాటుకు దిగుతున్నారని సమాచారం. 37 వ మోటార్ రైఫల్ బ్రిగేడ్ కమాండర్ ను అయనే సిబ్బంది హతమార్చినట్లు కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, రష్యా వాటిని ధృవీకించలేదు.