హైదరబాద్, మార్చి 26,
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్. రాష్ట్రంలో అత్యున్నత ర్యాంక్. సీఎస్‌గా ఇంతటి కీలక పొజిషన్‌లో ఉన్న ఆయన.. అసలు మనవాడే కాదంటే నమ్మాల్సిందే. సోమేశ్ కుమార్ ఏపీ కేడర్ ఆఫీసర్. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత.. ఐదుగురు సభ్యుల కమిటీ సిఫార్సుతో.. సోమేశ్‌ను ఆంధ్రా కేడర్‌కు కేటాయించారు. లెక్క ప్రకారం ఆయన ఏపీకి వెళ్లకుండా.. కమిటీ సిఫార్సులను లెక్క చేయకుండా.. క్యాట్‌ను ఆశ్రయించారు. క్యాట్ ఉత్తర్వులు మేరకు తెలంగాణలో విధులు నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఆశీస్సులు ఫుల్‌గా ఉండటంతో కీలక పదవిలో వెలిగిపోతున్నారీ బీహారీ బాబు. అయితే, సోమేశ్ కుమార్ కేడర్‌పై కేంద్రం పట్టువదలకుండా ప్రయత్నం చేస్తోంది. ఆయన్ను ఏపీకి పంపించాల్సిందేనంటూ పట్టుబడుతోంది. క్యాట్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం హైకోర్టులో గతంలోనే అప్పీల్ చేసింది. అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డీవోపీటీదే పూర్తి అధికారమంటూ కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్యకిరణ్‌రెడ్డి ధర్మాసనం ముందు మరోసారి వాదనలు వినిపించారు. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్‌ను ఆశ్రయించి తెలంగాణకు కేటాయించేలా ఉత్తర్వులు పొందారని హైకోర్టుకు తెలిపారు. క్యాట్ ఉత్తర్వులు రద్దు చేసి.. సోమేశ్ కుమార్‌తో సహా ఆ 15 మంది అధికారులను మళ్లీ ఏపీకి కేటాయించాలని వాదించారు. ఆ జాబితాలో త్వరలో డీజీపీ అవుతారంటూ ప్రచారం జరుగుతున్న మరో బీహారీ బాస్ ఐపీఎస్ అంజనీకుమార్ కూడా ఉన్నారు.సోమేశ్ కుమార్, అంజనీ కుమార్‌లాంటి వారంతా సీఎం కేసీఆర్‌కు సన్నిహితులుగా ముద్ర ఉంది. అందుకే, రాష్ట్ర విభజనలో వారిని ఏపీకి కేటాయించినా.. క్యాట్ రూపంలో మళ్లీ తెలంగాణకు తీసుకొచ్చుకుంది కేసీఆరే అంటారు. వారికి కీలక పదవులు కట్టబెట్టి.. నెత్తిన పెట్టుకుంటుండటంలోనూ స్వప్రయోజనాలు దాగున్నాయని ఆరోపణ కూడా ఉంది. ఐపీఎస్ మహంతి లాంటి సిన్సియర్ ఆఫీసర్లను క్యాట్ ఆదేశించినా వెంటనే తెలంగాణ కేడర్‌లోకి తీసుకోకుండా ఇబ్బందులు పెట్టిన సర్కారు.. సోమేశ్, అంజనీకుమార్‌లాంటి వాళ్ల విషయంలో మాత్రం మొదటి నుంచీ వన్‌సైడెడ్‌గా ఉంటోందనే విమర్శ కూడా ఉంది. కేంద్ర డీవోపీటీ గట్టిగా వ్యతిరేకిస్తున్నా.. ఏపీ కేడర్‌కు కేటాయించబడిన సోమేశ్, అంజనీలాంటి బీహారీ బాబులకు కేసీఆర్ ఎందుకంత ప్రాధాన్యత ఇస్తున్నారోనంటూ ప్రశ్నలు, అనుమానాలు ఉన్నాయి. తాజాగా, హైకోర్టులో కేంద్రం బలమైన వాదనలు వినిపించింది. బహుషా కోర్టు తీర్పు ఆ అధికారులకు వ్యతిరేకంగా రావొచ్చని అంటున్నారు. అదే జరిగితే, సోమేశ్ కుమార్, అంజనీకుమార్‌లాంటి వాళ్లంతా తట్టాబుట్టా సర్దుకొని ఏపీకి వెళ్లిపోవాల్సిందే. లేదంటే, సుప్రీంకోర్టును ఆశ్రయించి మరికొంత కాలం కాలయాపన చేయొచ్చని తెలుస్తోంది. సోమేశ్ కుమార్‌కు మరో ఏడాదిన్నర సర్వీస్ ఉన్నట్టు సమాచారం. అప్పటి వరకూ కేసీఆర్ సర్కారులో ఎలాగోలా సీఎస్ హోదా అనుభవించాలనేది ఆయన ప్రయత్నం. మరో నాలుగేళ్ల సర్వీస్ ఉన్న ఐపీఎస్ అంజనీకుమార్ మాత్రం కేసును ఎంత ఆలస్యం చేసినా.. ఆయన రిటైర్డ్ అయ్యేలోగా ఏపీకి వెళ్లక తప్పకపోవచ్చని అంటున్నారు