విశాఖపట్నం
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు నిరసనగా తలపెట్టిన విశాఖ బంద్ పాక్షికంగా జరిగింది. తెల్లవారుజామున 6 గంటల నుండి రోడ్లపైకి వచ్చిన బిజెపి, వైసిపి పార్టీలు మినహా అన్ని పార్టీలు బంద్ నిర్వహించారు. మద్దిలపాలెం సెంటర్ వద్ద సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల నేతలు రోడ్లపై బైఠాయించి జాతీయ రహదారిని దిగ్బంధించారు. వామపక్ష పార్టీల నేతలు సిహెచ్ నర్సింగ్ రావు, పడాల రమణ, విమల, తదితరులు రోడ్డుపై బైఠాయించి ఉదయం టిఫిన్ చేస్తూ నిరసన తెలియజేశారు. వామపక్ష పార్టీల కార్యకర్తలు ఆటపాట నిర్వహించారు. దీంతో కొంత సేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా వామపక్ష నాయకులు మాట్లాడుతూ ప్రజల మద్దతుతో విశాఖ బంద్ విజయవంతమైందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వలన ధరలు విపరీతంగా పెరిగాయని, అమలు చేస్తున్న కార్మిక చట్టాల వలన కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని తెలిపారు. విశాఖలోని కేంద్రంగా పరిశ్రమల కార్మికులు బంద్ లో సంపూర్ణంగా పాల్గొన్నారని, నిర్వహిస్తున్న బంద్ కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం విడనాడాలని డిమాండ్ చేశారు.