ఒంగోలు, మార్చి 29,
ఇటీవల జనసేనాని పవన్ కల్యాణ్ కొంతమంది వైసీపీ నేతలను పొగిడారు. అధికార పార్టీలోనూ కొందరు మంచి నేతలు ఉన్నారని.. వారందరికీ నా నమస్కారాలని చెప్పారు. అలాంటి ఇద్దరు ముగ్గురు నేతల్లో ఆనంతో పాటు మాగుంట కూడా ఉన్నారు. పీకే పొగడటంతో వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఒక్క డైలాగ్‌తో మాగుంట ఇమేజ్ మరింత పెరిగిపోయింది. అయితే, వైసీపీలో ఉంటేగింటే అరాచక నేతలే ఉండాలి కానీ, ఇలాంటి మంచి నాయకులు పార్టీలో ఇమడటం ఎలా సాధ్యం? ఆయన గతం టీడీపీలో కొనసాగింది కాబట్టి.. ఆ మాత్రమైనా మంచి పేరు ఉంది. కానీ, వైసీపీలోకి వచ్చాక.. ఎంపీగా గెలిచాక.. ఎందుకొచ్చామా ఈ పార్టీలోకి అన్నట్టు ఉంటున్నారు మాగుంట శ్రీనివాసులురెడ్డి. దేశముదురు బాలినేని శ్రీనివాసరెడ్డితో.. మాగుంట శ్రీనివాసులురెడ్డికి అస్సలు పడటం లేదంటున్నారు. జిల్లాలో మాగుంట వర్గాన్ని బాలినేని టార్గెట్ చేస్తున్నారనేది వాస్తవం. నిత్య వివాదాలతో అధికార పార్టీలో ఉన్నా.. తనకు పలుకుబడి, ప్రాభవం లేకుండా పోయిందని.. జగన్‌తో బంధుత్వం ఉండటంతో మంత్రి బాలినేనిదే హవా కొనసాగుతోందని.. పైగా తన కాంట్రాక్టు పనుల్లో కొర్రీలు పెడుతూ తనను అణగదొక్కే పనులు చేస్తున్నారని ఎంపీ మాగుంట తెగ మండిపడుతున్నారు. ఇలా, వైసీపీలో, జిల్లాలో అత్యంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉండగా.. సడెన్‌గా జనసేనాని పొగడ్తలతో మాగుంట పార్టీలో కొనసాగడంపై పునరాలోచనలో పడ్డారని తెలుస్తోంది. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. మాగుంట వైసీపీని వీడి.. టీడీపీలో చేరేందుకు సిద్ధమైనట్టు సమాచారం. 2014 ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీ ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడి వైసీపీలో చేరి ఒంగోలు లోక్‌సభ స్థానం నుంచి గెలుపొందారు. గెలవనైతే గెలిచారు కానీ.. వైసీపీలో ఆయన అంత సౌకర్యంగా లేరని, గ్రూప్ పాలిటిక్స్‌తో, మరీ ముఖ్యంగా మంత్రి బాలినేని తీరుతో విసుగు చెందారని.. జగన్‌కు చెప్పుకున్నా.. ఓదార్పు దక్కకపోవడంతో.. తన రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచన చేస్తున్నారని తెలుస్తోంది.ఇక, వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు రాఘవరెడ్డితో రాజకీయ అరంగేట్రం చేయించాలని భావిస్తున్నారు మాగుంట. ఇప్పటికే ఈ విషయం పలుమార్లు పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి చెవిన వేశారట. అయితే, ఆయన నుంచి ఎలాంటి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోవడంతో.. తన కొడుకు పొలిటికల్ కెరీర్‌పై మాగుంటకు భయం పట్టుకుందట. మంత్రి బాలినేనిని కాదని జిల్లాలో నెగ్గుకరాలేమని.. తన కుటుంబ ఎదుగుదలను ఆయన ఎలాగూ అడ్డుకుంటారు కాబట్టి.. వేరే దారి చూసుకోవడమే చూసుకోవడమే బెటర్ అనేది ఎంపీ ఆలోచనలా ఉంది. మార్కాపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తన తనయుడు రాఘవరెడ్డిని బరిలో దింపాలని ఆయన భావిస్తున్నారు. అయితే, ఆ స్థానంపై అధిష్టానం నుంచి సానుకూలత రాకపోవడంతో.. వైసీపీని వీడి టీడీపీలో చేరితే ఎలా ఉంటుందని తన సన్నిహితులతో చర్చిస్తున్నారని సమాచారం. మరోవైపు, మాగుంట ప్రపోజల్‌కి టీడీపీ వర్గాల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని అంటున్నారు. శ్రీనివాసులురెడ్డికి ఎంపీ టికెట్, ఆయన కుమారుడికి మార్కాపురం అసెంబ్లీ సీటు ఇచ్చేందుకు సైకిల్ పార్టీ సిద్ధంగా ఉందనే మెసేజ్ మాగుంటకు చేరిందట. వైసీపీలో ఎలానూ ఇమడలేకపోతున్నారు. బాలినేనితో వేగలేకపోతున్నారు. తనయుడి భవిష్యత్తును బలి చేయలేకపోతున్నారు. అటు, జనసేనాని దగ్గర తనకు మంచి ఇమేజ్ ఉంది. టీడీపీ సైతం తనను కావాలని అనుకుంటోంది. ఇలా వైసీపీలో ఉంటూ టార్గెట్ అయ్యే బదులు.. గౌరవం ఉన్నచోట గెలుపు కోసం ప్రయత్నిస్తే బెటర్ అనేది మాగుంట శ్రీనివాసులురెడ్డి ఆలోచనలా తెలుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు తొందరపడకుండా.. ఎన్నికల వరకూ వేచి చూసి.. టీడీపీ-జనసేన పొత్తు కుదిరితే.. పార్టీ మారేందుకు, పసుపు కండువా కప్పుకునేందుకు ఎంపీ మాగుంట ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు. అదే జరిగితే బలమైన అభ్యర్థి లేని లోటు.. ఒంగోలు వైసీపీకి కోలుకోలేని దెబ్బే అవుతుంది.