ముంబై, మార్చి 29,
కొత్త కార్లు కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లకు ఆటో కంపెనీలు బ్యాడ్‌న్యూస్ చెప్పాయి. వచ్చే నెల నుంచి ధరలను పెంచుతున్నట్టు ప్రకటించాయి. కమోడిటీలు స్టీల్, అల్యూమినియం, ఇతర విలువైన మెటల్స్ ధరలు పెరగడంతో.. ముడిసరుకుల ఖర్చులు అధికమయ్యాయని కంపెనీలు చెప్పాయి. ఈ ఖర్చులను ధరల పెంపు ద్వారా కాస్త మేర వినియోగదారులకు బదలాయిస్తున్నట్టు పేర్కొన్నాయి.
టయోటా కిర్లోస్కర్.. ఆటో కంపెనీ టయోటా కిర్లోస్కర్ తన మోడల్స్ అన్నింటిపై 4 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతుండటంతో.. కార్ల ధరలను పెంచుతున్నట్టు తెలిపింది. టయోటా ఫార్చ్యూనర్, ఇన్నోవా క్రిస్టా వంటి మోడల్స్‌ను విక్రయిస్తోంది.బీఎండబ్ల్యూ.. ఆటోమొబైల్ దిగ్గజం బీఎండబ్ల్యూ ఇండియా కార్ల ధరలను పెంచుతున్నట్టు చెప్పింది. దేశవ్యాప్తంగా తన అన్ని మోడల్స్‌పై 3.5 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు బీఎండబ్ల్యూ ప్రకటించింది. కొత్త ధరలు ఏప్రిల్ 1, 2022 నుంచి అమల్లోకి రాబోతున్నాయని పేర్కొంది. రష్యా-ఉక్రెయిన్ల మధ్య నెలకొన్న సంక్షోభంతో.. కమోడిటీల సప్లయిపై ప్రభావం పడిందని కంపెనీ చెప్పింది. ప్రస్తుతం చోటు చేసుకున్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల ప్రభావాన్ని కొంత మేర ధరల రూపంలో వినియోగదారులకు బదలాయించాల్సి వస్తుందని పేర్కొంది.టాటా మోటార్స్.. దేశీయ కార్ల కంపెనీ టాటా మోటార్స్ బ్యాడ్‌న్యూస్ చెప్పింది. తన కమర్షియల్ వాహనాలపై ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ ధరల పెంపు 2 శాతం నుంచి 2.5 శాతం వరకు ఉంటుందని తెలిపింది. వచ్చే నెల 1 నుంచి అంటే ఏప్రిల్ 1, 2022 నుంచి పెంచిన ధరలు అమల్లోకి రానున్నట్టు ప్రకటించింది. ఇండివిడ్యువల్ మోడల్, వేరియంట్ ప్రకారం ధరల పెంపు ఉందని టాటా మోటార్స్ చెప్పింది.‘పెరిగిన ఖర్చులను కొంత మేర తగ్గించుకునేందుకు కంపెనీ చర్యలు ప్రారంభించింది. తయారీలో పలు లెవల్స్‌లో ఖర్చులు పెరిగాయి. ఈ ఖర్చులను కాస్త ధరల పెంపు ద్వారా తగ్గించుకోవాల్సి వస్తుంది’ అని టాటా మోటార్స్ తెలిపింది.మెర్సిడెస్ బెంజ్.. మెర్సిడెస్ బెంజ్ కూడా తన మొత్తం మోడల్స్‌పై ఏప్రిల్ 1 నుంచి 3 శాతం వరకు ధరలు పెంచుతున్నట్టు తెలిపింది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల ప్రభావంతో ఈ ధరల పెంపు చేపడుతున్నామని పేర్కొంది. దీంతో వచ్చే నెల నుంచి మెర్సిడెస్ బెంజ్ కార్లపై ధరలు రూ.50 వేల నుంచి రూ.5 లక్షల వరకు పెరగనున్నాయి.