YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

10 ఏళ్లలో 28 వేల అర్థాంతర చావులు

10 ఏళ్లలో 28 వేల అర్థాంతర చావులు

గౌహాతి, మార్చి 29,
అమ్మ తిట్టిందనో.. పరీక్ష కాలేదనో.. ఆర్థిక ఇబ్బందులో.. అక్రమ సంబంధాల వల్లో చాలామంది ప్రాణాలు తీసుకుంటున్నారు. చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు ఇదే పరిస్థితి. క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకుని.. అర్ధాంతరంగా తనువు చాలిస్తున్నారు. దాంతో కన్నవాళ్లకు కడుపు కోత మిగులుతుంది. ఈ ఆత్మహత్యల వల్ల కొందరు పిల్లలను కోల్పోతుంటే.. మరికొందరు పెద్ద దిక్కును కోల్పోయి అనాథలుగా మారుతున్నారు. చిన్న సమస్యలకు ప్రాణాలు తీసుకోవడం పరిపాటిగా మారింది. ఇదే విషయం మరోసారి స్పష్టమైంది. అసోం రాష్ట్రంలో వేలాది మంది బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు.అసోంలో 2012 నుంచి ఇప్పటి వరకు 28,056 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆ రాష్ట్ర సీఎం తెలిపారు. అసెంబ్లీలో సోమవారం ఓ ప్రశ్నకు రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ ఆత్మహత్యలన్నీ కుటుంబ వివాదాలు, ఆర్థిక ఇబ్బందులు, అక్రమ సంబంధాలతో సహా ఇతర కారణాల వల్ల కూడా జరిగాయి. విచారణలో ఈ విషయం తేలిందని సీఎం చెప్పారు. ఆత్మహత్యలతో పాటు హత్యలు, లైంగిక దాడులు, ఇతర నేరాలు కూడా ఎక్కువగానే జరిగాయి.ఈ పదేళ్లలో 12,703 హత్య కేసులు, 111 హత్యా, అత్యాచారాలు, 18,519 లైంగిక దాడులు, 31,360 వేధింపులు నమోదయ్యాయని ముఖ్యమంత్రి తెలిపారు. 2017 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు దొంగతనం, అత్యాచారం, కిడ్నాప్, హత్య, దోపిడీ వంటి తొమ్మిది రకాల నేరాలకు సంబంధించి మొత్తం 1,19,800 కేసులు నమోదయ్యాయని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2011-2016 మధ్య సంబంధిత నేరాల సంఖ్య 85,224 ఉండగా, 2016 నుంచి 2022 ఫిబ్రవరి వరకు 10,651 సైబర్ క్రైమ్ కేసులు కూడా నమోదయ్యాయని సీఎం చెప్పారు. అయితే రాష్ట్రంలో ఆత్మహత్యలు ఎక్కువగా ఉండడంతో దానికి సంబంధించి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. మానసిక ఆరోగ్య పరిస్థితిని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చెప్పారు.2021లో ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ఏటా సగటున ఎనిమిది లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టు తేలింది. 15 నుంచి 29 ఏళ్ల మధ్య వయస్సు వారి మరణాలకు రోడ్డు ప్రమాదాలు ఒక కారణం అయితే.. రెండో ప్రధాన కారణం ఆత్మహత్యలే అని తెలిసింది. ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్న ఆత్మహత్యల నివారణకు అందరూ కృషి చేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ కోరింది. ఇది ఒక ఏడాది సమస్య కాదు. ప్రతి ఏడాది ఆత్మహత్యలు అందరిలో కలవరం పుట్టిస్తున్నాయి. అందులోనూ యువతే ఎక్కువగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్టు తెలుస్తుంది.

Related Posts