న్యూఢిల్లీ, మార్చి 29,
రాష్ట్రపతి రామ్ నాధ్ కొవింద్ పదవీకాలం మరో మూడు నెలల్లో ముగుస్తుంది. భారత 14వ రాష్ట్రపతిగా రామనాథ్ కొవింద్ 2017 జూలై 25 ప్రమాణస్వీకారం చేశారు. సో ..ఆయన ఐదేళ్ళ పదవీ కాలం 2022 జులై 24తో ముగుస్తుంది. ఈ నేపధ్యంలో ఈ సంవత్సరం జులైలో జరిగే రాష్ట్రపతి ఎన్నిక పై ఇటు రాజకీయ వర్గాల్లో, అటు మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. నిజానికి ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా, బీజేపీ అభ్యర్ధి గెలుపు అంత ఈజీ కాదనే అనుకున్నారు. నిజం, బీజేపీ నాయకులు కూడా అదే అభిప్రాయం వ్యక్త పరిచారు. ప్రతిపక్షాలు కూడా అధికార పార్టీకి గట్టి పోటీ ఇవ్వగలమనే విశ్వాసంతో వ్యూహాలు రచించుకున్నాయి. శరద్ పవార్ మొదలు కేసీఆర్’ దాకా చాలా మంది పేర్లను ప్రతిపక్ష పార్టీలు చర్చకు తెచ్చాయి. అలాగే, కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేత గులాంనబీ ఆజాద్, బీస్పీపీ అధినేత్రి మాయావతితో పాటుగా బీజేపీకి కొంచెం దగ్గరగా ఉండే మరికొందరి పేర్లు కూడా ప్రముఖంగా వినిపించాయి. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో దేశంలో బీజేపీ తన మరింత బలాన్ని పెంచుకుంది. ఇటు అసెంబ్లీలోబలం పెరగడంతో పాటుగా, మార్చి 31న జరిగే రాజ్యసభఎన్నికల తర్వాత పెద్దల సభలోనూ బీజేపీ బలం మొదటి సారిగా, మూడంకెల సంఖ్య (100) మార్క్’ను దాటుతోంది. మరో వంక వైసీపీ, బీజేడీ వంటి విపక్ష మిత్ర పక్షాల మద్దతు ఎటూ ఉంటుంది కాబట్టి, బీజేపీ అభ్యర్ధి ఎవరైనా, ఆ అభ్యర్థి గెలుపు లాంఛనమే అనేది ఇప్పటికే తేలిపోయింది. రాష్ట్రపతిని పార్లమెంట్ ఉభయ సభల సభ్యులు 776 మందితో పాటుగా, దేశం మొత్తంలో ఉన్న 4,120 మంది ఎమ్మెల్యేలతో కూడిన ఎలక్ట్రోల్ కాలేజీ ఎన్నుకుంటుంది. మొత్తం ఎలక్ట్రోల్ కాలేజ్‌లో ఓట్ల సంఖ్య 10,98,903 కాగా.. ఇందులో బీజేపీ బలం సగం కంటే ఎక్కువే ఉంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్రపతి ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు విషయంలో పెద్దగా శ్రమ పడవలసిన అవసరం లేదని, అంటున్నారు. అయితే అభ్యర్ధి ఎవరనే విషయంలో మాత్రం ఇంకా స్పష్టత రావలసి వుంది. రామనాధ్ కోవింద్’కు మరో అవకాశం ఇవ్వవచ్చనే ఉహాగానాలు సాగుతున్నా, అలాంటి అవకాశం ఉండకపోవచ్చని, అంటున్నారు. అలాగే, ఉప రాష్ట్రపతవెంకయ్యనాయుడు కూడా రేసులో ముందున్నారని అంటున్నారు. అలాగే, బీస్పీపీ అధినాయకురాలు మాయావతి పేరు కూడా వినవచ్చినా, ఆమె క్లారిటీ ఇచ్చేశారు. బీజేపీ ఆఫర్ చేసినా స్వీకరించేందుకు ఆమె సుముఖంగా లేరు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదని ఆమె తేల్చి చెప్పారు. రాష్ట్రపతి పదవిని అంగీకరిస్తే, బీఎస్పీ పార్టీ అంతమవుతుందని తెలిసినప్పుడు తాను అలాంటి (రాష్ట్రపతి) పదవికి ఎలా అంగీకరిస్తానని ప్రశ్నించారు. బీజేపీనే కాదు ఏ పార్టీ నుంచి రాష్ట్రపతి పదవికి ఆహ్వానం వచ్చినా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. ఇదిలా ఉండగా, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై పలు పరిశీలనలు అవసరమని, వివిధ అంశాలను బేరీజు వేసుకుని దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ తుది నిర్ణయం తీసుకుంటారని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అయితే, రాజకీయంగా కాంగ్రెస్ అసమ్మతి నేత గులాం నబీ ఆజాద్ లేదా కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహ్మద్ ఖాన్’లలో ఒకరు రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని బీజేపీ అంతర్గత వర్గాల సమాచారంగా వినవస్తోంది. గులాం నబీ రాజ్యసభ పదవీ కాలం ముగిసిన సమయంలో పెద్దల సభలో ప్రధాని మోడీ, ఆయన్ని గురించి గొప్పగా చెప్పడమే కాకుండా ఎమోషన్’కు లోనై కన్నీళ్లు పెట్టుకుంది మొదలు గులాం నబీ కాషాయ దళానికి దగ్గరవుతున్నారు. ఈ సంవత్సరం మోడీ ప్రభుత్వం ఆయన్ని ‘పద్మవిభూషణ్’తో సత్కరించింది. అన్నిటినీ మించి తాజాగా, గులాం నబీ, తమ కుటుంబంతో సహా జమ్ము కశ్మీర్’లో ప్రతి కుటుంబం ఒకప్పుడు హిందువులే అని చేసిన వ్యాఖ్యతో గులాం నబీ, కాషాయం కట్టని కాషాయదారిగా ముద్రవేసుకున్నారు. అదలా ఉంటే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఉమ్మడి అభ్యర్ధిని నిలబెట్టి అధికారపార్టీని ఇరకాటంలో పెట్టాలని ఎంతో కొంత ఉత్సాహం చూపిన విపక్షాలు, ఇప్పుడు ఎవరిని బరిలో దిచాలనే విషయంలోనే కాదు, అసలు పోటీకి దిగాలా వద్దా అనే విషయంలోనూ పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది.