హైదరాబాద్, మార్చి 29,
మోదీకే సవాల్ విసురుతున్న మొనగాడు కేజ్రీవాల్. బీజేపీకే కొరుకుడుపడని ఆమ్ఆద్మీ పార్టీ.. ఇప్పుడు హస్తిన నుంచి యావత్ దేశాన్ని తన చీపురుతో ఊడ్చేయాలని చూస్తోంది. ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో పాగా వేసింది. నార్త్‌లోనే కాదు సౌత్ ఇండియాపైనా ఫోకస్ పెట్టింది. దక్షిణాదిలో ఆప్ మెయిన్ టార్గెట్ తెలంగాణనే అంటోంది.ఇటీవల కేజ్రీవాల్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లిన కేసీఆర్‌కు చుక్కలు చూపించారు. రెండు మూడు రోజుల పాటు తప్పించుకు తిరిగారు. ఇక లాభంలేదని కేజ్రీవాల్‌ను కలవకుండానే కేసీఆరే ఢిల్లీ నుంచి ఉత్తచేతులతో తిరిగొచ్చేశారు. ఆయన అప్పుడు ఎందుకలా గులాబీ బాస్‌కు ముఖం చాటేశారో ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తెలంగాణలో పాగా వేసేందుకు పరిస్థితులు ఆమ్ఆద్మీ పార్టీకి అనుకూలంగా ఉన్నాయని కేజ్రీవాల్ భావిస్తున్నారు. అందుకే, ఉత్తరాది తర్వాత ఆప్ ప్రధానంగా తెలంగాణపైనే దృష్టి సారించింది. అందులో భాగంగానే కేజ్రీవాల్ తన ప్రధాన అనుచరుడు, ఆప్ కీలక నేత సోమనాథ్ భారతికి తెలంగాణ బాధ్యతలు అప్పగించారు. త్వరలోనే కేజ్రీవాల్ సైతం తెలంగాణలో పాదయాత్ర చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అసలే మాజీ ఐఆర్ఎస్ అధికారి. మోదీ-బీజేపీలకే ఢిల్లీలో ఢక్కామొక్కీలు తినిపించిన లీడర్. బెస్ట్ సీఎంగా ప్రజల మన్నన పొందుతున్న మిస్టర్ క్లీన్. ఢిల్లీని అప్పులు లేని రాష్ట్రంగా మార్చిన సీఎం. నగరవాసులకు ఉచితంగా నీళ్లు-కరెంట్ ఇస్తున్నారు. త్వరలోనే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఇటీవల విజన్ కూడా ప్రకటించారు. ఈ ఘనచరిత్ర చాలదా.. తెలంగాణలో ఆప్ పాతుకుపోవడానికి. తెలంగాణ రాష్ట్రం సాధించుకుందే నీళ్లు, నిధులు, నియామకాల కోసం. ఆ మూడింటినీ ఢిల్లీలో చేసి చూపించారు సీఎం కేజ్రీవాల్. ఆ మూడు డిమాండ్లనూ కాలరాసి.. ప్రజలను మోసం చేసిన ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. ఆ లెక్కన ఈ ఇద్దరు సీఎంలను పోల్చి చూస్తే.. తెలంగాణకు కావాలసింది కేజ్రీవాల్ లాంటి ముఖ్యమంత్రే. ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీనే.మరి, కేజ్రీవాల్‌ను చూసి తెలంగాణలో ఓటు వేస్తారా? అంటే కష్టమే. ఆయనెలాగూ ఢిల్లీకే సీఎంగా ఉంటారు కాబట్టి, ఆయనతో నేరుగా తెలంగాణకు ఏం ప్రయోజనం అనే డౌట్ రావొచ్చు. అందుకే, ఉద్యమ రాష్ట్రంలో కేజ్రీవాల్ మాదిరే మిస్టర్ క్లీన్ ఇమేజ్ ఉన్న ఉన్నత విద్యావేత్త, సౌమ్యుడు, ఎలాంటి అవినీతి మకిలి అంటని నిఖార్సైన నాయకుడిని ఆప్ తమ తెలంగాణ నేతగా ఎంచుకుందని తెలుస్తోంది. ఆయనే ప్రొఫెసర్ కోదండరాం. టీజేఎస్‌ను ఆప్‌లో కలిపేసుకొని.. సార్‌ను చీపురు పార్టీ చీఫ్ మినిస్టర్ కేండిడేట్‌గా కేసీఆర్‌పై ప్రయోగించాలనేది కేజ్రీవాల్ మాస్టర్ ప్లాన్‌గా తెలుస్తోంది. అవును, నిజమే. ప్రొ. కోదండరాంకు ఆమ్ఆద్మీపార్టీ గ్రాండ్ వెల్‌కమ్ చెప్పిందని సమాచారం. ఉద్యమంలో ఏర్పడిన రాష్ట్రానికి.. ఉద్యమ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న కోదండరాం అయితేనే కరెక్ట్ పర్సన్ అనేది ఆప్ లెక్క. కోదండరాంకు ఉన్న కేసీఆర్ స్థాయి ఇమేజ్.. మిస్టర్ క్లీన్ పాపులారిటీ.. ఆప్‌కు బాగా ఉపయోగపడుతుందని అంచనా. తెలంగాణ జన సమితిని ఆప్‌లో విలీనం చేసి ముందుకొస్తే.. తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుంచుతుందని.. కోదండరాంకు ఇప్పటికే కేజ్రీవాల్ నుంచి ఆఫర్ వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రతిపాదన బాగానే ఉండటంతో సార్ తన సన్నిహితులతో సమాలోచనలు చేస్తున్నారట. నార్త్ పార్టీకి తెలంగాణలో ఏ మేరకు ఆధరణ ఉంటుంది? సొంత పార్టీ కాకుండా ఇలా వేరే పార్టీలో విలీనం అయితే తనకు ఏ మేరకు ప్రాధాన్యం ఉంటుంది? తదితర లాభనష్టాలను బేరీజు వేసుకుంటున్నారని అంటున్నారు. ఆప్‌లో విలీనంపై కోదండరాం సార్ త్వరలోనే ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, కోదండరాంతో పాటు ఉద్యమంలో పని చేసిన పలువురు ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల నేతలు, అప్పటి విద్యార్థి నాయకులనూ, తటస్థులనూ ఆప్ వర్గాలు సంప్రదిస్తున్నాయి. ఎన్నారైలు, కార్మిక సంఘ నేతలూ సోమ్‌నాథ్ భారతితో టచ్‌లోకి వచ్చారని తెలుస్తోంది. ఒకవేళ ఆప్ ప్రపోజల్‌కి కోదండరాం ఓకే చెబితే.. మిగతా వారూ ఆయన వెంటే ఆప్‌లో చేరే అవకాశం ఉందని అంటున్నారు. కోదండరాం సార్ సీఎం కేండిడేట్ అని ప్రకటిస్తే.. మిగతా పార్టీల్లోని పలువురు అసంతృప్త నేతలూ కేసీఆర్‌కు వ్యతిరేకంగా చీపురు పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే, ఎవరొస్తే వారిని పార్టీలో చేర్చుకోకుండా.. కాస్త గుడ్ ఫీడ్‌బ్యాక్ ఉండే నాయకులకే ఆప్ కండువా కప్పాలనేది ఆ పార్టీ స్ట్రాటజీ. మొత్తానికి తెలంగాణలో ఆమ్ఆద్మీల భవితవ్యం కోదండరాం గ్రీన్ సిగ్నల్ మీద ఆధారపడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే, కోదండరాం పార్టీ విలీనం వుండదు…తెలంగాణను వ్యతిరేకించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీ తో పొత్తు వుండదని స్పష్టం చేసారు. దాంతో ఈ ఉహాగానాలకు తెరపడ్డాయి.