తిరుపతి, మార్చి 30,
రాష్ట్రంలో విద్యుత్ వినియోగం పెరుగుతోంది. ఎండలు క్రమంగా పెరగడంతో విద్యుత్ డిమాండ్ కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ఆదివారం రాష్ట్ర గ్రిడ్ డిమాండ్ 230.68 మిలియన్ యూనిట్ల(ఎంయు)కు చేరుకుంది. రాష్ట్రంలోని విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నుంచి 120 ఎంయు, కేంద్ర సంస్థల నుంచి 40-45 ఎంయు వరకు విద్యుత్ అందుబాటులో ఉంది. సుమారు 65 ఎంయుల వరకు డిస్కంలు బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేస్తున్నాయి. ఈ వేసవిలో విద్యుత్ డిమాండ్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని, 240-250ఎంయు వరకు చేరుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం పీక్ డిమాండ్‌లో యూనిట్ ధర రూ.20లతో డిస్కంలు కొనుగోలు చేస్తున్నాయి. సరాసరి రోజుకు యూనిట్ రూ.12.01లతో కొంటున్నాయి. డిమాండ్‌కు తగ్గ సరఫరాను డిస్కంలు అందిస్తాయా లేదా అనే అనుమానం నెలకొంది. ఇప్పుడే డిమాండ్‌కు తగ్గ సరఫరాను అందించలేక సౌత్ రీజియన్ గ్రిడ్ నుంచి విద్యుత్‌ను తీసుకుంటున్నాయి. ఈ అంశంపై పవర్ సిస్టం ఆపరేషన్ కార్పొరేషన్ లిమిటేడ్ (పోస్కో) ట్రాన్స్‌కోకు లేఖలు రాస్తుంది. తీసుకోవాల్సిన దానికంటే అధికంగా తీసుకోవడం వల్ల గ్రిడ్ ఫ్రీక్వెన్సీకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంటుందని హెచ్చరించింది. గ్రిడ్ ఫ్రీక్వెన్సీ 49.9 హెడ్జ్ కంటే తగ్గకుండా, 50.05 హెడ్జ్‌కు పెరగకుండా ఉండాలి. ఈ నెల 22న 900 మెగావాట్ల(ఎంవి) విద్యుత్‌ను ఎపి డిస్కంలు గ్రిడ్ నుంచి తీసుకున్నట్లు ట్రాన్స్‌కో గ్రిడ్ డైరెక్టర్‌కు పోస్కో ఈ నెల 23న లేఖ రాసింది. అధికంగా విద్యుత్ తీసుకోవడం వల్ల ఫ్రీక్వెన్సీ 49.5కు పడిపోయి గ్రిడ్ ప్రమాదంలోకి వెళ్లిందని పేర్కొంది. బొగ్గు కొరత వల్ల హిందూజ పవర్ కార్పొరేషన్ యూనిట్-2 నుంచి 520 ఎంవి, బాయిలర్ ట్యూబ్ లీకేజ్ వల్ల విజయవాడ థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్-1 నుంచి 210 ఎంవి తీసుకున్నట్లు వివరించింది. మరో 210 రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ యూనిట్-3 నుంచి 210 ఎంవి మొత్తంగా 940 ఎంవి విద్యుత్ డిస్కంలు తీసుకున్నాయి. మరోసారి గ్రిడ్ నుంచి అధిక విద్యుత్‌ను తీసుకోకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ఏప్రిల్‌లో సౌత్ రీజియన్ గ్రిడ్ డిమాండ్ పీక్ సమయంలో రికార్డు స్థాయి 62,400 మెగావాట్లకు చేరుకునే అవకాశం ఉందని హెచ్చరించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌ను కచ్చితంగా అంచనా వేసి థర్మల్ కేంద్రాలకు బొగ్గు కొరత లేకుండా చూసుకోవాలని పోస్కో ట్రాన్స్‌కోకు సూచించింది. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరగడంతో డిస్కంలు అక్కడక్కడ కోతలు విధిస్తున్నాయి. ఈ నెల 22న డిమాండ్ 220.37 ఎంయుకు చేరుకోగా, అందులో 5.16 ఎంయల విద్యుత్‌ను డిస్కంలు కోత విధించాయి.