YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిఆర్‌డిఎ ప్లాట్లకు దారేదీ

 సిఆర్‌డిఎ ప్లాట్లకు దారేదీ

విజయవాడ, మార్చి 30,
రాజధాని పరిధిలో పూలింగు పద్ధతిలో భూములిచ్చిన యజమానులకు తిరిగి ఇస్తున్న ప్లాట్లను రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని లేఖలు ఇచ్చారని, అయితే అవి ఎక్కడ ఉన్నాయో, వాటికి వెళ్లే మార్గం ఏమిటో చూపించాలని రైతులు సిఆర్‌డిఎకు లేఖలు రాయనున్నారు. రాజధానిలో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో భూములిచ్చిన రైతులకు సిఆర్‌డిఎ ప్రత్యేకంగా లేఖలు రాసింది. అందులో రైతులు రిజిస్ట్రేషన్లు చేయించుకోవాలని కోరింది. తమను న్యాయపరంగా ఇబ్బందులు పెట్టాలనే ఉద్దేశంతోనే అధికారులు ఇలా చేస్తున్నారని రైతులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి పనులు చేయాలని కోర్టు చెప్తే అవి చేయకుండా భూములు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలని కోరడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రైతులకు తిరిగి ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన ప్లాట్లలో సరిహద్దులు మారిపోయాయి. వాటికి వెళ్లేందుకు రోడ్లులేవు. రికార్డుల్లో ప్లాట్లు కనిపిస్తున్నా భౌతికంగా అక్కడేమీ లేదు. పూర్తిగా ముళ్లకంచెలు పెరిగాయి. గతంలో కొద్దిగా నడిచేందుకు వీలున్నా... ఇప్పుడు అదికూడా లేదు. తమకు ప్లాటు ఎక్కడ ఉందో చూపించాలని, దానికి వెళ్లేందుకు రోడ్లు, అక్కడ సదుపాయాలు ఉన్నాయో లేవో చూపిస్తే తాము రిజిస్ట్రేషన్లు చేయించుకుంటామని రైతులు లేఖలో పేర్కొంటున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం ప్లాట్లను అభివృద్ధి చేసి చూపించాలని వారు లేఖలో కోరనున్నారు. ఇప్పటికీ ప్లాట్లు ఎవరిది ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదని, అలాంటప్పుడు రిజిస్ట్రేషన్‌ ఏ పద్ధతిలో చేస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు. సిఆర్‌డిఎ లేఖ అందిన రైతులందరూ వరుసగా లేఖలు రాస్తారని సమాచారం. సిఆర్‌డిఎ చట్టంలో పేర్కొన్న విధంగా ప్లాట్లలో కనీస సదుపాయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీకి మరోలేఖ రాస్తారని తెలిసింది. చట్టం ప్రకారం ఏర్పాటు చేసిన లేఅవుట్లో సదుపాయాల కల్పన లేదని, దీనికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు కోరనున్నారు. ఇప్పటి వరకూ రాజధాని పరిధిలో 64,757 ప్లాట్లు ఏర్పాటు చేశారు. వీటిల్లో 42,055 ప్లాట్ల రిజిస్ట్రేషన్‌ పూర్తయింది. మరో 22,702 ప్లాట్లు రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంది. 673 మంది రిజిస్ట్రేషన్ల కోసం స్లాట్లు బుక్‌చేసుకున్నారు. వాస్తవంగా మొత్తం రిజిస్ట్రేషన్ల విషయంలో గత ఆరు నెలల కాలంగా పూర్తి మందకొడిగా సాగుతోంది. 2021 సెప్టెంబర్లో 35 మంది, అక్టోబర్లో 71, నవంబర్లో 49, డిసెంబర్లో 92 మంది రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. 2022 జనవరిలో 49 మంది, ఫిబ్రవరిలో 75 ప్లాట్లు మాత్రమే రిజిస్ట్రేషన్‌ అయ్యాయి.
పూలింగుకు భూములు ఇవ్వని రైతుల పొలాలను సేకరణ పద్ధతిలో తీసుకున్నారని, వారికి ఇంతవరకు న్యాయం జరగలేదని రైతులు లేఖలో ప్రస్తావించనున్నారు. సేకరించిన భూముల తాలూకా పరిహారం, చట్టపరమైన హక్కులు ఇంతవరకు రైతులకు చెందలేదని, అలాగే భూములకు సంబంధించిన వ్యవహారంపై కోర్టులో కేసులు ఉన్నాయని, అలాంటప్పుడు తమపై ఎలా ఒత్తిడి తీసుకొస్తారని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Related Posts