YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

వైసీపీలో త్యాగరాజులు..

వైసీపీలో త్యాగరాజులు..

విజయవాడ, మార్చి 30,
వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి గెలవాలి. ఒక్క ఛాన్స్ అంటూ చేసిన నినాదంతో ప్రజలు జగన్ కు అవకాశమిచ్చారు. మరో ఛాన్స్ అనే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఐదేళ్ల జగన్ పాలనను ప్రజలు చూశారు. సంక్షేమ పథకాలను అమలు చేయడంలోనూ, ఇచ్చిన హామీలను అమలు చేయడంలోనూ జగన్ ను కొట్టే వాళ్లే లేరు. కానీ అభివృద్ధి విషయంలో మాత్రం ప్రజలు పెదవి విరుస్తున్నారనే చెప్పాలి. రహదారుల నుంచి చూసుకుంటే ఎక్కడా ఏపీలో అభివృద్ధి కన్పించదన్న విపక్షాల విమర్శలను తోసిపుచ్చలేని పరిస్థితి. అందుకే జగన్ కు రెండోసారి గెలుపు అంత సులువు కాదు. మరోవైపు అన్ని పార్టీలు కలసి పోటీ చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అంటే ఈసారి కూడా ఎన్నికలను జగన్ ఒంటరిగానే ఎదుర్కొనాల్సి ఉంటుంది. హామీలు నెరవేర్చినంత మాత్రాన, సంక్షేమ పథకాలను అమలు చేసినంత మాత్రాన గెలుపు దక్కుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కులాలపై ఆధారపడి నడుస్తుంటాయి. అందుకే జగన్ ఆ దిశగానూ ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అన్ని కులాలను.... కమ్మ, కాపులకు వ్యతిరేకంగా మిగిలిన కులాలను ఏకం చేయాల్సి ఉంటుంది. అది ఎంతవరకూ సాధ్యమనేది చూడాలి. దీంతో పాటు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో దాదాపు 70 మంది వరకూ మార్చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే జగన్ ఎమ్మెల్యేలకు హింట్ ఇచ్చారు. మరో ఏడాది గడువు ఇచ్చినా, ఇకపై ప్రజల్లో ఉండాలని షరతు పెట్టినా అది పైకి మాత్రమే. ఆల్రెడీ టిక్కెట్ దక్కని ఎమ్మెల్యేల జాబితా రెడీ అయిందంటున్నారు. వారిని నేరుగా తన వద్దకు పిలిపించుకుని జగన్ వాస్తవ పరిస్థితిని వివరించే అవకాశముంది. అధికారంలోకి వస్తే పదవి ఇస్తానని హామీ ఇవ్వనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలిస్తే టీడీపీని పూర్తిగా రాష్ట్రంలో కనుమరుగు చేయవచ్చని, ఇందుకు టిక్కెట్ దక్కని వారు పార్టీ విజయం కోసం సహకరించాలని జగన్ స్వయంగా కోరనున్నారని తెలుస్తోంది. త్యాగాలకు సిద్ధమవ్వాలని ఆయనే స్వయంగా పిలుపునిస్తారని చెబుతున్నారు. మరి వైసీపీలో త్యాగరాజులు ఎవరనేది ఎన్నికలకు అతి కొద్ది సమయం ముందే తెలియనుంది.

Related Posts