YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం దేశీయం

వాళ్ల భయమే... ఆయనకు అభయం

వాళ్ల భయమే... ఆయనకు అభయం

పాట్నా, మార్చి 30,
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల అనంతరం, దేశ రాజకీయాల్లో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ (పీకే) పేరు చాలా ప్రముఖంగా వినిపించింది. బెంగాళ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే పీకే, ఇక ‘పొలిటికల్ స్త్రాటజిస్ట్’ అవతారం చాలిస్తున్నానని ప్రకటించారు.అయినా, అట్టేకాలం ఆ మాట మీద నిలబడలేదు. నిన్నమొన్న జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లోనూ, పీకే పూర్తిగాకాకా పోయినా, తృణమూల్ తరపున గోవా, ఉత్తారాఖండ్’లో కాలు కాకపోయినా వేలైతే పెట్టారు. మరో వంక, అదే సమయంలో, తనను తను, విఫల రాజకీయ నాయకుడిగా వర్ణించుకున్నారు. గతంలో జనతా దళ్ యునైటెడ్’లో చేరి, కొద్ది రోజులకే బయటకు వచ్చిన వైనాన్ని గుర్తు చేస్తూ, ఇక ప్రత్యక్ష రాజకీయాలలో వేలు పెట్టను అని కూడా ప్రకటించుకున్నారు. అయితే తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు అన్నట్లుగా నాలుగు  రోజులు తిరగక ముందే, మళ్ళీ, రాజకీయ అవతారం ఎత్తారు. సోనియా గాంధీ మొదలు మమతా బెనర్జీ వరకు శరద్ పవార్ మొదలు స్టాలిన్ వరకు చాలా మంది నాయకులను ఆయన కలిశారు. మంతనాలు సాగించారు. కాంగ్రెస్ సారధ్యంలో బీజేపీ వ్యతిరేక కూటమి ఏర్పాటు క్రతువుకు పౌరోహిత్యం వహించారు. ముంబైలో ఢిల్లీలో బీజేపీ వ్యతిరేక పార్టీలు, నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేశారు.అదే సమయంలో ఆయన కాంగ్రెస్’ పార్టీలో చేరతారంటూ వార్తలొచ్చాయి. రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రాలతో పీకే సుదీర్ఘంగా చర్చలు జరిపారు. నిజానికి ఆ తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన రెండు సంవత్సరాలకు పైగానే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. అయితే, ఎందుకనో కానీ అది కాలేదు. పీకే కాంగ్రెస్ పార్టీలో చేరలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరక పోగా కాంగ్రెస్ పార్టీని, నెహ్రూ గాంధీ కుటుంబ వారసత్వాని ముఖ్యంగా గాంధీ నాయకత్వాని  చులకన చేస్తూ వ్యాఖ్యలు, విమర్శలు చేశారు. కుటుంబ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుద్ధరణ అయ్యే పని కాదని కుండబద్దలు కొట్టారు, అలాగే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ జాతీయ నేతగా ప్రొజెక్ట్ చేసే ప్రయత్నం చేశారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే అసలైన కాంగ్రెస్ పార్టీ అనే విధంగా  భ్రమలు సృష్టించారు. కాంగ్రెస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితాదేవ్‌, గోవా మాజీ ముఖ్య‌మంత్రి లూజిన్‌హో ఫ‌లేరో వంటి కీలక నేతలు, మరికొందరు ముఖ్యనాయకులు కాంగ్రెస్ పార్టీని వదిలి తృణమూల్ తీర్థం పుచ్చుకోవడంలో పీకే పాత్ర కీలకమని ప్రచారం జరిగింది. అలాగే,  మేఘాలయలో రాత్రికి రాత్రి మాజీ ముఖ్యమంత్రి ముకుల్ సంగ్మాతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు హస్తం పార్టీకి గుడ్‌బై చెప్పి, అర్థరాత్రి తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఇది కూడా పీకే పనే అని కాంగ్రెస్ నాయకులు అనేక సందర్భాలలో ఆరోపించారు. రాహుల్ గాంధీతో పాటుగా, ఆయన అనుచర వర్గం పీకే కాంగ్రెస్’లో చేరేందుకు ససేమిరా అంగీకరించేది లేదని పీకే ఎంట్రీని అడ్డుకున్నారు. అయితే ఇప్పుడు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత పీకే కాంగ్రెస్’కు దగ్గరవుతున్నారనే  వార్త ప్రముఖంగా తెర పైకి వచ్చింది. ప్రశాంత్‌ కిశోర్‌తో కాంగ్రెస్‌ మళ్లీ చర్చలు ప్రారంభించింది. వచ్చే సంవత్సరం (2022) చివర్లో జరిగే గుజరాత్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ వ్యూహకర్తగా ప్రశాంత్‌ కిశోర్‌ రంగంలోకి దిగనున్నారన్న వార్తలు పార్టీలో హల్‌చల్‌ చేస్తున్నాయి. అయితే ప్రశాంత్ కిశోర్ ఈసారి, వ్యుహకర్తగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందిస్తారా, లేక కాంగ్రెస్ పార్టీలో చేరి కీలక భూమికను పోషిస్తారా, అనే విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. ఓ వంక  ఇటీవల కాంగ్రెస్‌ పార్టీ  జాతీయ స్థాయి వ్యూహకర్త బాధ్యతలను సునీల్‌ కనుగోలుకు అప్పగించింది. గతంలో కిశోర్‌తో కలిసి పనిచేసిన సునీల్‌ ఇప్పటికే తన పని ప్రారంభించారు. సునీల్ బృందం 2023లో జరిగే కర్ణాటక ఎన్నికల వ్యూహాలను పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రశాంత్‌ కిశోర్‌ సేవలను కేవలం గుజరాత్, హిమాచల్‌ రాష్ట్రాలకు పరిమితం చేస్తే బాగుంటుందని అంటున్నారు. అయితే కిశోర్‌ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని అధిష్ఠాన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అదలా ఉంటే, ప్రశాంత్ కిషోర్’ వ్యూహకర్త పరిధి దాటి, జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి కొద్ది రోజుల క్రితం  ప్రముఖ జర్నలిస్ట్ బర్కాదత్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రశాంత్ కిశోర్, ఏ పార్టీ అనేది చెప్పకపోయినా, 2024 ఎన్నికలకు ముందు రాజకీయ తీర్థం పుచ్చుకుంటానని స్పష్టం చేశారు.అంతే కాకుండా, పీకే సన్నిహిత వర్గాల సమాచారం మేరకు  2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని రూపొందించాలని, ఇందుకోసం తాను కాంగ్రె్‌సలో చేరాలని పీకే ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓవైపు సార్వత్రిక ఎన్నికలలోపు కాంగ్రె్‌సను బలోపేతం చేయడం, మరోవైపు ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడం దిశగా ఆయన కృషి చేస్తున్నట్లు తెలుస్తోంది. కాంగ్రె్‌సలో చేరి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడి పాత్ర పోషించే విషయంపై ఆయన ఇటీవల ఆ పార్టీ అగ్రనేతలు సోనియా, రాహుల్‌, ప్రియాంకలతో కలిసి చర్చించినట్లు సమాచారం. దీంతోపాటు ప్రాంతీయ పార్టీలను జాతీయ స్థాయిలో ఒక కూటమిగా ఏర్పరిచేందుకు ఆయా పార్టీల నేతలతో చర్చలు జరిపారని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.అదలా ఉంటే, 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమి ఫైనల్’గా భావించిన యూపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, అనూహ్యంగా యూపీలో వరసగా రెండవసారి అధికారంలోకి రావడంతో విపక్షాలలో విశ్వాసం నిలిపేందుకు, తద్వారా తమ బిజినెస్ ఇంట్రస్ట్స్’ కాపాడుకునేందుకు పీకే కొత్త డ్రామా తెర మీదకు తెచ్చారనే అనే అనుమానాలు లేకపోలేదు. ఏమైనా, ఎవరు అవునన్నా, ఎవరు కాదన్నా కనీసం 2024 వరకు దేశ రాజకీయాల్లో పీకే’ పేరు వినిపిస్తూనే ఉంటుంది.  మంచైనా చెడైనా, మోడీ, షా జోడికి తోడైన యోగి త్రయాన్ని ఎదుర్క్కోవాలంటే, విపక్షాలకు పీకే తోడు అవసరం అనే భ్రమలను సృష్టించే పీకే, వ్యూహం మాత్రం పక్కగా పనిచేస్తోందని  విశ్లేషకులు భావిస్తునారు. ఒక విధంగా పీకే, బీజేపీ వ్యతిరేక పార్టీల భయాన్ని , బలహీనతలను సొమ్ము చేసుకుంటున్నారనే అభిప్రాయం కూడా వ్యక్త మవుతోంది.

Related Posts